-18 వ డివిజన్ రాణి గారి తోట లో 3896 గృహ యజమానులకు 3 రకాల చెత్త సేకరణ డబ్బాల పంపిణీ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పరిశుభ్రతలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ఆదర్శంగా ఉంచాలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ సంకల్పానికి శ్రీకారం చుట్టిందని వై.ఎస్.ఆర్ సి.పి ఫ్లోర్ లీడర్ మరియు స్థానిక కార్పొరేటర్ వెంకట సత్యనారాయణ అన్నారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్(క్లాప్) కార్యక్రమంలో భాగంగా 18 వ డివిజన్ పరిధిలోని 3896 కుటుంబాల వారికీ 3 రకాల చెత్త బుట్టల పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. తడి చెత్త, పొడి చెత్త మరియు హానికర వ్యర్థ పదార్ధాలను వేర్వేరుగా సేకరించవలసిన ఆవశ్యకతపై గృహ యజమానులకు అయన వివరిస్తూ, తడి చెత్తను, పొడి చెత్తను, మరియు పెంకులు ప్లాస్టిక్ మరియు ఇతర వ్యర్థ పదార్థాలను విడివిడిగా చెత్త బుట్టలో వేసి కార్పొరేషన్ వారు సందు సందుకి పంపుతున్న వ్యానులో వేయవలసిందిగా స్థానికులకు తెలియజేయడం జరిగింది. ప్రజా భాగస్వామ్యంతో యాంత్రికంగా ఇంటింటి నుంచి చెత్త సేకరణ, వ్యర్థాల శుద్ధి, ప్రతీ ఇంటిలో కంపోస్టు ఎరువులు తయారు చేసేలా చేయడమే స్వచ్ఛ సంకల్పం ప్రధాన ఉద్దేశమన్నారు. నగర పరిశుభ్రతకు మరియు స్వచ్చ డివిజన్ గా అభివృద్ధి పరచుటకు స్థానిక నివాసాల వార౦దరూ సహకరించాలని కోరారు. స్థానికులు ఎవరు చెత్త మరియు వ్యర్ధములను కాలువల్లో పడవేయకుండా, చెత్త బుట్టలను వినియోగించాలని సూచించారు. తదనంతరం ఇంటింటికీ వెళ్లి గృహ యజమానులకు 3 రకాల చెత్త డబ్బాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డా.ఇక్బాల్, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్, హెల్త్ సెక్రటరీలు ప్రభు, బాలస్వామి, నాగలక్ష్మి వాలంటీర్లతో పాటు వై.సి.పి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News