గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ర్యాగ్ పికర్స్ కి ఆర్ధికంగా అండగా నిలవడంలో గుంటూరు నగరపాలక సంస్థకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని, దేశ ప్రధాని నరేంద్ర మోడీకి అందించే వీడియో రిపోర్ట్ కోసం కేంద్ర బృందం మంగళవారం నగరంలోని బొంగరాలబీడు, బాలాజీ నగర్ ప్రాంతాల్లోని ర్యాగ్ పికర్స్ అనుభవాలు, అభిప్రాయాలని రికార్డ్ చేసిందని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ర్యాగ్ పికర్స్ ని కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు నేషనల్ సఫాయి కర్మచారీస్ ఫైనాన్స్ అండ్ డెవెలప్మెంట్ కార్పోరేషన్ (ఎన్ఎస్కేఎఫ్డీసి) నమస్తే పధకంలో భాగమైన స్వచ్చత ఉద్యమి యోజన పధకం లబ్దిదారుల విజయగాధలను ఎన్ఎస్కేఎఫ్డీసి నోడల్ అధికారులు నమోదు చేస్తున్నారన్నారు. దేశ వ్యాప్తంగా రాజస్థాన్, తెలంగాణలో వరంగల్, తమిళనాడులోని తిరుచానూరు, ఆంద్రప్రదేశ్ లో గుంటూరు నగరపాలక సంస్థలోనే రికార్డింగ్ జరుగుతుందన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 51 మంది ర్యాగ్ పికర్స్ ని గుర్తించి ఎన్ఎస్కేఎఫ్డీసి ద్వారా బ్యాంక్ సబ్సీడీపై వాహనాలు ఇచ్చారని, వాటి నెలవారీ ఇన్స్టాల్మెంట్ ని జిఎంసి నుండే చెల్లించి, వారికి ఆదాయం కోసం అద్దె రూపంలో కొంత చేల్లిస్తున్నామని పేర్కొన్నారు. గుంటూరు నగరపాలక సంస్థలో ర్యాగ్ పికర్స్ ఆదాయ పెంపు చర్యలపట్ల గతంలోనే ప్రధాని సంతృప్తి వ్యక్తం చేస్తూ, ముత్తమ్మ అనే ర్యాగ్ పికర్ తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడడం జరిగిందన్నారు. ఈ ఏడాది ప్రధానికి అందించే వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని ర్యాగ్ పికర్స్ అభిప్రాయాలను తీసుకున్నారని తెలిపారు.
Prajavartha Online Telugu News