న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
వ్యవసాయం, రైతుల సంక్షేమానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో పంటల ఉత్పాదకత పెంపు అంశంపై తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దిల గురుమూర్తి లోక్‌సభలో ప్రశ్నించారు. వరి వంటి ప్రధాన పంటల దిగుబడులు జాతీయ సగటుతో పోలిస్తే తక్కువగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక పంట ఉత్పాదకత వ్యూహం రూపొందించిందా అని కేంద్రాన్ని అడిగారు. అలాగే జిల్లాల వారీగా దిగుబడి లోటుపాట్లపై అంచనాలు చేసి వాటిని రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకున్నారా, సూక్ష్మ సాగు విధానాలు, మెరుగైన విత్తనాల వినియోగం, వ్యవసాయ సలహా సేవలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల అనుసంధానం వంటి చర్యలు తీసుకుంటున్నారా అని వివరాలు కోరారు.
ఈ ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి సమాధానం ఇచ్చారు. దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ మిషన్ ద్వారా వరి, గోధుమలు, మొక్కజొన్న, పప్పుధాన్యాలు, నూనె గింజలు వంటి పంటల ఉత్పత్తి పెంపు లక్ష్యంగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ప్రతి సీజన్‌కు ముందు విత్తన అవసరాలు అంచనా వేస్తూ కొత్త అధిక దిగుబడి రకాలను ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. సూక్ష్మ సాగునీటి పథకం ద్వారా నీటి వినియోగాన్ని సమర్థవంతంగా ఉపయోగించేందుకు డ్రిప్, స్ప్రింక్లర్ పద్ధతులను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. 2015,16 నుండి 2026 ఫిబ్రవరి వరకు ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 11.49 లక్షల హెక్టార్లలో మైక్రో ఇరిగేషన్ అమలు చేసినట్లు వెల్లడించారు.
రైతు ఉత్పత్తిదారుల సంఘాలను బలోపేతం చేయడానికి రాష్ట్రంలో 716 ఎఫ్‌పీవోలు నమోదు కాగా, 318 ఎఫ్‌పీవోలకు సుమారు రూ.20.84 కోట్ల ఈక్విటీ గ్రాంట్ విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది. రైతులు అధిక విలువ కలిగిన పంటల వైపు మళ్లేందుకు ఉద్యాన పంటల అభివృద్ధి, పంట వైవిధ్యీకరణ, వాల్యూ చైన్ అభివృద్ధి వంటి కార్యక్రమాలు కూడా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే పప్పుధాన్యాల ఉత్పత్తి పెంపు కోసం “మిషన్ ఆత్మనిర్భర్ ఇన్ పల్సెస్”, నూనె గింజల ఉత్పత్తి పెంపు కోసం నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ వంటి పథకాలు అమలులో ఉన్నాయని తెలిపారు.
Prajavartha Online Telugu News