Breaking News

కొనుగోలుదారులు… అమ్మకందారుల సమ్మేళనం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేస్తున్న వివిధ రకాల ఉత్పత్తులకు కొనుగోలు చేసి చేయూత అందించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కొనుగోలుదారులకు పిలుపునిచ్చారు.

మంగళవారం ఉదయం తాడిగడప మున్సిపాలిటీ కానూరులోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో” కొనుగోలుదారులు… అమ్మకందారుల సమ్మేళనం’ పెద్ద ఎత్తున నిర్వహించారు. ఇందులో జిల్లాలో పలువురు స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసి ప్రదర్శనకు ఉంచిన వివిధ అకాల ఆహార ఉత్పత్తులు, వస్త్రాలు, పారిశుద్ధ్య ద్రవ పదార్థాలు, ఆకు పళ్ళెములు తదితర గృహోపకరణ వస్తువులు,సామాగ్రి ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. . ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు.

ఇంజనీరింగ్ కళాశాలలోని ఆడిటోరియం లో మొత్తం 197 ప్రదర్శనశాలలు ఏర్పాటు చేయగా, మహిళా వ్యాపారవేత్తలు కొనుగోలుదారులతో కళకళలాడింది.
జిల్లా కలెక్టర్ ఎంతో ఓపికగా ప్రతి ప్రదర్శనశాల వద్దకు వెళ్లి మహిళలు తయారు చేసిన వస్తువుల ధరలు, తయారీకి అయ్యే ఖర్చు, మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు, వారికి వచ్చే ఆదాయం తదితర వివరాలు, సమ్మేళనంపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయం మేరకు ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్త ఉండాలనే నినాదంతో జిల్లాలోని స్వయం సహా సహాయక సంఘాల మహిళలను వ్యాపారవేత్తలుగా అభివృద్ధి పరిచేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నామన్నారు.

జిల్లాలో నిజంగా జీవితంలో పైకి ఎదగాలనే తపన, కష్టపడే మనస్తత్వం కలిగిన 500 మందిని గుర్తించామని అందులో 300 మందికి ప్రభుత్వ సహకారంతో పాటు పలు పథకాల కింద బ్యాంకు రుణాలు మంజూరు చేయించి వివిధ రకాల యూనిట్లు స్థాపించడానికి తోడ్పాటు అందించామన్నారు

ఇదివరకు వారు తయారు చేసిన ఉత్పత్తులు ఎక్కడ అమ్మాలో తెలియక సరైన మార్కెటింగ్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతుండేవారన్నారు.

వారి వ్యాపారం సుస్థిరంగా ఉండాలంటే వారికి మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలనే ప్రధాన ఉద్దేశంతో కొనుగోలుదారులు అమ్మకందారుల సమ్మేళనాన్ని ఏర్పాటు చేశామన్నారు.

సమ్మేళనం ద్వారా మంచి ఆహార ఉత్పత్తులు సమీపంలో ఎక్కడున్నాయో కొనుగోలుదారులకు తెలిసే అవకాశం లభించిందన్నారు. తక్కువ ధరలో ఉత్పత్తులు రవాణా ఖర్చులు లేకుండా వారికి లభ్యమవుతాయన్నారు.

నాణ్యతగా ఉన్న ఆహార ఉత్పత్తులను కొనుగోలుదారులు హోటల్ యజమానులు కొనుగోలు చేయడంతో పాటు వాటి ఫోటో తీసుకుని వారికి తెలిసిన వారందరికీ షేర్ చేస్తూ కూడా విస్తృతంగా తెలియజేయాలన్నారు

నాణ్యత విషయంలో గానీ ఇతర ఏమైనా లోటుపాట్లు ఉంటే ఉత్పత్తిదారులకు సూచనలు కూడా ఇవ్వాలన్నారు.

జిల్లా యంత్రాంగం పిలుపుమేరకు వచ్చిన కొనుగోలుదారులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.
కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో అమృత కృష్ణా పేరుతో ప్లాస్టిక్ ను నివారించే ఉద్దేశంతో గాజు సీసాలతో మంచినీటి కేంద్రాన్ని ఏర్పాటు చేశామని ఎవరైనా సరే అవసరము ఉన్నవారు మంచినీటినీ కొనుగోలు చేయాలని కోరారు.
కొనుగోలుదారులను మహిళ వ్యాపారవేత్తలు సంప్రదిస్తే వారికి కావలసిన సహకారం అందించాలన్నారు.

పెద్ద పెద్ద కొనుగోలుదారుల నుండి ఏమైనా ఆర్డర్లు వస్తే మహిళా వ్యాపారవేత్తలు వారి శక్తి సామర్థ్యాలకు మించకుండా నాణ్యత లోపం లేకుండా ఉత్పత్తులు సరఫరా చేయాలన్నారు.
చెప్పిన సమయానికి నాణ్యత గల ఉత్పత్తులు సరఫరా చేసే విధంగా మహిళా వ్యాపారవేత్తలు సిద్ధంగా ఉండాలన్నారు

అనంతరం ఆంధ్ర ప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్ వి స్వామి మాట్లాడుతూ హోటల్ యజమానులు అందరూ ఐకమత్యంగా ఉంటామన్నారు. జిల్లా కలెక్టర్ తొలిసారిగా ఇటువంటి సమ్మేళన కార్యక్రమం నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. మహిళా వ్యాపారవేత్తలకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు.

జిల్లా హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు పివి రమణ మాట్లాడుతూ హోటల్లలో ఉలవచారు తప్పకుండా వాడతామని సమ్మేళనంలో ఉంచిన ఉలవచారు కూడా గమనించి కొనుగోలు చేస్తామన్నారు. జిల్లా కలెక్టర్ చొరవ తీసుకునీ కొనుగోలుదారులకు అమ్మకందారులకు ప్రత్యేకంగా సమ్మేళనం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక కుటుంబం ఒక వ్యాపారవేత్త అనే నినాదానికి తమ వంతు సహకారం తప్పకుండా అందిస్తామన్నారు. జిల్లా కలెక్టర్ కోరిన మీదట తమకు కావలసిన మంచినీటి సీసాలను కృష్ణ కలెక్టరేట్ నుండి కొనుగోలు చేస్తామన్నారు.

వాణి స్వీట్స్ అధినేత క్యాటరింగ్ అసోసియేషన్ అధ్యక్షులు దిలీప్ మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం రూపొందించిన వివిధ ఉత్పత్తుల ధరల కేటలాగు చాలా బాగుందని ఏదైనా ఒక యాప్ ద్వారా డిజిటల్ చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. మహిళా సంఘాలు తయారు చేస్తున్న ఉత్పత్తులు నాణ్యతగా ఉంటే తాము కొనుగోలు చేస్తామని
ఆ నాణ్యత నిరంతరం కొనసాగాలన్నారు.

జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు జిబివి రవికుమార్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ సమ్మేళనం ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం అన్నారు. తమ సంఘం భవనంలో కూడా ఇటువంటి కార్యక్రమం నిర్వహించాలని చక్కగా వ్యాపారం జరుగుతుందని చెప్పారు.
అనంతరం మహిళా వ్యాపారవేత్తలు సత్యవతి, సుష్మ తాము ఎలా వ్యాపారం మొదలు పెట్టి అభివృద్ధి చేశాము మిఠాయిలు ,తినుబండారాలు, ఎంబ్రాయిడరీ, చేనేత వస్త్రాలు గురించి వివరించారు.

ఈ కార్యక్రమంలో వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమిషనర్ కల్పన, డిఆర్ఓ చంద్రశేఖర రావు, ఇండియన్ బ్యాంకు ఆర్ఎం రాజేష్ ఉయ్యూరు ఇన్చార్జ్ ఆర్డిఓ కె ఆర్ ఆర్ సి ఎస్ డి సి శ్రీదేవి, డి ఆర్ డి ఏ పి డి హరిహరనాథ్, డి ఐ సి జి ఎం వెంకటరావు జిల్లా పశుసంవర్ధక అధికారి చిన్న నరసింహులు,, మార్కెటింగ్ ఎడి నిత్యానందం, డి టి డబ్ల్యూ ఫణి ధూర్జటి, మార్క్ఫెడ్ డిఎం మురళీ కిషోర్, జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి షాహిద్ బాబు, జడ్పీ సీఈవో కన్నమ నాయుడు, జిల్లా ఉద్యాన అధికారి జే.జ్యోతి, ఎల్డిఎం రవీంద్రారెడ్డి, తాడిగడప మున్సిపల్ కమిషనర్ నజీర్, ఆహార తనిఖీ అధికారి గోపాలకృష్ణ, జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్, సంయుక్త కార్యదర్శి ఈమని దామోదర్ రావు పలువురు పారిశ్రామికవేత్తలు కొనుగోలుదారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *