అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాజధాని అమరావతి పరిధిలో ఉద్ధండరాయునిపాలెం గ్రామం వద్ద సీడ్‌యాక్సెస్ రోడ్డుకు దగ్గరలో ఉన్న ఎల్ అండ్ టి క్యాంపు కార్యాలయం వద్ద గల స్టాక్ పాయింట్ లో బుధవారం జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) ఛైర్‌పర్సన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి డి.లక్ష్మీపార్థసారథి వారు పరిశీలించారు. అగ్నిమాపక అధికారి పి. వెంకట రమణ ప్రమాద పరిస్థితిని వివరించారు. అమరావతి నిర్మాణ పనులకు గుత్తేదారు నిల్వ చేసుకున్న భూగర్భ విద్యుత్తు పైపులు అగ్నికి ఆహుతైనట్లు వివరించారు. స్టాప్ పాయింట్‌లో ఎండు గడ్డి ఎక్కువగా ఉండటం చేత ఎండ వేడికి అగ్గిరాజుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా ఏడీసీ సీఎండీ వారు అమరావతి నిర్మాణ పనులను చేస్తున్న అన్ని గుత్తేదారు సంస్థలకు స్టాప్ పాయింట్లలో ఎండు గడ్డిని వెంటనే తొలగించే విధంగా చర్యలు చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. భానుడి ప్రతాపం పెరుగుతున్నందున సంబంధిత గుత్తేదారులు నిర్మాణ పనులకు ఉపయోగించే ముడిసరుకు జాగ్రత్తగా భద్రపరచుకోవాలని సూచించారు. ఈ పర్యటనలో ఏడీసీ ఛీఫ్ ఇంజినీర్లు సీహెచ్.ధనుంజయ, బి.నరసింహమూర్తి, ఇంజినీరింగ్, ఈఎస్ఎంయూ విభాగం అధికారులు ఉన్నారు.
Prajavartha Online Telugu News