మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రమాదాల్లోనూ, అనారోగ్యం కారణంగానూ ఏటా వేలమంది మన దేశంలో తమ అవయవాల్నీ, వాటితోపాటే జీవనోపాధినీ కోల్పోతున్నారని అలాంటి అభాగ్యులు కృత్రిమ అవయవాల వలన దివ్యాంగులు వారి పనులను వారే చేసుకోవడానికి వీలవుతుందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) మనో దైర్యం కల్పించారు .
మంగళవారం ఉదయం ఆయన తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను కలుసుకొని వారి ఇబ్బందులను అడిగి తెలుసుకొన్నారు.
స్థానిక మూడు గుళ్ళ కూడలి ప్రాంతానికి చెందిన దానమ్మ ఒక వృద్ధురాలు తన కుమారునికి ఆరునెలల క్రితం ప్రమాదం జరగడంతో మోకాలు వరకు తొలగించారని కృత్రిమ కాలు అమర్చడానికి 50 వేల రూపాయలకు పైగా ఖర్చు అవుతుందని తన అల్లుడు చెబుతున్నారని ఆర్ధికంగా తాము అంత స్థితిమంతులం కాదని మీరే మా అబ్బాయికి ఆ జైపూర్ కాలు సమకూర్చాలని వేడుకొంది. ఈ విషయమై స్పందించిన మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, జైపూర్ కాలు అంగవైకల్యం కలవారికి ఒక వరప్రసాదమని రబ్బరు ఆధారిత పాలీ యూరిథేన్తో తయారుచేయబడిన కృత్రిమ అవయవము మోకాలు క్రింది భాగం నుండి పాదం వరకు వివిధ పరిమాణాలలో ఈ కృత్రిమ అవయవం ఉంటుందన్నారు. ఈ తరహా కృత్రిమ అవయవాలలో అతి చవకైనది, సులువుగా తయారు చేయడానికి, అమర్చు కోవడానికి అనువైనది. జైపూర్ కాలుతో ఓ వ్యక్తి నడవడం, పరిగెత్తడం, సరిగ్గా కూర్చోవడం వంటి తన రోజు వారి అవసరాలు సులువుగా చేసుకోవచ్చని అన్నారు. దీని పనితీరు కారణంగా ప్రపంచంలోనే ఎక్కువ వాడే ప్రాస్ధెటిక్ ఫుట్గా పేరుపొందిందన్నారు. తన వ్యక్తిగత కార్యదర్శి తేజాను మంత్రి పిలిపించి దానమ్మ గారి అల్లుడు ఫోన్ నెంబర్ జైపూర్ కృత్రిమ కాలుకు సంబంధించిన వివరాలు త్వరగా సేకరించిన తనకు అందచేయాలని ఆదేశించారు.
ఆర్టీవో కార్యాలయంలో పార్టి తరుపున నామినేటెడ్ పోస్ట్ తనకు ఇప్పించాలని, రవాణా శాఖకు చెందిన మీరు నన్ను రికమెండ్ చేస్తే ఆ పదవి తాను పొందుతానని విశాఖపట్టణానికి చెందిన ఎం. నాగేశ్వరరావు వ్యక్తి మంత్రిని అడిగారు. ఈ తరహా పోస్ట్ ఉంటుందని నేను చెప్తే పని అవుతుందని మీకు చెప్పిన వారు ఎవరు అని మంత్రి ఆయనను ప్రశ్నించారు. తనకు తెల్సిన ఒక ఆర్టీవో ఈ సలహా చెప్పారని బదులిచ్చారు. ఆ విధంగా ఆయన ఎలా చెప్పారని మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదేమైనా పోస్టింగా ప్రమోషనా డిప్యుటేషనా అని అంటూ నామినేటెడ్ పోస్టులు ముఖ్యమంత్రి గారిదే తుది నిర్ణయమని తనను ఈ విషయం అడగడం సరి కాదని మంత్రి ఆయనకు హితబోధ చేశారు.
మచిలీపట్నం మండలం కొత్తపూడి గ్రామానికి చెందిన కందుల నాగలక్ష్మి అనే మహిళ మంత్రి వద్ద తన కష్టాన్ని చెప్పుకొంది. తన భర్త తనను నిత్యం వేధిస్తూ తరచూ చేయి చేసుకొంటున్నాడని విలపించింది. నేరుగా దిశ పోలీస్ స్టేషన్ కు వెళ్లి డిఎస్పి రాజీవ్ కుమార్ ను కలిసి తాను పంపించినట్లు తెలియచేయనమని మంత్రి పేర్ని నాని ఆమెకు సూచించారు.
Tags machilipatnam
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …