-ముంబయిలో జరుగుతున్న 24వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ అమ్యూజ్ మెంట్ పార్క్స్ అండ్ ఇండస్ట్రీస్(ఐఏఏపీఐ) ఎక్స్ పోలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి దుర్గేష్
-ముంబయి వేదికగా అమ్యూజ్‌మెంట్ పార్క్ ఇన్వెస్టర్లకు ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సాదర ఆహ్వానం
-ఏపీ ప్రభుత్వం అందిస్తున్న అద్భుత అవకాశాలను పరిశీలించాలని, అమ్యూజ్ మెంట్, థీమ్, వాటర్ పార్క్ లు, అడ్వెంచర్ జోన్ల ఏర్పాటుకు తమతో భాగస్వాములు కావాలని పిలుపు
-ఏపీ పర్యాటకంలో పెట్టుబడులు పెట్టండి…భరోసా కల్పించే బాధ్యత మాది అని ఇన్వెస్టర్లకు భరోసా
-సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల దార్శనికతతో ‘స్వర్ణాంధ్ర పర్యాటక విజన్ 2047’ని రూపొందించామని మంత్రి దుర్గేష్ వెల్లడి
-అమరావతి, విశాఖపట్నం, తిరుపతి నగరాలలో భారీ మెగా అమ్యూజ్‌మెంట్ పార్కుల పెట్టుబడుల కోసం ఆహ్వానం
-టైర్-2, టైర్-3 నగరాల్లో ప్రజల వినోద అవసరాలను తీర్చడానికి చిన్న తరహా అమ్యూజ్‌మెంట్ పార్కులు ఏర్పాటు గొప్ప అవకాశాలని మంత్రి దుర్గేష్ సూచన
ముంబయి/అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వ విధానాలు, మౌలిక సదుపాయాలు, సంస్కరణలు సిద్ధంగా ఉన్నాయని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. మహారాష్ట్రలోని ముంబయిలోని బాంబే ఎగ్జిబిషన్ సెంటర్ లో జరుగుతున్న 24వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ అమ్యూజ్‌మెంట్ పార్క్స్ అండ్ ఇండస్ట్రీస్ (IAAPI) ఎక్స్‌పోలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆధునిక పర్యాటక రంగంలో అమ్యూజ్‌మెంట్, థీమ్ పార్కులు కీలకమైన స్తంభాలుగా ఎదిగిన నేపథ్యంలో కుటుంబాలు వినూత్న అనుభూతుల కోసం, యువత సాహస క్రీడల కోసం , సామాన్య పర్యాటకులు కొత్తదనం కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొంటూ అమ్యూజ్‌మెంట్ రంగంలోని జాతీయ, అంతర్జాతీయ ఇన్వెస్టర్లను ఉద్దేశించి ప్రసంగించారు. స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, వేలాది ఉద్యోగాలను సృష్టించడం తద్వారా సమాజ జీవన ప్రమాణాలను పెంపొందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పర్యాటక రంగంలో ఇన్వెస్టర్లకు అందిస్తున్న రాయితీలను తెలుపుతూ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అపారమైన అవకాశాలను వివరించారు. మంత్రి దుర్గేష్ స్పీచ్ పై ఇన్వెస్టర్లు హర్షం వ్యక్తం చేశారు. ముందుగా ఎక్స్‌పోను ప్రారంభించిన మంత్రి దుర్గేష్ స్టాళ్లను పరిశీలించి ఏపీ పర్యాటక రంగానికి విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులను ఆదేశించారు.పలు స్టాళ్ల వద్దకు వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన వినోద సాధనాలను పరిశీలించారు. కార్యక్రమం అనంతరం ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ అమ్యూజ్‌మెంట్ పార్క్స్ అండ్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ అంకూర్ మహేశ్వరితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.
• పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా: సుదీర్ఘ తీరప్రాంతం, గొప్ప సాంస్కృతిక వారసత్వం, వైవిధ్యమైన ప్రకృతి దృశ్యాలు కలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్యాటక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కట్టుబడి ఉందని మంత్రి దుర్గేష్ అన్నారు. ఏపీ ప్రభుత్వం పర్యాటక రంగానికి ‘పారిశ్రామిక హోదా’ కల్పించిందని, నూతన పర్యాటక పాలసీ 2024-29 ద్వారా ఇన్వెస్టర్లకు 25 శాతం వరకు ఫిక్స్‌డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ సబ్సిడీ,పారిశ్రామిక ధరలకే విద్యుత్ సరఫరా,ఎలక్ట్రిసిటీ డ్యూటీ రీయింబర్స్‌మెంట్,100 శాతం నెట్ ఎస్జీఎస్టీ రీయింబర్స్‌మెంట్,ఉపాధి కల్పన ఆధారిత సబ్సిడీలు తదితర భారీ రాయితీలు కల్పిస్తున్నామని ఆయన తెలిపారు.
• దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక భూ కేటాయింపు విధానం: హోటళ్లు, థీమ్ పార్కులు, రిసార్టుల కోసం భూ కేటాయింపు ప్రక్రియను సరళతరం చేస్తూ ‘టూరిజం ల్యాండ్ అలాట్‌మెంట్ పాలసీ 2025’ను దేశంలోనే మొదటిసారిగా ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని మంత్రి దుర్గేష్ వివరించారు. రూ. 50 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టే ప్రాజెక్టులకు స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు ద్వారా నేరుగా భూ కేటాయింపులు జరుగుతాయని స్పష్టం చేశారు.
• స్వర్ణాంధ్ర పర్యాటక విజన్ 2047:సీఎం చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల దార్శనికతతో ‘స్వర్ణాంధ్ర పర్యాటక విజన్ 2047’ని రూపొందించామని మంత్రి దుర్గేష్ తెలిపారు. దీని ద్వారా ఏపీని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు. గత ఏడాది కాలంలోనే 102 ఒప్పందాల ద్వారా రూ. 18,448 కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని ఆయన వెల్లడించారు. అదనంగా, స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు ద్వారా రూ. 9,446 కోట్ల పెట్టుబడితో 7,348 క్లాసిఫైడ్ హోటల్ గదుల నిర్మాణానికి ఆమోదం తెలిపామన్నారు. పర్యాటక రాయితీలను పొందడంలో పారదర్శకత, వేగం, ఎటువంటి ఇబ్బందులు లేని ప్రక్రియను నిర్ధారించడానికి పర్యాటక విధానానికి సంబంధించిన ‘ఆపరేషనల్ గైడ్‌లైన్స్’ విడుదల చేసినట్లు వివరించారు.రాష్ట్రంలో పర్యాటక అనుభవాలను విస్తృతం చేయడానికి కారవాన్ టూరిజం ప్రమోషన్, హోమ్‌స్టే, బి అండ్ బి పాలసీ 2025లను తెచ్చామన్నారు. త్వరలోనే కాన్సర్ట్ పాలసీ, ఏపీ ఫిల్మ్ టూరిజం పాలసీ, మైస్ (MICE) పాలసీలను అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. ఇవి పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించడమే కాకుండా స్థానికులకు ఉపాధిని కల్పిస్తున్నాయన్నారు.
• మెగా పెట్టుబడులకు మూడు ప్రధాన నగరాలు..ఆంధ్రప్రదేశ్ – అవకాశాల గని:అంతర్జాతీయ స్థాయి థీమ్ పార్కులు, వాటర్ ఫ్రంట్ అట్రాక్షన్స్, అడ్వెంచర్ జోన్లు, సమగ్ర వినోద కేంద్రాల ఏర్పాటుకు ఏపీలో అపారమైన అవకాశాలు ఉన్నాయని,
తీరప్రాంత సర్క్యూట్లు, ఆధ్యాత్మిక పట్టణాలు, అటవీ ప్రాంతాలు, పట్టణ వినోద కారిడార్లలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. వాటర్ రిక్రియేషన్, ఫిల్మ్ థీమ్ పార్కులు, అడ్వెంచర్ స్పోర్ట్స్ హబ్‌లకు ఇక్కడ అధిక ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో అమ్యూజ్‌మెంట్,థీమ్ పార్కుల కోసం మూడు కీలక నగరాలను ప్రతిపాదించారు. గ్రీన్ ఫీల్డ్ రాజధానిగా అమరావతి నూతన ఆవిష్కరణలకు అద్భుతమైన వేదిక అని, విశాఖపట్నంను అంతర్జాతీయ స్థాయి తీరప్రాంత పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని, భారీ సంఖ్యలో వచ్చే భక్తుల దృష్ట్యా ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా తిరుపతిని తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన పర్యాటక, పట్టణ అభివృద్ధి ప్రాజెక్టులతో సమానంగా ఈ రంగానికి కూడా ప్రాముఖ్యతనిస్తూ ఒక అనుకూలమైన వ్యవస్థను నిర్మిస్తున్నామని భరోసానిచ్చారు. అంతర్జాతీయ స్థాయి వినోద కేంద్రాల నిర్మాణంలో ఇన్వెస్టర్లకు ఎదురయ్యే అడ్డంకులను తొలగించి, అనుమతుల ప్రక్రియను సులభతరం చేస్తున్నామని వివరించారు.
• టైర్-2, టైర్-3 నగరాల్లో చిన్న తరహా పార్కులు: రాష్ట్రంలోని చిన్న నగరాల్లో కూడా వినోద అవసరాలు పెరుగుతున్నాయని, అక్కడ చిన్న తరహా అమ్యూజ్‌మెంట్ పార్కులు ఏర్పాటు చేయడం ద్వారా తక్కువ పెట్టుబడితో త్వరితగతిన రాబడిపొందవచ్చని ఇన్వెస్టర్లకు మంత్రి దుర్గేష్ సూచించారు.
• మౌలిక వసతులు మరియు భరోసా: ఏపీలో విమానాశ్రయాల విస్తరణ, మెరుగైన రవాణా సౌకర్యాలు, సుదీర్ఘ తీరప్రాంతం, బలమైన హాస్పిటాలిటీ నెట్ వర్క్ పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తున్నాయని మంత్రి దుర్గేష్ తెలిపారు. “ఏపీ పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టండి.. మీకు పూర్తి భరోసా కల్పించే బాధ్యత మా కూటమి ప్రభుత్వానిది” అని ఆయన ముంబయి వేదికగా ఇన్వెస్టర్లకు పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ కేవలం పర్యాటక ప్రదేశమే కాదు.. పెట్టుబడిదారుల కలల రాష్ట్రం: భారతదేశంలో వినోద రంగాన్ని అభివృద్ధి చేయడానికి అనువైన వాతావరణాన్ని సృష్టించడం ఐఏఏపీఐ ప్రధాన లక్ష్యమని మంత్రి దుర్గేష్ అన్నారు. వీరితో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు.గత కొన్ని దశాబ్దాలుగా భారతదేశంలోని అమ్యూజ్‌మెంట్ పార్కులు, థీమ్ పార్కులు, వాటర్ పార్కులు, ఇండోర్ అమ్యూజ్‌మెంట్ సెంటర్ల ప్రయోజనాలకు, భద్రతా ప్రమాణాలు, వృత్తిపరమైన శిక్షణ, అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులు , ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో ప్రాతినిధ్యం వహించే ఒక అగ్రగామి సంస్థగా కొనియాడారు. IAAPI వంటి అనుభవజ్ఞులైన సంస్థల భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రపంచ స్థాయి థీమ్ పార్కులను ఏర్పాటు చేసి, పర్యాటకులకు మర్చిపోలేని అనుభూతులను అందించాలని కోరుకుంటున్నానన్నారు.ఆంధ్రప్రదేశ్ కేవలం పర్యాటక ప్రదేశమే కాదు.. పెట్టుబడిదారుల కలల రాష్ట్రమని, అమ్యూజ్‌మెంట్ పరిశ్రమ ద్వారా రాష్ట్రానికి కొత్త శోభను, యువతకు ఉపాధిని తీసుకురావాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశయమన్నారు. మాకు కేంద్ర సహకారం మెండుగా ఉందని తెలిపారు..సృజనాత్మకతకు, ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనమైన ఐఏఏపీఐ ఎక్స్‌పోలో పాల్గొనడం సంతోషంగా ఉందన్న మంత్రి దుర్గేష్ వినోద రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరినీ అభినందించారు. ఏపీలో వేల సంఖ్యలో ఉద్యోగాల కల్పనకు, పర్యాటక భవిష్యత్తు నిర్మాణానికి భాగస్వాములు కావాలని ఆయన కోరారు. కూటమి ప్రభుత్వ ప్రధాన దృష్టి ఆధునికమైన, సుస్థిరమైన,సురక్షితమైన గమ్యస్థానాలను నిర్మించడంపై ఉందని, వినూత్న ఆలోచనలు, అత్యాధునిక సాంకేతికతతో వచ్చే భాగస్వామ్యాలను ఆంధ్రప్రదేశ్ ఎల్లప్పుడూ ఆహ్వానిస్తుందన్నారు..అదే విధంగా మెగా పార్కుల నుండి చిన్న తరహా పార్కుల వరకు అపారమైన సామర్థ్యాన్ని వెలికితీయడానికి పరిశ్రమల అధిపతులు, డెవలపర్లు, పారిశ్రామికవేత్తలతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అందిస్తున్న అద్భుత అవకాశాలను పరిశీలించాలని, తమతో భాగస్వాములు కావాలని సాదరంగా ఆహ్వానిస్తూ రండి, రేపటి సంతోషాన్ని నేడే కలిసి నిర్మిద్దామని ప్రసంగాన్ని ముగించారు.
ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ అమ్యూజ్‌మెంట్ పార్క్స్ అండ్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ అంకూర్ మహేశ్వరి మాట్లాడుతూ భారతదేశంలో అమ్యూజ్‌మెంట్ రంగం ఏటా 15 శాతం వృద్ధిని నమోదు చేస్తోందని, 2030 నాటికి ఈ రంగం రూ.25,000 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నామన్నారు.. ప్రస్తుతం భారత దేశంలో సుమారు 300 అమ్యూజ్‌మెంట్ పార్కులు, 2,500 ఇండోర్ సెంటర్లు ఉండటం ఈ రంగంపై ప్రజలకు ఉన్న ఆసక్తిని తెలియజేస్తోందని వివరించారు. ఏపీ పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ ఈ ఎక్స్ పోను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.ఏపీలో ఈ రంగంలో విస్తృత పెట్టుబడులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో ఏపీటీఏ డిప్యూటీ సీఈవో శ్రీనివాస్, మార్కెటింగ్ మేనేజర్ రఫీక్, సీనియర్ కన్సల్టెంట్లు సత్యప్రభ, శివ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News