తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తిరుపతి నగరంలోని రాస్ బిల్డింగ్‌లో రమణ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు మరియు ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా డా. పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ మహిళలు సమాజానికి అస్తిత్వం కల్పించే శక్తి అని, కుటుంబ వ్యవస్థను నిలబెట్టే ప్రధాన బలం మహిళలేనని తెలిపారు. నేటి సమాజంలో మహిళలు విద్య, వైద్యం, ఐటీ, వ్యాపారం, రాజకీయాలు, సామాజిక సేవ వంటి అనేక రంగాల్లో విశేష ప్రతిభ కనబరుస్తూ దేశాభివృద్ధికి తమ వంతు పాత్రను సమర్థంగా నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. మహిళలు ధైర్యం, పట్టుదల, కష్టపడే స్వభావంతో ముందుకు సాగితే ఏ రంగంలోనైనా ఉన్నత స్థానాలను అందుకోవచ్చని అన్నారు. మహిళల సాధికారతతోనే సమాజంలో సమానత్వం, అభివృద్ధి మరియు శాంతి సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. మహిళలు తమ హక్కులపై అవగాహన పెంపొందించుకుని విద్య, ఆర్థిక స్వావలంబన ద్వారా మరింత బలంగా ఎదగాలని పిలుపునిచ్చారు. మహిళలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. మహిళల సంక్షేమం, భద్రత మరియు అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలు కూడా స్వయం సహాయక సంఘాలు, చిన్నతరహా వ్యాపారాలు మరియు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఆర్థికంగా బలపడాలని తెలిపారు.
ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు మాట్లాడుతూ మహిళలు కుటుంబంతో పాటు సమాజ అభివృద్ధిలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. మహిళల ఆత్మవిశ్వాసం పెరిగితేనే సమాజం ముందుకు సాగుతుందని, మహిళలు అన్ని రంగాల్లో ముందుండి నాయకత్వం వహించాలని ఆకాంక్షించారు. మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని, వాటిని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో ఐసిడిఎస్ సీడీపీవో సుధారాణి , సూపర్వైజర్లు హేమ, శ్రీదేవి, మాధురి , అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ సెక్రటరీ నాగరాజ, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, స్టాఫ్ నర్సులు మరియు పలువురు మహిళలు పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసి సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
Prajavartha Online Telugu News