విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఆర్గానిక్ పాలసీ తీసుకురాబోతుందని, పాలు, హార్టీకల్చర్, అగ్రికల్చర్ కు సంబంధించిన అన్ని విషయాలు ఉన్నాయని.. దేశంలో అన్ని రాష్ట్రాలు మన రాష్ట్రంవైపు ఎదురుచూస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్ మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ (APDDCF) లిమిడెడ్ ఎండీ, ఐఏఎస్ అధికారి బాబూ ఏ తెలిపారు. విజయవాడలో భూమి ఆర్గానిక్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన డైరీ ఎగ్జిబిషన్ (DATEE 2022 – Dairy Animals Technology Equipment Expo) కరపత్రాలను బాబూ ఏ విడుదల చేశారు. 4వ ఆర్గానిక్ మహోత్సవం యొక్క కరపత్రాలను ఐఎఫ్ఎస్ అధికారి చిరంజీవి చౌదరి విడుదల చేశారు.
బాబూ ఏ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పాల ఉత్పత్తిలో దేశంలోనే 4వ స్థానంలో ఉందని, రాష్ట్రంలో మంచి క్వాలిటీ ఆహారం లభిస్తుందని తెలిపారు. పాల సేకరణలో ధరను నిర్ణయించడానికి 19 రకాల పరిశీలనలు చేస్తున్నారని, హెల్తీ మిల్క్ ప్రొడక్షన్ కోసం రైతుల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తద్వారా రైతులకు ఆదాయం పెరుగుతుందని, ప్రజలకు ఉత్తమ ఆహారంతో ఆరోగ్యంగా ఉంటామని ఆయన తెలిపారు. ప్రజలకు తెలియకుండానే కొన్ని సందర్భాల్లో నకిలీ పాలను కూడా వినియోగిస్తున్నామన్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఏ1 క్వాలిటీ గల పాలు లీటర్ రూ.200 వరకూ ఉంటుందని, వాటికి డిమాండ్ కూడా ఎక్కువగా ఉందన్నారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు, ఎగ్జిబిషన్ లతో రైతులకు, ప్రజలకు అవగాహన పెరిగి రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా ఎదుగుతుందని బాబు ఏ ఆకాక్షించారు.
చిరంజీవి చౌదరి మాట్లాడుతూ ఆర్గానిక్ ఉత్పత్తులకు గతంలో కంటే ప్రస్తుతం డిమాండ్ పెరిగిందని, ప్రజల్లో ఆరోగ్యం మీద అవగాహన పెరిగిందని తెలిపారు. రసాయనిక పదార్థాలు ఎక్కువగా వాడడం వల్ల కాలుష్యం పెరిగిందని, వాతావరణంలో కూడా మార్పులు వచ్చాయని తెలిపారు. ఆర్గానిక్స్ ను ఉపయోగించడం వల్ల మానవాళి జీవితకాలం పెరుగుతుందని తెలిపారు. ఆర్గానిక్స్ కు భవిష్యత్ లో మంచి డిమాండ్ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
విజయవాడలో ఫిబ్రవరి 25, 26, 27న జరుగు ఈ అతి పెద్ద ఆర్గానిక్ వ్యవసాయ మహోత్సవం నిర్వహిస్తామని ఈ కార్యక్రమ నిర్వాహకులు, భూమి ఆర్గానిక్స్ అధినేత రఘురాం మాగులూరి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సేంద్రీయ ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకము, వేరుగా పాలు, పాల ఉత్పత్తిదారులు సంఘాలు, పాల ప్యాకింగ్ యంత్రాలు, పాల ప్రాసెసింగ్ యూనిట్లు మరియు ప్రదర్శన మరియు అమ్మకానికి ఏర్పాటు చేయడమైనది. అలాగే నర్సరీ, పూల, పండ్లు, కాయగూరల మొక్కల ప్రదర్శన మరియు అమ్మకముతోపాటుగా దేశవాళీ ఆవుల కోసం విడిగా ప్రదర్శనశాల ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ బాబూ అహ్మద్ మరియు చిరంజీవి చౌదరి, ఐ.యఫ్.యస్. ముఖ్య అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమముల వలన రైతులకు, ప్రజలకు, వ్యాపారులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అభినందించారు. అనంతరం భూమి ఆర్గానిక్స్ స్టోర్ ను సందర్శించారు. ఆర్గానిక్ ఉత్పత్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.