తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి నగరంలోని కొత్తవీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో నూతన పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి తిరుపతి ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం తిరుపతి టీడీపీ పార్లమెంట్ అధ్యక్షురాలు, మాజీ కేంద్ర మంత్రి పానబాక లక్ష్మి కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ నూతన పాలకమండలి చైర్మన్‌గా వినోద్ ప్రమాణ స్వీకారం చేయగా, ఇతర సభ్యులు కూడా తమ బాధ్యతలను స్వీకరించారు.
ఈ సందర్భంగా డా. పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ, ఆలయాలు భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని అందించే పవిత్ర స్థలాలు మాత్రమే కాకుండా మన సంస్కృతి, సంప్రదాయాలను తరతరాలకు అందించే కేంద్రాలుగా నిలుస్తాయని తెలిపారు. భక్తుల విశ్వాసం ఆలయాల పునాది అని పేర్కొంటూ, ఆ విశ్వాసాన్ని మరింత బలపరిచే విధంగా పాలకమండలి సభ్యులు బాధ్యతాయుతంగా పని చేయాలని సూచించారు. అలాగే ఆలయ అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇచ్చి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా పాలకమండలి కృషి చేయాలని హరిప్రసాద్ పేర్కొన్నారు. ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, పూజా కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించడం, ఆలయానికి వచ్చే భక్తులకు సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించడం పాలకమండలి ప్రధాన బాధ్యత అని తెలిపారు. ప్రభుత్వం కూడా ఆలయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ అవసరమైన సహకారం అందిస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ పాలకమండలి సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, గ్రీనరీ మరియు బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ, ఆలయ అధికారులు, పాలకమండలి సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది.
Prajavartha Online Telugu News