న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
పార్లమెంటులో లోక్‌సభ స్పీకర్‌పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నట్లు తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మద్దిల గురుమూర్తి లోక్‌సభలో స్పష్టం చేశారు. సభలో మాట్లాడుతూ స్పీకర్ పదవికి, పార్లమెంటు సంప్రదాయాలకు ఉన్న గౌరవాన్ని కాపాడటం కోసమే తమ పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. తమ పార్టీ ఏ కూటమికీ చెందినది కాదని, తాము ఎన్డీయే కూటమిలోనూ లేమని, ఇండియా కూటమిలోనూ లేమని ఆయన పేర్కొన్నారు. సభ గౌరవం, స్పీకర్ స్థానం పరిరక్షణ దృష్ట్యా ఈ విషయంలో తాము స్పష్టమైన వైఖరి తీసుకున్నామని చెప్పారు.
స్పీకర్ పదవి రాజకీయ పదవి కాదని, అది రాజ్యాంగబద్ధమైన పదవని ఎంపీ గురుమూర్తి తెలిపారు. ఆ కుర్చీకి ప్రతి సభ్యుడు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రజలకు మేలు జరిగే అంశాల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను తమ పార్టీ సమర్థిస్తుందని, అదే సమయంలో ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికీ వెనుకాడబోమని స్పష్టం చేశారు. స్పీకర్ తీసుకునే ప్రతి నిర్ణయం అందరికీ నచ్చకపోవచ్చు కానీ అవన్నీ పార్లమెంటరీ నిబంధనల ప్రకారమే జరుగుతాయని చెప్పారు. సభ సజావుగా నడవాలంటే స్పీకర్ స్థానాన్ని గౌరవించడం తప్పనిసరి అని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను లోక్‌సభలో లేవనెత్తడానికి గౌరవ స్పీకర్ శ్రీ ఓం బిర్లా తగిన అవకాశాలు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. అందువల్ల స్పీకర్‌పై ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున తాము వ్యతిరేకిస్తున్నామని ఎంపీ గురుమూర్తి స్పష్టం చేశారు. సభ హుందాతనాన్ని, పార్లమెంటరీ సంప్రదాయాలను కాపాడాలనే ఉద్దేశంతోనే తమ పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ సందర్బంగా ఆయన తెలిపారు.
Prajavartha Online Telugu News