తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి నగరంలోని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ ఆడిటోరియంలో మహిళా దినోత్సవ వేడుకలు ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్, తిరుపతి ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు, తిరుపతి మునిసిపల్ కమిషనర్ మౌర్యా, మాజీ మంత్రి, టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పానబాక లక్ష్మి, ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ పాల్గొన్నారు.
మహిళల సాధికారతను మరింత బలోపేతం చేయడం, సమాజంలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం వంటి అంశాలపై ఈ కార్యక్రమంలో చర్చించారు. మహిళలు విద్య, వైద్యం, వ్యాపారం, పరిపాలన వంటి అన్ని రంగాల్లో ముందుకు వచ్చి సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. మహిళల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం సమాజ బాధ్యత అని వారు తెలిపారు.
ఈ సందర్భంగా డా. పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ, భారతదేశ సంస్కృతి సంప్రదాయాలలో మహిళలకు అత్యున్నత స్థానం ఉందని అన్నారు. కుటుంబ వ్యవస్థను నిలబెట్టే శక్తి మహిళలేనని, సమాజ నిర్మాణంలో వారి పాత్ర అపారమని ఆయన పేర్కొన్నారు. ఒక కుటుంబం అభివృద్ధి చెందాలంటే ఆ కుటుంబంలోని మహిళ విద్యావంతురాలు కావాలని, ఆమెకు ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వావలంబన కలగాలని ఆయన అన్నారు. మహిళలు విద్య, ఉద్యోగాలు, వ్యాపారం వంటి రంగాల్లో ముందుకు వస్తున్న ఈ కాలంలో సమాజం కూడా వారికి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాలని హరిప్రసాద్ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు మహిళలు స్వయం ఉపాధి ద్వారా కుటుంబాలకు ఆర్థిక బలం అందిస్తున్నారని ఆయన అన్నారు. మహిళల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు వారికి మరింత శక్తినిస్తున్నాయని తెలిపారు. మహిళల భద్రత, గౌరవం కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని హరిప్రసాద్ అన్నారు. మహిళలు సమాజంలో ఎటువంటి భయాందోళనలు లేకుండా ముందుకు సాగేందుకు ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు, సామాజిక సంస్థలు కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. మహిళలు తమ ప్రతిభను చాటుకుంటూ దేశాభివృద్ధికి మరింత తోడ్పాటు అందించాలని ఆయన ఆకాంక్షించారు.
కార్యక్రమం చివరలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ పాలకమండలి సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, గ్రీనరీ మరియు బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ, తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరిగింది.
Prajavartha Online Telugu News