-పిఆర్సి జీవోలు రద్దు చేసి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలి.
-సమ్మెను నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది.
-ప్రభుత్వం పట్టుదలకు పోకుండా సమస్య పరిష్కారంపై దృష్టిపెట్టాలి.
– వామపక్ష పార్టీల డిమాండ్.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులు, పెన్షనర్లు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యాన ఫిబ్రవరి 1, 2 తేదీల్లో అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు.
విజయవాడలోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో వామపక్ష పార్టీల రాష్ట్ర నాయకులు శుక్రవారం సమావేశమై ప్రస్తుతం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు చేస్తున్న ఉద్యమం, ప్రభుత్వ వైఖరి, ఇందుకు కారణాలను, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
ఎంసీపీఐ(యు) రాష్ట్ర సహాయ కార్యదర్శి తూమాటి శివయ్య అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు, సీనియర్ నాయకుడు మంతెన సీతారామ్, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ నాయకులు డి. హరినాథ్, ఈశ్వర్, ఎసయూసీఐ నాయకుడు సుధీర్ పాల్గొన్నారు.
అనంతరం రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం పట్టుదలకు వెళ్లకుండా పీఆర్సీ జీవోలను తక్షణమే రద్దు చేసి, పీఆర్సీ సాధన సమితి నాయకులతో చర్చలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సమ్మెను నివారించాల్సిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వంపైనే ఉందన్నారు. పీఆర్సీ కోసం ఉద్యోగులు రెండేళ్లుగా ఎదురు చూస్తున్నారని, కనీసం పీఆర్సీకి మూలమైన అశోతోష్ మిశ్రా కమిటీ నివేదికను కూడా ఉద్యోగ సంఘాలకు ఇవ్వకుండా, ఆకస్మికంగా అర్ధరాత్రి జీవోలు చేసి ఏకపక్షంగా ప్రభుత్వం వ్యవహరించడం సరికాదన్నారు. అదే సమయంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులను కించపరిచేలా వైసీపీ నాయకులు, కొందరు ఎమ్మెల్యేలు తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. వెంటనే ఈ దుష్ప్రచారాన్ని నిలిపివేయాలని హితవు పలికారు. ఒకవైపు జాబ్ క్యాలెండర్, ఖాళీ పోస్టుల భర్తీ కోసం నిరుద్యోగులు పోరాటం సాగిస్తూ ఉండగా మరోవైపు ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును పెంచడం దుర్మార్గమని అన్నారు. తక్షణమే ప్రభుత్వం తన విధానాలను మార్చుకోవాలని, లేకపోతే ఉద్యోగులకు మద్దతుగా వామపక్ష పార్టీలు ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొంటాయని, ఆ తర్వాత చోటుచేసుకునే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని స్పష్టంచేశారు. ప్రజలు కూడా ఆలోచించాలని, ఉద్యోగులు తమకు చట్టబద్ధంగా రావాల్సిన హక్కుల గురించి మాత్రమే పోరాటం చేస్తున్నారనే విషయాన్ని గుర్తించి నైతిక మద్దతు ఇవ్వాలని కోరారు.
సీహెచ్ బాబూరావు మాట్లాడుతూ ఉద్యోగులు గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని, ఎన్నికల ముందు ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాత్రమే కోరుతున్నారని చెప్పారు. కొత్త జీతాలు వద్దు, పాత వేతనాలు ఇవ్వాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు కోరే పరిస్థితి వచ్చిందటే పీఆర్సీ ఎలా ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్ధం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పెన్షనర్ల కూడా కోత విధించి మనసిక క్షోభకు గురిచేయడం ప్రభుత్వ దిగజారుడు తనానికి నిదర్శనమని విమర్శించారు. ఉద్యోగుల పోరాటానికి వామపక్ష పార్టీలు మద్దతు ఇస్తాయని, ఫిబ్రవరి 1, 2 తేదీల్లో నిర్వహించనున్న సదస్సులను జయప్రదం చేయాలని హరినాథ్, శివయ్య, సుధీర్ కోరారు.