-ఏపీయూడబ్ల్యూజే కృష్ణా అర్బన్ డైరీని ఆవిష్కరించిన ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యలపై త్వరలోనే సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టి సారించనున్నారని ఈ విషయంలో ఎవరూకూడా ఎటువంటి అపోహలకు వెళ్లవద్దని ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ తెలిపారు. అందుకు తనవంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈమేరకు సీఎం జగన్ తో మాట్లాడటం కూడా జరిగిందన్నారు. అక్రిడిటేషన్, జర్నలిస్టులకు ఇళ్లు, హెల్త్ కార్డులు వంటి సమస్యలు త్వరలోనే ఓ కొలిక్కి వస్తాయని ఆయన తెలిపారు. అలాగే ప్రభుత్వం తనకు అప్పగించిన ప్రధాన బాధ్యతలను నెరవేరుస్తూ వస్తున్నానని తెలిపారు. దానిలో భాగంగానే జర్నలిస్టులకు అవగాహన పెంచేలా ఏపీ ప్రెస్ అకాడమీ ద్వారా నిర్వహిస్తున్నామన్నారు. ఆన్ లైన్ ద్వారా జర్నలిస్టులకు తరగతులను యూనివర్శిటీల సమన్వయంతో ఏర్పాటు చేస్తున్నామని ఈ జర్నలిజం కోర్సులను ప్రతి ఒక్క జర్నలిస్టు సద్వినియోగం చేసుకోవాలని ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ పిలుపునిచ్చారు. ఏపీయూడబ్ల్యూజే కృష్ణా జిల్లా యూనిట్ ప్రచురిెంచిన 2022 మీడియా డైరీని విజయవాడ ప్రెస్ క్లబ్బులో శుక్రవారం ఆయన లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐజేయూ జాతీయ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు మాట్లాడుతూ జిల్లాలోని అన్ని శాఖల సమాచారం డైరీలో సమగ్రంగా ఉంటుందనన్నారు. ఏపీయూడబ్య్లూజే అర్బన్ యూనియన్ డైరీని ప్రతి ఒక్క జర్నలిస్టు రోజువారీ కార్యక్రమాలకు ఉపయోగించడం ఎంతో ఆనంద దాయకం అన్నారు. గత నాలుగు దశాబ్దాలుగా యూనియన్ డైరీని అందరి సహకారంతో ఎంతో విజయవంతంగా తీసుకురావడం జరుగుతుందని వివరించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతి రావు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే అర్బన్ యూనియన్ కార్యదర్శి కొండా రాజేశ్వరరావు, సీనియర్ పాత్రికేయులు షేక్ బాబు, యూనియన్ ఉపాధ్యక్షులు పి సురేంద్ర కుమార్, ప్రెస్ క్లబ్ సెక్రటరీ వసంత్, ఏపీ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ సాంబశివరావు, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ జి రామారావు, దాసరి నాగరాజు తదితరులతో పాటు ప్రెస్ అకాడమీ కార్యదర్శి మామిడిపల్లి బాలగంగాధర్ తిలక్ డైరీ ఆవిష్కరణలో పాల్గొన్నారు. జర్నలిస్టులకు కావాల్సిన అధికార్ల టెలిఫోన్ నెంబర్లతో కూడిన సమాచారాన్ని పొందుపర్చి ప్రచురించిన ఈ డైరీ తమ వృత్తి నిర్వహణలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సీనియర్ పాత్రికేయులు తమ అభిప్రాయాలను తెలియజేశారు. పలు మీడియా సంస్థలలో పని చేస్టున్న పాత్రికేయులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ ను అర్బన్ యూనిట్ ఘనంగా సత్కరించింది.