Breaking News

ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా ఏడు జిల్లాల కలెక్టర్ల అద్భుత ప్రజెంటేషన్లు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆరో కలెక్టర్ల సదస్సులో భాగంగా మొదటి రోజున ప్రజా సమస్యల సత్వర పరిష్కారం, సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ఏడు జిల్లాల్లో విజయవంతంగా అమలవుతున్న వినూత్న ప్రాజెక్టుల (Success Stories) పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లలో ఆయా జిల్లాల కలెక్టర్లు కలెక్టర్లు తమ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో అద్భుత ఫలితాలు సాధించిన వినూత్న ప్రాజెక్టుల గురించి వివరించారు.

ఏఐ (AI) టెక్నాలజీతో మారుమూల గ్రామాల్లో సైతం ముందస్తుగానే జబ్బులను గుర్తించి ఉచిత వైద్యం అందిస్తున్న టెక్నాలజీ…

చిత్తూరు జిల్లా: సంజీవని ప్రాజెక్ట్

గ్రామీణ ప్రజల ఆరోగ్య ముఖచిత్రాన్ని మార్చే ‘సంజీవని ప్రాజెక్ట్’ గురించి చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఐఏఎస్ తన ప్రజెంటేషన్‌లో వివరించారు.

టాటా సహకారంతో ఏర్పాటు చేసిన ‘డిజిటల్ నెర్వ్ సెంటర్’ (DiNC) అనే ఏకీకృత ప్లాట్‌ఫామ్ ద్వారా జిల్లాలోని 119 ఆరోగ్య కేంద్రాలను అనుసంధానం చేసి ఇప్పటికే 3 లక్షల 10 వేల మందికి పైగా పౌరులకు డిజిటల్ హెల్త్ రికార్డులు సృష్టించినట్లు ఆయన తెలిపారు.

డాక్టర్లు అందుబాటులో లేని మారుమూల గ్రామాల్లో సైతం టెలీ కన్సల్టేషన్ ద్వారా రోగులకు సేవలు అందిస్తున్నామని, ఇందుకోసం వైద్యుల కోసం ఏఐ (AI) ఆధారిత యాంబియంట్ లిజనింగ్ (Ambient Listening) టెక్నాలజీని కూడా వాడుతున్నామని ఆయన వివరించారు.

పౌరుల కోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్ తీసుకువచ్చామని, ‘ట్రూ వెల్నెస్ మీటర్’, ‘కేర్ ప్లానోగ్రామ్’ ద్వారా 12 రకాల ప్రాథమిక ఆరోగ్య సేవలను అందిస్తూ, సుమారు 63 వేల మందికి పైగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి ప్రాణాపాయం రాకముందే వ్యాధులను పసిగట్టే వ్యవస్థను జిల్లాలో ఎలా అమలు చేస్తున్నారో వివరించారు.
—–

*ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే వలస కార్మికులను మోసాల నుంచి రక్షిస్తున్న సెంటర్ ఫర్ మైగ్రేషన్.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా: కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్

విదేశాలకు వలస వెళ్లే కార్మికుల రక్షణ కోసం తీసుకువచ్చిన ‘కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్’ (KCM) ఆవశ్యకతను కోనసీమ కలెక్టర్ ఆర్ మహేశ్ కుమార్ వివరించారు. తమ జిల్లా నుంచి సుమారు 15 వేల మంది గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్నారని అయితే నకిలీ ఏజెంట్ల చేతిలో యువత మోసపోతూ పడుతున్న ఇబ్బందులను గమనించే జిల్లా రెవెన్యూ అధికారి నోడల్ అధికారిగా 5గురు సిబ్బందితో ఈకేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.

ఈ కేంద్రం ద్వారా 24 గంటలు పనిచేసే హెల్ప్‌లైన్ ప్రారంభించి ఇప్పటికే 199 దరఖాస్తులు పరిష్కరించామని,ఇబ్బందుల్లో ఉన్న 40 మంది వలస కార్మికులను సురక్షితంగా స్వదేశానికి రప్పించామని కలెక్టర్ తెలిపారు.

గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్ళే వారిలో చాలా మందికి అక్కడ ఉండే ఉపాధి పనులు, ఆహార అలవాట్లు,ఏఏ రంగాల్లో పనులు ఉంటాయనే వివరాలేమీ ముందుగా తెలియక అక్కడికి వెళ్లాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.

ప్రయాణానికి ముందే యువతకు కౌన్సెలింగ్ ఇస్తూ, వారి పాస్‌పోర్ట్, వీసా, వెళ్లే కంపెనీ వివరాలను పోలీసుల సమన్వయంతో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే వారిని విదేశాలకు పంపుతూ, హైదరాబాద్ పాస్‌పోర్ట్ అధికారుల శిక్షణతో ఈ కేంద్రాన్ని ఎలా నడిపిస్తున్నారో ఆయన చాలా స్పష్టంగా వివరించారు.

ఈ సెంటర్ ఫర్ మైగ్రేషన్ ను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి థియేటర్లలో ప్రదర్శిస్తున్న 2 నిమిషాల వీడియో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

దీనిపై సియం చంద్రబాబు నాయుడు స్పందించి కలక్టర్ ను ప్రత్యేకంగా అభినందించారు. ఈవిధానాన్ని అన్ని జిల్లాలు అడాప్ట్ చేసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు.అంతేక రాష్ట్ర స్థాయిలో జిఏడి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒక మైగ్రేషన్ పోర్టల్ ను ఏర్పాటు చేసి రాష్ట్ర మంతటా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
—–

దశాబ్దాల భూ వివాదాలకు నెల రోజుల్లో పరిష్కారం!

ఎస్.పి.ఎస్.ఆర్ నెల్లూరు జిల్లా: భూ సమస్యకు శాశ్వత పరిష్కారం

దశాబ్దాలుగా రైతులను పీడిస్తున్న భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తాము రూపొందించిన పకడ్బందీ విధానాన్ని నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రెజెంట్ చేశారు.

పాత రికార్డులు,సరిహద్దు తగాదాల వల్ల భూ సమస్యల పరిష్కారం ఎందుకు కష్టమవుతుందో విశ్లేషిస్తూ, దానికి విరుగుడుగా అధికారులే నేరుగా ఒక గ్రామాన్ని నెల రోజుల వ్యవధిలో నాలుగు దఫాలుగా ఎలా సందర్శిస్తారో ఆయన వివరించారు.

మొదటి విడతలో గ్రామస్తుల సమస్యలు వినడం, రెండో విడతలో రికార్డుల పరిశీలన, మూడో విడతలో డిజిటల్ సర్వే ద్వారా క్షేత్రస్థాయి పరిశీలన, నాలుగో విడతలో పారదర్శకంగా తీర్పు చెప్పి అక్కడికక్కడే పట్టాలు అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.

ఈ అద్భుతమైన ప్రణాళిక ద్వారా కేవలం మూడు నెలల వ్యవధిలోనే 110 గ్రామాల్లో ఈ కార్యక్రమం నిర్వహించగా, అందులో 26 గ్రామాలు పూర్తిగా భూ వివాద రహిత (జీరో పెండెన్సీ) గ్రామాలుగా ఎలా మారాయో కలెక్టర్ గణాంకాలతో సహా ప్రదర్శించారు.
—–

పన్ను కట్టాలన్నా.. కంప్లైంట్ ఇవ్వాలన్నా పడిగాపులు అక్కర్లేదు.. ఒక్క క్లిక్‌ తో!

విశాఖపట్నం జిల్లా: వైజాగ్ వన్

నగరవాసులకు పాలనను మరింత సులభతరం చేసే ‘వైజాగ్ వన్’ అప్లికేషన్ పనితీరును విశాఖపట్నం కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ప్రజెంటేషన్ చేశారు. పౌరులు తమ ఫిర్యాదులు, పన్నుల చెల్లింపుల కోసం వేర్వేరు యాప్స్ వాడకుండా అన్ని పౌర సేవలను ఒకే గొడుగు కిందికి ఎలా తెచ్చామో తెలిపారు.

ఆస్తి పన్ను, నీటి బిల్లులు చెల్లించడంతో పాటు పీజీఆర్ఎస్ (PGRS) అనుసంధానంతో సమస్యలను మొబైల్‌లోనే నమోదు చేసి వాటి పరిష్కార స్థితిని సులభంగా ట్రాక్ చేయవచ్చన్నారు. అంతే కాకుండా ఏఐ చాట్‌బాట్ సాయంతో ప్రజల సందేహాలను 24 గంటలూ పరిష్కరిస్తున్నామని, గాలి నాణ్యతను ఎప్పటికప్పుడు తెలుసుకునే సదుపాయం, ఆసుపత్రులు, అత్యవసర సేవలను ఒకే క్లిక్‌తో తెలుసుకునేలా యాప్‌ను పౌర కేంద్రంగా ఎలా తీర్చిదిద్దారో కలెక్టర్ వివరించారు.

నగర ప్రజలకు పౌర సేవలు, ఫిర్యాదుల నమోదు, పన్నుల చెల్లింపులు వంటి వాటన్నింటినీ ఒకే వేదికపై ఎలాంటి ఆటంకాలు లేకుండా (Frictionless ecosystem) అందించే ‘సింగిల్ టచ్ పాయింట్’ (Single Touchpoint) గా ఈ ఏకీకృత మొబైల్ యాప్‌ను ఎలా తీర్చిదిద్దామో ఆయన ప్రదర్శించారు.

పౌరులకు సౌలభ్యం (Convenience), పారదర్శకత (Transparency), మరియు మెరుగైన పనితీరు (Efficiency) అనే మూడు మూలస్తంభాల (Three Pillars) ఆధారంగా ఈ అద్భుతమైన డిజిటల్ వ్యవస్థను నిర్మించినట్లు కలెక్టర్ సదస్సుకు తెలిపారు.

కేవలం బిల్లులు కట్టడానికే కాకుండా, రియల్ టైమ్‌లో నగరంలోని గాలి నాణ్యత (Air Quality) వివరాలను, ఇతర ముఖ్యమైన పౌర సమాచారాన్ని ప్రజలు తమ మొబైల్‌లోనే సులభంగా చూసుకునేలా దీన్ని రూపొందించామన్నారు. అలాగే, అత్యవసర సమయాల్లో ఉపయోగపడే కీలకమైన ఆసుపత్రులు, అధికారుల కాంటాక్ట్ నంబర్లను సులభంగా యాక్సెస్ చేసుకునేలా ఇందులో పొందుపరిచామని, ఎప్పటికప్పుడు నగరవాసులను సమాచారంతో అప్రమత్తం చేసేందుకు వీలుగా ‘పుష్ నోటిఫికేషన్స్ మరియు అలర్ట్స్’ (Push Notifications & Alerts) సదుపాయాన్ని కూడా ఈ యాప్‌లో ఎలా అనుసంధానం చేశామో కలెక్టర్ తమ ప్రజెంటేషన్‌లో తెలిపారు.
——

గ్రామానికో ఛాంపియన్ ఫార్మర్… ఉద్యాన పంటల సాగు

విజయనగరం జిల్లా: మిషన్ హోర్టి-విజ్-ఇయాన్ (HOPE)

వ్యవసాయ రంగంలో రైతుల ఆదాయం పెంచాలనే లక్ష్యంతో చేపట్టిన ‘మిషన్ హోప్’ (HOPE) గురించి విజయనగరం కలెక్టర్ రామ సుందర్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో వివరించారు.

కేవలం వరి, మొక్కజొన్న పండించి నష్టపోతున్న సన్న, చిన్నకారు రైతులను అధిక లాభాలిచ్చే ఉద్యానవన పంటల వైపు మళ్లించేందుకు ఏకంగా 10 వేల ఎకరాల లక్ష్యంతో ఈ ప్రాజెక్టును ఎలా మొదలుపెట్టామో ఆయన వివరించారు.

దీని కోసం విద్యుత్ లైన్ల పరిధిలో 180 మీటర్ల లోపు ఉన్న పొలాలను మ్యాపింగ్ చేసి ఉచిత కనెక్షన్లు ఇస్తున్నామని, డీఆర్‌డీఏ (DRDA) ద్వారా బోరు బావులకు రుణాలు మంజూరు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.

ఆయిల్ పామ్ లాంటి దీర్ఘకాలిక పంటలు వేసే రైతులకు ఆదాయం ఆగిపోకుండా అరటి, పత్తి వంటి అంతరపంటలు వేయించి నిరంతర ఆదాయం వచ్చేలా చేస్తున్నామని ఆయన వివరించారు.

రిలయన్స్ ఫ్రెష్, బిగ్‌బాస్కెట్ వంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని మార్కెటింగ్ కష్టాలు లేకుండా చేయడంతో మొదటి దశలోనే లక్ష్యానికి మించి 4,822 ఎకరాల్లో ఈ మిషన్ ఎలా విజయవంతమైందో తన ప్రజెంటేషన్ లో తెలిపారు.

ఈ ఏడు జిల్లాల కలెక్టర్లు ప్రదర్శించిన వినూత్న ప్రాజెక్టులు కేవలం ఆయా ప్రాంతాలకే పరిమితం కాకుండా, భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా సామాన్యుల జీవితాల్లో పెను మార్పులు తీసుకురావడానికి మార్గదర్శకంగా నిలుస్తాయని సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులు ప్రశంసించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *