Breaking News

ఆహార పదార్థాల కల్తీపై ప్రజలు గళం విప్పాలి

-కల్తీరాయుళ్లలో భయం పెరిగేలా కఠిన నిబంధనల కోసం కేంద్రంతో చర్చిస్తాం
-నిర్వీర్యమైన త‌నిఖీ వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం
-సింథటిక్ రంగుల వాడకం- ఆరోగ్యానికి హానికరం
-ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం
-రాష్ట్ర శాసనసభలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆహార పదార్థాల కల్తీపై ప్రజలు ఎప్ప‌టిక‌ప్పుడు గళం విప్పాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ చర్యలతో పాటు ప్రజలు కూడా ఉద్య‌మిస్తే ఆహార పదార్థాల్లో కల్తీని అరిక‌ట్ట‌వ‌చ్చ‌ని, క‌ల్తీపై ప్ర‌జ‌లు ఫిర్యాదులు చేస్తే త‌గు చ‌ర్య‌ల్ని చేప‌డుతున్నామ‌ని తెలిపారు. అలాగే కల్తీకి పాల్పడే వారిలో మరింత భయం పెరిగేలా కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా నిబంధనల మార్పు కోసం పుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ అఫ్‌ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఎఐ) అధికారులతో కూడా చర్చించనున్నామని వెల్లడించారు. రాష్ట్ర శాసనసభలో శుక్రవారం సభ్యులు గల్లా మాధవి, అదిరెడ్డి శ్రీనివాస్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సత్యకుమార్ సమాధాన‌మిస్తూ… గత వైకాపా ప్రభుత్వం ఆహార పదార్ధాల తనిఖీల వ్యవస్థ (ఇన్స్టిట్యూట్‌ అఫ్ ప్రివెంటివ్ మెడిసిన్-ఫుడ్ సేఫ్టీ )ను పూర్తిగా నిర్వీర్యం చేసినందున ప్రజారోగ్యం ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తంచేశారు.తనిఖీల నిర్వహణ, ప్రయోగశాలల ఏర్పాటు, అవసరాలకు తగ్గట్లు సిబ్బంది నియామకాలు చేయడంలో అడుగడుగునా గత వైకాపా ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని ధ్వజమెత్తారు. ఈ పరిస్థితుల్ని చక్కదిద్దే చర్యల్లో భాగంగా ఐపీఎంను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ఆకస్మిక‌ తనిఖీల ద్వారా ఆహార పదార్ధాల నమూనాల సేకరణతోపాటు పరీక్షలు చేయడం వంటి చర్యలను వేగవంతం చేసినట్లు తెలిపారు. ప్రజలు తమ దృష్టికి వచ్చిన ఆహార పదార్ధాల కల్తీ ఘటనల గురించి టోల్ ఫ్రీ నెంబర్లు (1800 425 3857, 08645-297245) ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు.

తనిఖీలు కొనసాగిస్తున్నాం

2023-24 నుంచి 2026 జనవరి వరకు మొత్తం 16,730 నమూనాలు పరీక్షించగా వాటిలో 1,407 నమూనాలు సురక్షితమైనవి కావని, నాణ్యత లేదని, నకిలీ బ్రాండ్ తో విక్రయిస్తున్నారని తేలిందన్నారు. కల్తీకి పాల్పడిన వారిని న్యాయస్థానాల్లో ప్రాసిక్యూషన్ చేయడం ద్వారా జరిమానా విధించ‌డం వంటి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రస్తుతం చట్టప్రకారం ‘ అన్ సేఫ్‌ ‘ కేటగిరిలో మాత్రమే గరిష్టంగా అరునెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంద‌న్నారు. దీనివల్ల కల్తీకి పాల్పడే వారిలో భయం ఉండడంలేదని పేర్కొన్నారు. ప్రస్తుత నిబంధనలను మరింత కఠినతరం చేసేందుకు పుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో సంప్రదిస్తామని తెలిపారు. తిరుమల, తిరుపతి. కర్నూలు, విశాఖ, గుంటూరుల‌లో రాష్ట్ర స్థాయి ప్ర‌యోగ‌శాల‌లు రాబోతున్నాయన్నారు. వీటికి ఎన్ఎబిఎల్‌ అక్రిడిటేషన్ లభిస్తే నమూనాల పరీక్షలు, ఫలితాలకు గుర్తింపు పెరిగి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. ఐపీఎం పరిధిలో 720 పోస్టులు మంజూరు కాగా కేవలం 144 మంది మాత్రమే పనిచేస్తున్నారని తెలిపారు. ఇటీవల 150 పోస్టుల భర్తీకి ముఖ్య‌మంత్రి అనుమ‌తించార‌ని తెలిపారు.

రంగుల ఆహార పదార్ధాల‌తో ఎర-ప్రజలు దూరంగా ఉండాలి

ఇటీవల గుంటూరు, విజయవాడ, రాజమహేంద్రవరం వంటిచోట్ల తనిఖీలు జరిపినప్పుడు ఆహార పదార్ధాల్లో సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు తేలిందని మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ స‌భ‌కు తెలిపారు. చిల్లీ చికెన్ వంటి వంటకాలు ఎర్రగా కనిపించేందుకు, బెల్లంలో కూడా గోధుమ‌ రంగు రావడానికి సింథటిక్స్ కలర్స్ వాడుతున్నట్లు కూడా తమ దృష్టికి వచ్చిందన్నారు. రంగు బాగుందన్న భ్రమలో సదరు ఆహార పదార్థాలను స్వీకరిస్తున్నారన్నారు. వీటిని ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా హానికరమని, దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో ప్రజల్లో మార్పుతెచ్చేందుకు విస్తృతస్థాయిలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నామన్నారు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, ఇత‌ర ప్రదేశాల్లో హోర్డింగుల్ని ఏర్పాటు చేయ‌డం, పోస్ట‌ర్లు, క‌ర‌ప‌త్రాల ద్వారా అవ‌గాహ‌న క‌ల్పించ‌డం వంటి ప్ర‌చార మార్గాల్ని అనుసరిస్తున్నామ‌ని మంత్రి తెలిపారు.

“డార్క్ సోర్ట్స్”పై నిఘా

ఈ-కామర్స్ డార్క్ స్టోర్స్‌ (సత్వర వాణిజ్యం) పై నిఘా పెట్టామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాద‌వ్ శాస‌న స‌భ‌లో వెల్లడించారు. రాష్ట్రంలో 277 ఈ-కామర్స్ స్టోర్లున్నాయని చెప్పారు. డార్క్ స్టోర్ల‌కు ఎఫ్ఎస్ఎస్ఎఐ నుంచి తప్పనిసరిగా లైసెన్స్ పొంది ఉండాలని తెలిపారు. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలకు అనుగుణంగానే వీటిని కూడా ఐపీఎం ద్వారా తనిఖీలు చేస్తున్నామన్నారు. డార్క్ స్టోర్స్ లో 2023-24లో 17, 2024-25లో 27, 2025-26లో ఇప్పటివరకు 24 తనిఖీలు చేప‌ట్టామ‌ని మంత్రి సత్యకుమార్ వివరించారు. రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో ఇటీవ‌ల చోటుచేసుకున్న ఘ‌ట‌న దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *