తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి పట్టణంలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానంలో ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్ మరియు ఆలయ పాలకమండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లక్ష కుంకుమార్చన మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. అమ్మవారి అనుగ్రహం పొందేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఆలయ పాలకమండలి చైర్మన్ మరియు సభ్యుల ఆహ్వానం మేరకు మాజీ మంత్రి, తిరుపతి టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు పానబాక లక్ష్మి కార్యక్రమానికి హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ తన సతీమణి శ్రీగౌరి తో కలిసి సతీసమేతంగా కార్యక్రమానికి హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా డా. పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ తిరుపతి ప్రాంతానికి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉందని తెలిపారు. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తి భావాన్ని పెంపొందించడమే కాకుండా సమాజంలో ఐక్యతను కూడా పెంపొందిస్తాయని పేర్కొన్నారు.
లక్ష కుంకుమార్చన మహోత్సవం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి కుంకుమార్చనలు చేసి తమ కుటుంబాల శ్రేయస్సు, ఆయురారోగ్యాలు మరియు ఐశ్వర్యం కోసం ప్రార్థనలు చేశారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్ మరియు పాలకమండలి సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలకమండలి సభ్యులు, ఆలయ అధికారులు, అర్చకులు, ప్రజాప్రతినిధులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News