Breaking News

త్రాగునీటి సరఫరాకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి… : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగర పరిధిలోని ప్రజలకు కృష్ణా నది నుండి నీటిని శుద్ధి చేసి మున్సిపల్ కుళాయిల ద్వారా నిత్యం సరఫరా చేయడం జరుగుతోందని, త్రాగు నీటి సరఫరా సమయంలో వార్డ్ సచివాలయ ఎమినిటి కార్యదర్శులు, ఏఈలు క్షేత్ర స్థాయిలో ప్రతి రోజు 10 శ్యాంపిల్స్ తీసి, రిజిస్టర్ లో నమోదు చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల త్రాగునీటి సరఫరాపై జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) పై శుక్రవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఇంజినీరింగ్ అధికారులు, ఎమినిటి కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మున్సిపల్ కుళాయిల ద్వారా సరఫరా అయ్యే నీరు కలుషితం అయితే ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన హానికరమని, కనుక జిఎంసి తరపున పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా కలుషిత నీటి సరఫరా జరిగితే సంబంధించిన ఎమినిటి కార్యదర్శితోపాటు ఏఈలదే భాధ్యత అని కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సోమవారం నుండి ప్రతి సచివాలయం పరిధిలో శ్యాంపిల్స్ వివరాలను ఏపిసిఎంఎం యాప్ లో అప్ లోడ్ చేయాలన్నారు. వార్డ్ సచివాలయాల వారీగా డ్రైన్లలో వెళ్లే పైపు లైన్లను, ఎక్కడైనా లీకులు ఉంటే వాటిని గుర్తించి వాటిని మార్చడానికి, మరమత్తు చేయడానికి సోమవారానికి అంచనాలు సిద్దం చేయాలని ఆదేశించారు. యుజిడి ఓవర్ ఫ్లో జరగకుండా ఎప్పటికప్పుడు మ్యాన్ హోల్స్ దగ్గర శుభ్రం చేయించాలన్నారు. వార్డ్ సచివాలయాల వారీగా పూడిక తీయడానికి ఎంత దూరం డ్రైన్లు ఉన్నాయి, ఎంత ఖర్చు అవుతుంది వంటి వివరాలతో ఏఈలు నివేదిక ఇవ్వాలని, నివేదిక మేరకు టెండర్ పిలవడం జరుగుతుందని పేర్కొన్నారు. గతంలో వర్ష ప్రభావిత లోతట్టు ప్రాంతాల్లో జరిగిన నష్టం పునరావృతం కాకుండా పరిష్కార చర్యలపై రిపోర్ట్ ఇవ్వాలన్నారు.
నగర ప్రజలనుద్దేశించి కమిషనర్ మాట్లాడుతూ తమ ఇళ్లలో వాటర్ ఫిల్టర్ లేదా ఆర్ఓ ఫిల్టర్ ఉంటే వాటిని క్రమం తప్పకుండా శుభ్రపరచుకోవాలని, నీటి నిల్వ పాత్రలను దుమ్ము, దోమలు, పురుగులు పడకుండా ఎల్లప్పుడూ మూత పెట్టి ఉంచాలని కమిషనర్ సూచించారు. శుభ్రపరచిన గ్లాసులు, బాటిళ్లు, పాత్రలతోనే నీరు త్రాగాలని, నిల్వ చేయాలని తెలిపారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ, ప్రతి ఇంటి లేదా అపార్ట్మెంట్‌లోని ఓవర్ హెడ్ ట్యాంక్ మరియు సంప్‌ను రెండు మూడు నెలలకు ఒకసారి తప్పనిసరిగా శుభ్రపరచాలన్నారు. వ్యక్తిగత కుళాయిల పైపులైన్లు కాలువల గుండా పోకుండా చూసుకోవాలని, డ్రెయినేజీ నీరు త్రాగునీటిలో కలవకుండా జాగ్రత్తపడటంతో పాటు నీటి వనరుల దగ్గర చెత్తను ఎట్టిపరిస్థితుల్లోనూ వేయకూడదని స్పష్టం చేశారు. తమ ప్రాంతాలలో త్రాగునీటి పైపులైన్లలో లీకేజీలు గమనించినా, లేదా కుళాయి ద్వారా సరఫరా అయ్యే నీటిలో రంగు, రుచి, వాసనలో ఏవైనా మార్పులు గమనించినా నీటి వృథా, కాలుష్యాన్ని నివారించేందుకు వెంటనే స్థానిక నీటి సరఫరా అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఒకవేళ ఎవరికైనా విరేచనాలు, వాంతులు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నగర ప్రజలు కూడా త్రాగునీటి సరఫరాలో ఏవైనా సమస్యలు ఉంటే నగర పాలక సంస్థ కార్యాలయంలోని కాల్ సెంటర్ 08632345103 కి తెలియజేయాలని సూచించారు.
సమావేశంలో ఎస్ఈ జి.వెంకటేశ్వరరావు, ఈఈలు వేణు, కళ్యాణరావు(ఇంచార్జి), డిఈఈలు, ఏఈలు, ఎమినిటి కార్యదర్శులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *