Breaking News

తెలుగు సినిమా ప్రముఖులతో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు సినిమా ప్రముఖులతో తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌ మాట్లాడుతూ మంచి పాలసీ తీసుకురావాలని, తద్వారా పెద్ద సినిమాలకు, చిన్న సినిమాలకు న్యాయం జరగాలని గత కొద్ది కాలంగా కసరత్తు జరుగుతుంది. ఇందులో భాగంగానే అందరి అభ్యర్ధనలను పరిగణలోకి తీసుకుంటూ… దీనిపై ఒక కమిటీని కూడా నియమించాం. ఆ కమిటీ కూడా తరచూ సమావేశమవుతూ వాళ్లకొచ్చిన ఫీడ్‌ బ్యాక్‌ కూడా నాతో పంచుకున్నారు. ఇంకా విస్తృతంగా తెలుసుకునేందుకు మిమ్నల్ని కూడా రమ్మని చెప్పాం. సినిమా పరిశ్రమలో ఉన్న కొన్ని కొన్ని లోపాలను పూర్తిగా సరిదిద్దుకుని.. ఇండస్ట్రీ నిలబడ్డానికి ఒక మంచి వ్యవస్ధను క్రియేట్‌ చేసుకునేందుకు తపన, తాపత్రయంతోనే అడుగులు పడ్డాయి. మీరన్నట్టుగా ఏ సినిమాకైనా, ఎవరి సినిమాకైనా ఒకే రేటు ఉండాలి. ప్రాధమికంగా ఒక ప్రాతిపదిక లేనంతవరకు …కొద్దిమందికి ఎక్కువ వసూలు చేయడం, కొద్దిమందికి తక్కువ వసూలు చేయడం అనేది ఉంటుంది. ఈ పాయింట్‌ను కూడా చర్చించాను. నేను, చిరంజీవి అన్న ఇద్దరం కలిసి కూర్చుని దీనిపై చాలాసేపు విస్తృతంగా చర్చించాం. మంచి ధరలు తీసుకురావడం జరిగింది. ఇవి ఎవరికైనా కూడా మంచి రేట్లే… అందరికీ న్యాయం జరిగేలా మంచి ధరలు తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. హీరో పారితోషకం, హీరోయిన్‌ పారితోషకం, దర్శకుడు పారితోషం వంటి అంశాలను పరిగణలోకి తీసుకోకుండానే నిర్మాణవ్యయం పరంగా కొన్ని భారీ బడ్జెట్‌ సినిమాలు కూడా ఉన్నాయి. ఈ తరహా సినిమాలు చేయడంలో రాజమౌళి నిపుణుడు. అటువంటి వాటిని ప్రత్యేకంగా చూడాలి. అలా ప్రత్యేకంగా చూడకపోతే భారీ టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఖర్చుతో చేయడానికి ఎవరూ ముందుకురారు. హీరో, హీరోయిన్, డైరెక్టర్‌ రెమ్యునరేషన్‌ కాకుండా, వీటిని పక్కన పెట్టి కేవలం సినిమా కోసమే రూ.100 కోట్లు కంటే ఎక్కువ ఖర్చు అయిన భారీ బడ్జెట్‌ సినిమాలును ప్రత్యేకంగా ట్రీట్‌ చేయాలి. అటువంటి వాటికి వారం రోజుల పాటు కచ్చితంగా ప్రత్యేక ధరలు నోటిఫై చేసే విధంగా ట్రీట్‌ చేయాలని చెప్పాం. ఇక్కడ కూడా రాష్ట్రంలో షూటింగ్‌లు ప్రమోట్‌ చేయడం కోసం కొంత పర్సెంటేజ్‌ కేటాయించాం. ఏపీలో సినిమా షూటింగ్‌లు ప్రమోట్‌ చేయడం కోసం… ఇక్కడ షూటింగ్‌లు జరిపి ఉండాలి అన్న నిబంధనను తీసుకురాగలిగితే ఇక్కడ కూడా షూటింగ్‌లు పెరుగుతాయి. కనీసం ఎంత శాతం షూటింగ్‌ ఆంధ్రప్రదేశ్‌లో చేయాలన్న దానిపై ఇప్పటికే మంత్రి పేర్ని నాని దర్శకులు, నిర్మాతలతో మాట్లాడరు. వారందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని నాతో కనీసం 20 శాతం పెడతాము అని చెప్పారు.

రేట్లకు సంబంధించినంత వరకు… అందరికీ ఒకటే రేట్లు. ఆన్లైన్‌ పద్ధతిలో టిక్కెట్లు విక్రయం ప్రభుత్వానికి మంచిది, సినిమా ప్రొడ్యూసర్లకు కూడా మంచిది అన్న కోణంలో చూశాం. ఓటీటీలతో పోటీపడాల్సిన పరిస్థితిలో సమతుల్యత కూడా ఉండాలని చర్చించాం. ఏడాదికి వేయిరూపాయలతో అమెజాన్‌ ఇస్తుంది. నెలకు సగటున రూ.80లు పడుతుంది. దీన్నికూడా దృష్టిలో ఉంచుకోవాలి. చిరంజీవిగారితో కూడా సుదీర్ఘంగా ఇదే విషయంపై చర్చించాం. ఆలాగే కనీస ఆదాయాలు రాకపోతే సినిమాలు తీసే పరిస్థితి కూడా తగ్గిపోతుంది. దాన్ని కూడా సమతుల్యం చేసుకుని సినిమాలు తీసే పరిస్థితి ఎలా అన్న ఆలోచనతో రీజనబుల్‌రేట్లు దిశగా వెళ్లాం. సినిమా చూసే ప్రేక్షకులకు భారంకాకుండా, ఆ రేట్లు సినిమా పరిశ్రమను పెంపొందించేలా ఉండేలా రేట్లను మాడిఫై చేశాం.

మరొక్క అంశం…మీరు ఐదో షోను కూడా తీసుకురావాలని అడిగారు. సినిమా శుక్రవారం, శనివారం, ఆదివారం.. ఆ తర్వాత వారం ఆడగలిగితే సూపర్‌హిట్‌ అవుతుంది. ఆ పాయింట్‌ అర్ధం చేసుకున్నాం. అదే సమయంలో అది అందరికీ వర్తిస్తుంది. చిన్న సినిమాలకు అవే రేట్లు వర్తిస్తాయి. వారిక్కూడా మంచి ఆదాయాలు వస్తాయి. ఐదో ఆట వల్ల ఇండస్ట్రీకి కూడా మేలు జరుగుతుంది. మల్టీప్లెక్స్‌లును కూడా మంచి ధరలతో ట్రీట్‌ చేయడం జరుగుతుంది. మీరు చెప్పిన అన్ని విషయాలను మనసులో పెట్టుకున్నా. మీ అందరికీ సంతోషం కలిగించినందుకు ఆనందంగా ఉంది.

నెమ్మదిగా సినీపరిశ్రమకూడా విశాఖపట్నం రావాలి. అందరికీ విశాఖపట్నంలో స్థలాలు ఇస్తా. నెమ్మదిగా ఇక్కడ కూడా దృష్టిపెట్టండి. తెలంగాణాతో పోలిస్తే ఫిల్మ్‌ ఇండస్ట్రీకి ఆంధ్రా ఎక్కువ కంట్రిబ్యూట్‌ చేస్తోంది. తెలంగాణా 35 నుంచి 40 శాతం కంట్రిబ్యూట్‌ చేస్తోంది. ఆంధ్రా 60 శాతం వరకు కంట్రిబ్యూట్‌ చేస్తోంది. ఏపీలో జనాభా ఎక్కువ, ప్రేక్షకులు ఎక్కువ, ధియేటర్లు కూడా ఎక్కువ. ఆదాయపరంగా కూడా ఏపీ ఎక్కువ. వాతావరణం కూడా బాగుంటుంది. అందరికీ స్ధలాలు ఇస్తాం. స్టూడియోలు పెట్టేందుకు ఆశక్తి చూపిస్తే వాళ్లకు కూడా విశాఖలో స్థలాలు ఇస్తాం. జూబ్లీహిల్స్‌ తరహా ప్రాంతాన్ని క్రియేట్‌ చేద్దాం. విశాఖ బిగ్గెస్ట్‌సిటీ. కాస్త పుష్‌చేయగలిగే అవకాశాలున్న సిటీ విశాఖపట్నం. చైన్నె, బెంగుళూరు, హైదరాబాద్‌లతో విశాఖపట్నం పోటీపడగలదు. మనం ఓన్‌ చేసుకోవాలి, మనందరం అక్కడకి వెళ్లాలి… అప్పుడే విశాఖపట్నం, ఇవాళ కాకపోయినా పదేళ్లకో, పదిహేనేళ్లకో.. మహానగరాలతో పోటీపడుతుంది. దీనికి ముందడుగు పడాలంటే.. సినిమా పరిశ్రమ విశాఖ వెళ్లేందుకు అడుగులు పడాలి. అందరూ దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. అందరికీ స్థలాలు ఇస్తా… ఇళ్లస్థలాలతోపాటు, స్టూడియో స్థలాలు కూడా ఇస్తానని నా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను. రాజమౌళి మంచి సినిమాలు, పెద్ద సినిమాలు తీయాలి. చిన్న సినిమాలను కూడా రక్షించుకోవాలి. దీనికోసం కార్యాచరణ చేసుకోవాలని కోరుతున్నాను. సినిమా క్లిక్‌ కావాలంటే పండగ రోజు రిలీజ్‌ చేస్తే హిట్‌ అవుతుందని అందరికీ తెలుసు. ఇక్కడే చిన్నసినిమాను రక్షించుకోవడానికి కూడా కొంత సమతుల్యత అవసరం. పరిశ్రమనుంచే దీనికి తగిన కార్యాచరణ ఉండాలని కోరుతున్నాం. ఆ పండగ రోజు మాకు అవకాశాలు లేవని చిన్నసినిమా వాళ్లు అనుకోకుండా… కాస్త సమతుల్యత పాటించాలని విజ్ఞప్తి. ఈ విషయంలో కలిసి పనిచేద్దాం. వాళ్లు కూడా పరిశ్రమలో భాగమే. వాళ్లనూ భాగస్వామ్యులు చేయాలన్నారు.

చిరంజీవి, సినీనటులు.
కమిటీ ఇచ్చిన నివేదికతో పాటు, మంచి, చెడ్డలు తెలుసుకోవడానికి, మా అభిప్రాయం సేకరించడానికి తొలుత ఫిల్మ్‌ ఇండస్ట్రీ నుంచి నన్ను ఆహ్వానించారు. ఆ తర్వాత కలిసికట్టుగా అందరం వచ్చి అభిప్రాయలను వ్యక్తీకరించడానికి ఈ అవకాశం కల్పించినందుకు చాలా ధన్యవాదాలు. మీ అభిప్రాయాలను, మీ నిర్ణయాలను ఎప్పుడూ గౌరవిస్తాం. మీరు పేదల మనిషి. పరిశ్రమలో అందరితో మాట్లాడి మీ ముందుకు వచ్చాం. ఉభయులకీ సామరస్యంగా ఉండేలా నిర్ణయం తీసుకోవడం బాగుంది. ప్రతిపాదనలు చూశాక మాకు చాలా సంతృప్తి వచ్చింది. చాలా సంతోషంగా ఉన్నాం. మా అందరికీ చాలా వెసులుబాటు కల్పించారు. మీరు తీసుకున్న నిర్ణయాలు పట్ల ఎగ్జిబిటర్ల రంగం చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నాం. టిక్కెట్‌ రేట్లుగాని, ఇతరత్రా విషయాల్లో చాలా ఎక్సర్‌సైజ్‌చేశారు. పెట్టే అమ్మని అన్నీ అడుగుతారు. ఇచ్చేవారినీ కోరుతారు. అందుకే మా కోరికలు కోరుతున్నాం. సినిమా ధియేటర్‌కి ప్రేక్షకులను రప్పించడానికి కొన్ని ప్రత్యేకతలు సినిమాలోకి తీసుకురావాల్సి వస్తోంది. విజువల్‌ ఇంపాక్ట్‌ కోసం ఖర్చు చేయాల్సి వస్తోంది.అవి ఉంటేనే కానీ జనాలు ధియేటర్‌కి వెళ్లి సినిమా చూడాలనే మూడ్‌లో లేరు. మా సినిమాలు విడుదలైన వారంరోజుల్లో ప్రేక్షకుల ముందుకు ఓటీటీ రూపంలో వస్తోంది. అలాగే ఫైరసీ ఎప్పటి నుంచో మాకున్న పెద్ద గొడ్డలిపెట్టు. ఇవన్నీ అధిగమించి మేం సినిమాలు తీయాలంటే.. మేం ఖర్చు అధికంగా పెట్టాల్సి వస్తోంది. తెలుగుతనాన్ని, తెలుగు సినిమాని కాపాడే దిశగా మీరు ఉన్నారు. అది కొనసాగే దిశగా మీ చర్యలు కొనసాగాలి. అందులో భాగంగా ఇండస్ట్రీ వైపు చల్లని చూపు చూడాలి. తల్లి స్ధానంలో ఉన్నారు కాబట్టి మిమ్నల్ని అడుగుతున్నాం. తర్వాత ఐదో షో మన నారాయణమూర్తి గారు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. అది ఉంటే మనకు కొంత వెసులుబాటు ఉంటుంది. అది మీ ముందు పెడితే మీరు ఒప్పుకున్నారు.

మహేష్‌బాబు, సినీనటుడు.
కోవిడ్‌ కారణంగా సినిమా పరిశ్రమకు పెద్ద ఇబ్బంది వచ్చింది. గడచిన 2 ఏళ్లనుంచీ తీవ్ర సంక్షోభం ఉంది. మా కెరీర్‌లో ఈ రెండేళ్లు చాలా ఇబ్బంది కరంగా ఉంది. ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య ఉన్న గ్యాప్‌… ఈ తరహా చర్చలు వల్ల తొలగిపోతాయి. మా అందరికీ గత రెండేళ్లు చాలా కష్ట కాలం. ఎప్పుడు షూటింగ్‌ ఆగిపోతుందో.. ఎప్పుడు రిలీజ్‌ అవుతుందో తెలియదు. ఇవాళ చాలా సంతోషకరమైన రోజు.

రాజమౌళి, దర్శకుడు.
ఇప్పటివరకూ ఒక రకమైన భ్రమ ఉండేది. సినీ పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య ఒక అగాధం ఉందనే భ్రమ ఉండేది. అది తొలగిపోయింది. మాతో కలిసి నేరుగా మీరు మాట్లాడుతున్నందుకు సంతోషంగా ఉంది.

ఆర్‌. నారాయణ మూర్తి, సినీ నటుడు.
సగటు సినిమా బతకాలి. పండుగ వచ్చినా, సెలవులు వచ్చినా… పెద్ద సినిమాలకే అవకాశాలు వస్తున్నాయి. సగటు సినిమా బతకాలి.
హిట్‌ అయితేనే సినిమాలు చూస్తారు. చిన్న సినిమాలకు నూన్‌ షో ఉండాలని కోరుతున్నాం. భారీ సినిమా ఎలాంటి ఫలితాలు అనుభవిస్తుందో.. సగటు సినిమా అలాంటి ఫలితాలు అనుభవించాలి.

అలీ, సినీ నటుడు.
గతంలో సినిమా 50 రోజులు, 100 రోజులు ఆడేవి. శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ మూడు రోజుల్లో ఏ స్టార్‌ సినిమా అయినా హిట్‌ లేదా ప్లాప్‌. ఇండస్ట్రీలో దర్శకులు, నిర్మాతలు, నటులు మాత్రమే కాదు వేల మంది టెక్నీషియన్లు పరిశ్రమలో చాలామంది ఉన్నారు. ఇండస్ట్రీకి మంచి చేస్తే ఆ టెక్నీషియన్స్‌ గుండెల్లో మీరు ఉండిపోతారు.

పోసాని కృష్ణమురళి, నటుడు.
చిన్న సినిమాలు బతకాలి. ఇంతకు ముందు నేను చిన్న సినిమాలకు రాసేవాడిని. ప్రేయసిరావే, గాయం, స్నేహితులు… ఇలాంటి వాటికి నేను రాశాను.. శివయ్య నేనే రాశాను. పెద్ద హిట్‌ అయింది. చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వడంలేదు. వీటి వల్ల చిన్న సినిమా చచ్చిపోయింది. సీఎం చేయాలనుకుంటే.. ఏదైనా మనస్ఫూర్తిగా చేస్తారు. చిన్న సినిమాలకు మీరు తోడుగా నిలవండి. కేరళలో కూడా చిన్న సినిమాలు బాగా నడుస్తున్నాయి. సినిమా పరిశ్రమలో 30వేల టెక్నీషియన్లు ఉన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో సినీనటుడు చిరంజీవి, మహేష్‌బాబు, ప్రభాస్, రాజమౌళి, అలీ, ఆర్‌. నారాయణమూర్తి, పోసాని కృష్ణమురళి, కొరటాల శివ, నిరంజన్‌ రెడ్డి, మహి రాఘవ ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఐఎండ్‌ పీఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని), సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, ఐఅండ్‌ పీఆర్‌ కమిషనర్, ఎఫ్‌డిసీ ఎండీ టి విజయ్‌కుమార్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

 

Check Also

థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్

-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *