అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కొన్ని వింతలు ఎంత చదివినా నమ్మశక్యం కావు, ఎంత శోధించినా కారణాలు అంతుచిక్కవు. అలాంటివి మనదేశంలో చాలానే కనిపిస్తాయి. తమిళనాడు కుంభకోణంలోని తిరునరైయూరు క్షేత్రంలో ఉన్న నాచ్చియార్ కోవెలనే తీసుకుందాం… ఇక్కడ విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అమ్మవారూ కొలువైనప్పటికీ ఇది శ్రీవారి వాహనమైన గరుత్మంతుడి ఆలయంగానే ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే ఇక్కడికొచ్చే భక్తులకు వరాలు ఆయనే అనుగ్రహిస్తాడట. అంతేగాక, ఉత్సవమూర్తిగా ఉన్న గరుత్మంతుడి విగ్రహం ఊరేగింపు సమయంలో బరువు మారిపోతుంటుంది. స్వామివారు అంతః ప్రాకారంలో గరుడ వాహనం ఎక్కినప్పుడు అది తేలికగా ఉండి నలుగురు మనుషులు మోస్తే సరిపోతుంది. అయితే 5 ప్రాకారాలను దాటి సింహద్వారం దగ్గరకు వచ్చేసరికి దాని బరువు ఇంతింతై వటుడింతై అన్న రీతిలో పెరుగుతుందట. అంటే – 2వ ప్రాకారాన్ని దాటుతున్నప్పుడు 8 మంది, 3వ ప్రాకారం దాటేటప్పుడు 16 మంది, 4వ ప్రాకారాన్ని దాటేటప్పుడు 32 మంది, 5వ ప్రాకారాన్ని దాటేటప్పుడు 64 మంది మోయాల్సి వస్తుంది. 5 ప్రాకారాలూ దాటి వీధుల్లోకి వచ్చే సమయానికి గరుడవాహనం బరువు బాగా పెరిగిపోయి 128 మంది మోయాల్సి వస్తుంది. దాంతో ప్రధాన వీధుల్లోకి వచ్చేసరికి 16 మంది మోస్తున్న హంసవాహనం ముందు వెళుతూ ఉండగా దాని వెనకాల 128 మంది మోస్తున్న స్వామివారి గరుడవాహనం నిదానంగా కదులుతూ ఉంటుంది. మరో విచిత్రం ఏంటంటే- ఈ ఊరేగింపు సమయంలో గరుత్మంతుని ఉత్సవ విగ్రహానికి చెమటలు కనిపిస్తాయి. గరుత్మంతుడు ప్రారంభంలో తక్కువ బరువు ఉండి, క్రమంగా పెరిగేసరికి చెమట పడుతుందనేది భక్తుల విశ్వాసం. ఈ బరువు ఇలా ఎలా పెరుగుతుందన్న విషయమై ఎన్నో సంవత్స రాలుగా పరిశోధిస్తున్నా అసలు విషయం మాత్రం ఈనాటికీ అంతుబట్టలేదట.
Prajavartha Online Telugu News