-పుష్కరాలకు ముందే పూర్తికి సన్నాహాలు
-నాణ్యత విషయంలో రాజీలేదు
-జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు
ఏలూరు జిల్లా -పోలవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ కు ఆధునిక దేవాలయం అని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచన మేరకు రాష్ట్రంలో చారిత్రక ఘట్టమైన గోదావరి పుష్కరాలకు ముందే, పోలవరం పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.మంగళవారం ఆయన ప్రాజెక్టు పనులను, ప్రగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా.. ఇంజనీరింగ్ నిపుణులు, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం పూర్తి చేయడం ద్వారా ఇటు ఉత్తరాంధ్ర అటు రాయలసీమకు గోదావరి జలాలు అందించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయబోతున్నామని చెప్పారు. ఈ మహా యజ్ఞం ద్వారా రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా చేయడమే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆశయంగా ఆయన పేర్కొన్నారు. అలాగే పోలవరం సహా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను ఓ క్రమపద్ధతిలో పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్దం చేసుకున్నామన్నారు.
ఇరిగేషన్ రంగానికి గతంలోనూ, ఇప్పుడు పెద్ద పీట వేసి, అవి పూర్తి అయ్యేలా చేసింది, చేస్తోంది కూటమి ప్రభుత్వమే.. అని ఆయన చెప్పారు.
ప్రాజెక్టు నిర్మాణాలకు సంబంధించి పనుల నాణ్యత విషయంలో ఎక్కడా, రాజీ పడే ప్రసక్తే ఉండకూడదని చంద్రబాబు సూచించిన విషయాన్ని రామానాయుడు గుర్తు చేశారు.
గత ప్రభుత్వంలో కీలకమైన డయాఫ్రం వాల్ ధ్వంసం అయింది. దాన్ని సరి చేస్తే సరిపోతుంది అని నిపుణులు చెప్పినా
నాణ్యత, ప్రజా భద్రత విషయంలో రాజీ పడకూడదనే, కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం చేపట్టామని మంత్రి స్పష్టం చేశారు. సి డబ్ల్యూ సి డిజైన్స్ ప్రకారమే పోలవరం పనులు జరుగుతున్నాయన్నారు. అంతర్జాతీయ నిపుణుల కమిటీ సూచనలు, ప్రమాణాలు పాటిస్తూ పనులు చేస్తున్నామన్నారు. ఈ పనులను పోలవరం ప్రాజెక్టు అథారిటీ ప్రతినిత్యం పర్యవేక్షిస్తుందని..రామానాయుడు అన్నారు.
అలాగే ప్రాజెక్టు పనుల పురోగతిని ఎప్పటికప్పుడు కేంద్రానికి తెలియజేస్తున్నట్లు చెప్పారు.
కొత్త డయాఫ్రం వాల్ 1372 మీటర్లకు గానూ, 1300 మీటర్లు నేటికి పూర్తయిందన్నారు. ఈ నెలాఖరికి మొత్తం పూర్తవుతుందన్నారు. ఈసిఆర్‌ఎఫ్ డ్యాం నిర్మాణ ప్రాంతంలో నేలను గట్టిపరచేలా వైబ్రో కాంప్యాక్షన్ పనులు పూర్తి చేశామని చెప్పారు.
ప్రాజెక్ట్ అనుసంధాన పనుల్లో ముఖ్యమైన కుడి, ఎడమ కాలువలను ఈ ఏడాది జూన్ కల్లా పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు.
నిర్వాసితుల నష్టపరిహారానికి సంబంధించి నాడు 2016లో రూ.700 కోట్ల పరిహారం అందించిన ఘనత చంద్రబాబుదే అన్నారు. మరలా కూటమి ప్రభుత్వం వచ్చాక రెండు దపాలుగా 1900 కోట్లు పంపిణీ చేసి నిర్వాసితులకు అండగా నిలిచారన్నారు. నిర్వాశితులను కొంత మంది మధ్యవర్తులు మీకు మావల్లే పరిహారం అందింది అంటూ మోసం చేస్తున్న విషయం మా దృష్టికి వచ్చిందని, మధ్యవర్తుల విషయం లో అధికారులు కఠినం గా వ్యవహారించాలని సూచించారు. నిర్వాసితులు కూడా ఇలా మోసానికి పాల్పడే వారిపట్ల జాగ్రత్త గా ఉండాలని సూచించారు.
ప్రాజెక్ట్ నిర్మాణం పై సూచనలు, సలహాలు, విమర్శలు, డిమాండ్స్ వస్తున్నా, వాటిని మనస్ఫూర్తిగా స్వీకరిస్తామని మంత్రి రామానాయుడు చెప్పారు. ప్రాజెక్ట్ నిర్మాణ నాణ్యత పై గాని, భద్రతా ప్రమాణాలు పాటించడంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన నొక్కి వక్కాణించారు. మంత్రి నిమ్మల రామానాయుడు తో పాటు జలవనరుల శాఖ సలహాదారు ఎం. వెంకటేశ్వరరావు, ఈ ఎన్ సి నరసింహ మూర్తి, ప్రాజెక్ట్ అడ్మిన్ అభిషేక్, మరియు కాంట్రాక్టు ఏజెన్సీ ల ప్రతినిధులు, ఇతర ప్రాజెక్ట్ అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News