-అయితే…ప్రజలు మీకు రెండు పంగనామాలే ఎందుకు పెట్టారు?
-ప్రజాహితం కోరేవారు అయితే శాసన సభకు ఎందుకు రావడంలేదు?
-పలు సంక్షేమ పథకాల కింద మీరు ఎగ్గొట్టిన చెల్లింపుల సంగతేంటి?
-ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించేంత సీను లేదని తెలుసుకోండి
-ప్రజారోగ్య రంగాన్ని మీరు చెరబట్టింది వాస్తవం కాదా?
-ఎన్టీఆర్ వైద్య సేవకు, మందుల కొనుగోలుకు, పలు నిర్మాణ కార్యాక్రమాలకు బకాయిలు ఎందుకు పెట్టారు?
-పలు అంశాలపై జగన్‌రెడ్డిని నిలదీసిన మంత్రి సత్యకుమార్ యాదవ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తన హయంలో ఆర్థిక నిర్వహణ ఎంతో భేష్‌గా ఉందని, సంక్షేమ పథకాల అమలు సూపర్‌గా జరిగిందని స్వీయ డబ్బా కొట్టుకోవడానికి గురువారం నాడు మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాన్ని వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్రంగా దుయ్యబట్టారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన పత్రికా సమావేశంలో జగన్ రెడ్డి ప్రస్తావించిన పలు అంశాలు, చేసిన వ్యాఖ్యలపై ఆయనను మంత్రి నిలదీశారు. సుదీర్ఘ అనుభవం, సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాల పట్ల సమ దృష్టి, యువత భవిత పట్ల దార్శినికతతో వ్యవహరించే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని విమర్శించేంత సీను జగన్ రెడ్డికి లేదని మంత్రి ఎద్దేవా చేశారు.
కేవలం 11 సీట్ల మాటేమిటి?
తన పాలనలో ఆర్థిక నిర్వహణ అద్భుతంగా జరిగిందని, చెప్పిన మేరకు సంక్షేమ పథకాల్ని అమలు చేశామని చెప్పుకోచూసిన మాజీ సిఎంకు 2024 ఎన్నికల్లో శాసన సభలో 11 సీట్లతో కేవలం రెండు పంగ నామాలు మాత్రమే ఎందుకు పెట్టారో తెలుసుకుని మరో పత్రికా సమావేశంలో జగన్‌రెడ్డి వివరించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ గురువారంనాడు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. నిజంగా అంత సమర్ధమైన పాలన అందించి ఉంటే ప్రజలు ఎందుకు తిరస్కరించారో ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలని…అలా చేస్తే తాను అంత ఘనుడ్ని కాను అన్న వాస్తవం జగన్ రెడ్డికి తెలుస్తుందని మంత్రి అన్నారు. గత ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురవడంతో మాజీ ముఖ్యమంత్రి మైండ్ బ్లాంక్ అయ్యిందని దరిమిలా ఊహా లోకంలో ఉంటూ అవాకులు చవాకులతో జగన్‌రెడ్డి ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. తన ఐదేళ్ల విధ్వంసాన్ని ప్రజలు అనుభవ పూర్వకంగా గుర్తించడంతో జగన్‌రెడ్డికి కొన్ని దశాబ్దాలపాటు రాజకీయ మనుగడ లేదని…ఈ విషయాన్ని తెలుసుకున్న ఆయన దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని మంత్రి దుయ్యబట్టారు.
అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు జగన్‌రెడ్డీ?
గురువారం నాడు జరిగిన సుదీర్ఘ పత్రికా సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి పలు సార్లు ఇటీవల ముగిసిన శాసన సభ సమావేశాలు 16 రోజుల పాటు జరిగాయని, ఏ ఒక్క ప్రజా సమస్యపైనా కూటమి ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదంటూ వాపోయిన జగన్‌రెడ్డి మొదటి రోజున కేవలం 11 నిమిషాలు పాటే సభకు హాజరై మిగతా రోజులన్నీ సమావేశాలకు ఎందుకు దూరంగా ఉన్నారో జవాబు చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. తన దుష్ట పాలనలో పోలీసుల చేత ఎముకలు విరిగేలా కొట్టించిన రఘురామకృష్ణంరాజును సభా నిర్వహణ సమయంలో ‘ అధ్యక్షా ‘ అని సంబోధించాల్సి వస్తుందని సభకు రావడంలేదని… ఇది సబబా అని మంత్రి నిలదీశారు.
కూటమి ప్రభుత్వ హయాంలో రైతుల ఆత్మహత్యలు, సంక్షేమ పథకాల అమలులో లోపాలు, మహిళలపై దాడులు, ఎన్నికైన ప్రజాప్రతినిధుల కోసం నిర్వహించిన ఆటవిడుపు మొదలైన అంశాలను పత్రికా సమావేశంలో ప్రస్తావించిన జగన్‌రెడ్డి ఆ విషయాలను శాసన సభలో ఎందుకు లేవనెత్తలేదని మంత్రి ధ్వజమెత్తారు. ప్రజల సమస్యలను ప్రస్తావించేందుకు సరైన వేదిక శాసన సభా లేక తాడేపల్లి ప్యాలస్సా జగన్‌రెడ్డి చెప్పాలని నిలదీశారు. నియమాల మేరకు వీలుకాకున్నా ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వకపోవడం వల్లే శాసన సభకు దూరంగా ఉంటున్నానంటూ జగన్‌రెడ్డి ఆత్మవంచనకు పాల్పడుతూ ప్రజల వివేకాన్ని కూడా అవమానిస్తున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ దుయ్యబట్టారు. ఈ వైఖరి వచ్చే ఎన్నికల దాకా కొనసాగుతుందా లేదా జగన్‌రెడ్డి సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.
జగన్ ఆర్థిక ఉగ్రవాదానికి రాష్ట్రం బలి
అంకెల గారడీతో తన ఆర్థిక నిర్వహణను గొప్పగా చూపే ప్రయత్నం చేసిన మాజీ ముఖ్యమంత్రి ఆర్థిక ఉగ్రవాదానికి రాష్ట్రం బలైన సంగతి యావన్మందికి తెలిసిన సత్యమని, జగన్ అండ్ కో కమీషన్ల అరాచకత్వానికి పలు పరిశ్రమలు ,పెట్టుబడిదారులు రాష్ట్రం విడిచి పారిపోవడంతో రాష్ట్ర ఆదాయం జగన్ హయాంలో తగ్గుముఖం పట్టి కొనసాగిందని దాని పరిణామాలను కూటమి ప్రభుత్వం భరిస్తోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. అంకెలను తనకనుకూలంగా చెప్పుకోచూసిన జగన్‌రెడ్డి తాను చేసిన భారీ అప్పుల్లో ఏమేరకు అభివృద్ధి పనులకు వినియోగించారో చెప్పే ప్రయత్నం మాత్రం చెయ్యలేదని మంత్రి అన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పుల్లో అధిక శాతం అభివృద్ధి పనుల కోసం వినియోగిస్తున్నట్లు ఆర్థిక విశ్లేషకులు కూడా గమనించారని మంత్రి తెలిపారు.
ప్రజారోగ్య రంగాన్ని చెరబట్టిన జగన్‌రెడ్డి
పత్రికా సమావేశంలో కూటమి ప్రభుత్వ ప్రజారోగ్య నిర్వహణపై జగన్‌రెడ్డి చేసిన ఆరోపణలను మంత్రి సత్యకుమార్ యాదవ్ తిప్పికొట్టారు. ప్రజల ఆరోగ్యం పట్ల అంత చిత్తశుద్ధి ఉంటే పేదలకు మేలు చేసే డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద సేవలందించిన నెట్వర్క్ ఆసుపత్రులకు రూ.2,400 కోట్లు, మందుల సరఫరాదారులకు మరో రూ.600 కోట్లు, వివిధ నిర్మాణ పనుల చెల్లింపులకు సంబంధించి మరో రూ.1,000 కోట్లు జగన్ రెడ్డి బకాయిలు పెట్టడం వాస్తవమని మంత్రి తెలిపారు. జీరో వేకెన్సీ కింద ప్రభుత్వాసుపత్రుల్లో ఖాళీలు లేకుండా భర్తీ చేశామని తరచుగా జగన్‌రెడ్డి అసత్యాలు పలుకుతున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చేనాటికి దాదాపు 14,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిలో 4,000 వైద్యుల పోస్టులు కూడా ఉన్నాయని మంత్రి వివరించారు. ఈ స్థాయిలో ఖాళీల అవాంఛనీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం 19 నెలల్లోనే దాదాపు 8,669 ఖాళీలను భర్తీ చేసిందని ఆయన అన్నారు. మరో 863 వైద్యుల నియామక ప్రక్రియ సాగుతోందని మంత్రి తెలిపారు. వీటితో పాటు 4,900 మందికి పదోన్నతులు కల్పించి వివిధ స్థాయిల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నామన్నారు.
కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజారోగ్య వ్యవస్థ కుంటుపడిందని మొసలి కన్నీరు కారుస్తున్న జగన్‌రెడ్డి తన హయాంలో పూర్తి భిన్నంగా వ్యవహరించి ప్రజారోగ్య రంగానికి తూట్లు పొడిచారని మంత్రి సత్యకుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. తన ఐదేళ్ల పాలనలో ఉచిత వైద్య సేవల కోసం నెట్వర్క్ ఆసుపత్రుల ద్వారా రూ.11,000 కోట్ల మేరకు సేవలందిస్తే కూటమి ప్రభుత్వం 19 నెలల్లోనే రూ. 5,500 కోట్ల మేరకు ప్రజలకు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సేవలందించిందని మంత్రి వివరించారు. జగన్ పెట్టిన బకాయిలను కూటమి ప్రభుత్వం తీర్చిందని, ఆమేరకు నెట్వర్క్ ఆసుపత్రులకు బకాయిలు కొనసాగుతున్నాయని మంత్రి వివరించారు.
ప్రజలకు గ్రామ స్థాయిలో వైద్య సేవలందించే విలేజ్ హెల్త్ క్లినిక్‌లకు సొంత భవనాల నిర్మాణానికి కేంద్రం భారీగా సాయమందించినా జగన్ రెడ్డి ప్రభుత్వం తప్పుడు ప్రాధాన్యతలతో వాటిని నిర్లక్ష్యం చేసిందని, 4,500 భవన నిర్మాణాలకు కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గత ప్రభుత్వ పర్యవేక్షణా లోపంతో ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సిబ్బంది హాజరు, ఓపీ మరియు ఐపీ సేవలు, శస్త్ర చికిత్సలు, ఆసుపత్రుల నిర్వహణ దెబ్బతిన్నాయని, మందుల సరఫరా గందరగోళానికి గురైందని మంత్రి తెలిపారు.
18 పైసల వ్యయంతో 17 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణం సాధ్యమా?
గత ప్రభుత్వం నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి ఆమోదించిన మొత్తం వ్యయంలో తన నాలుగేళ్ల పాలనలో రూపాయిలో 18 పైసలు మాత్రమే ఖర్చు పెట్టి 17 నూతన వైద్య కళాశాలలను నిర్మించామని జగన్ రెడ్డి నిత్యం బొంకుతున్నారని…ఇది సాధ్యమా అని మంత్రి ధ్వజమెత్తారు. జగన్ గొప్పగా చెప్పుకున్న నాడు-నేడు పథకం కింద ఆమోదిత వ్యయంలో రూపాయిలో కేవలం 24 పైసలు మాత్రమే ఖర్చు పెట్టి వైద్యారోగ్య రంగాన్ని సమగ్రంగా మార్చినట్లు మాజీ ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా అసత్యాలు పలుకుతున్నారని మంత్రి విమర్శించారు. ఈ నిర్లక్ష్య వైఖరి కారణంగా ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రుల అభివృద్ది పనులు, మౌలిక వసతుల కల్పన కుంటుపడ్డాయని ఈ వాస్తవాన్ని కప్పిపుచ్చుతూ జగన్ రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం తగదని మంత్రి అన్నారు.
ఇతర అంశాలు
కూటమి ప్రభుత్వం పలు సంక్షేమ పథకాల కింద లబ్దిదారులకు చెప్పిన మేరకు చెల్లించడంలేదన్న జగన్‌రెడ్డి వ్యాఖ్యల్ని మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ ఆక్షేపించారు. మాజీ ముఖ్యమంత్రి అమలు చేసిన అన్ని పథకాల కింద చెప్పిన మేరకు లబ్దిదారులకు చెల్లించకపోవడం వాస్తవమని, తన గతాన్ని విస్మరించి కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం సబబా అని మంత్రి ప్రశ్నించారు.
మహిళలపై దాడులను ఎత్తిచూపిన జగన్ రెడ్డి తన తాడేపల్లి ప్యాలెస్ సమీపంలో అటువంటి పలు సంఘటనలు జరిగినా ఎటువంటి చర్యలూ తీసుకోలేదని మంత్రి గుర్తు చేశారు. ఒక దళిత డ్రైవర్‌ను దారుణంగా చంపి శవాన్ని కుటుంబ సభ్యులకు డోర్ డెలివరీ చేసిన తన పార్టీ ఎమ్మెల్సీని పక్కన పెట్టుకుని నిస్సిగ్గుగా తిరగడం దళితుల పట్ల జగన్ వాస్తవ వైఖరికి అద్దం పడుతుందని మంత్రి అన్నారు.
జగన్ ఆంతర్యం
పరకామణి విషయంలో తన హయంలో రూ. 75,000 దొంగతనం చేసిన వాడు రూ.15 కోట్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి చెల్లించి పునీతుడయ్యాడని మాజీ ముఖ్యమంత్రి చెప్పడం విడ్డూరంగా ఉందని…వేలాది కోట్ల రూపాయల అక్రమార్జనకు పాల్పడినట్లు సిబిఐ ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్‌రెడ్డి అదే రీతిలో భారీగా చెల్లింపులు చేసి పునీతుడవడానికి సమాయత్తమవుతున్నట్లు అనుమానం వస్తోందని మంత్రి ఎద్దేవా చేశారు.
జగన్‌రెడ్డి ఎన్ని కల్లబొల్లి మాటలు చెప్పినా తన ఐదేళ్ల విధ్వంసక, అరాచక పాలన నేపథ్యంలో కొన్ని దశాబ్దాల పాటు ఆయనకు రాజకీయ మనుగడ ఉండబోదని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News