-త్వరలో జిల్లాలో బడ్జెట్ సమావేశాలు
-ప్రజలకు బడ్జెట్ గురించి వివరించాలి
-రాబోయేది అసాధరణ వృద్ధి సంవత్సరం
-అధికారులు ద్విగిణీకృత ఉత్సాహంతో పనిచేయాలి
-కేంద్రం నుంచి వచ్చే ప్రతి పైసా ఖర్చు చేద్దాం
-అధికారులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సూచన
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర బడ్జెట్‌ను ప్రజల వద్దకు తీసుకెళ్లేలా ప్రభుత్వం కార్యక్రమం రూపొందిస్తోందని, త్వరలోనే జిల్లాల్లో బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు బడ్జెట్ గురించి వివరిస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక ప్రగతి లక్ష్యాల గురించి అధికారులకు వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుగారి దార్శినికత, సూచనలతో ఈ సారి ఆర్థిక శాఖ ఒక వినూత్న ఒరవడితో ముందుకెళుతోందని చెప్పారు. గతంలో మార్చి 31తేదీ వరకు కూడా బడ్జెట్ పూర్తీ చేసేవారు కారు, కానీ ఇప్పుడు 20 రోజులకంటే ముందే బడ్జెట్‌ను పూర్తి చేశాం. గత రెండు సంవత్సరాలు ప్రభుత్వం అనేక ఒడిదొడుకులను తట్టుకుని ముందుకెళ్లిందని, ఇప్పుడు రాష్ట్రం ఆర్థిక ప్రగతిలో దూసుకెళుతోందన్నారు. ముఖ్యమంత్రి మార్గదర్శనంలో రాష్ట్రం ఈ రోజు ఒక అసాధరణ వృద్ధి పథంవైపు పయనిస్తోందన్నారు. రాబోయే ఆర్థిక సంవత్సరం అసాధరణ వృద్ధి సంవత్సరం (ఇయర్ ఆఫ్ ఎక్ట్స్రార్డినరీ గ్రోత్)గా నిలవబోతోందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులంతా ద్విగిణీకృత ఉత్సాహంతో పనిచేయాలన్నారు.
కుటుంబ బడ్జెట్ లా రూపొందించాం
రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ను ఈ సారి ఒక సామాన్యుడి ఇంటి బడ్జెట్ తరహాలో రూపొందించామన్నారు. తద్వరా బడ్జెట్‌ను సామాన్యుడి చెంతకు తీసుకెళ్లాలన్నదే ముఖ్యమంత్రి ధ్యేయమన్నారు. బడ్జెట్ మీటింగులు క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించిందని, త్వరలోనే ఈ కార్యక్రమానికి సంబంధించి తేదీలు ఖరారు చేస్తామన్నారు. ఆ ప్రకారం జిల్లాల్లో బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఈ లోపు ఆయా జిల్లాల వారీగా బడ్జెట్ కేటాయింపులు ఖర్చు చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఈ బడ్జెట్‌లో జిల్లాల వారీగా కూడా ఆయా శాఖల ఉన్నతాధికారులు బడ్జెట్ కేటాయింపులు కూడా పూర్తి చేయాలన్నారు. తద్వారా బడ్జెట్ గురించి ఆ జిల్లాల్లో ప్రజలకు వివరించడానికి వీలవుతుందన్నారు.
కేంద్రం నిధులు ప్రతి పైసా ఖర్చ చేయాలి
కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో ప్రతి పైసా కూడా ఖర్చు చేయాలని మంత్రి పయ్యావుల అధికారులను కోరారు. కేంద్రం నుంచి వివిధ పథకాలు, కార్యక్రమాలకు కోసం వచ్చే నిధుల్లో ప్రతి పైసా ఖర్చు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అయితే కొన్ని చోట్ల కాస్తంత నిర్లిప్తత కనిపిస్తోందన్నారు. అలా కాకుండా కేటాయించిన ప్రతి రూపాయిని కూడా వృథా కాకుండా సమర్థంగా ఖర్చు చేయాలన్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఏఏ శాఖలో ఎక్కడెక్కడ ఖర్చు చేయడం లేదో వాటిని గుర్తించి వాటిని ఖర్చు చేయడానికి అమిత ప్రాధాన్యం ఇవ్వాలని ఆ దిశగా ఆయా శాఖాధిపతులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వంలో మొత్తం వ్యయాన్ని ఖర్చు చేయాలనేదే లక్ష్యంగా పనిచేయాలన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 సాధనకు పది సూత్రాల కార్యక్రమం లక్ష్యాలు సాధించే దిశగా అధికారులు పనిచేయాలని, జీెెెఎస్డీపీ లక్ష్యాలు సాధించడమే ధ్యేయంగా పనిచేయాలన్నారు.
Prajavartha Online Telugu News