-జిల్లా స్థాయి వర్క్ షాప్‌లో వివిధ విభాగాల కార్యదర్శులు
-సమస్యల శాశ్వత పరిష్కారమే స్పందన లక్ష్యం : సీఎంవో కార్యదర్శి
-కలిసికట్టుగా కృషి చేసి జిల్లాను ముందంజలో ఉంచుతాం : కలెక్టర్
విజయనగరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా వినతులను క్షుణ్నంగా పరిశీలించి.. నాణ్యమైన పరిష్కారం చూపడమే లక్ష్యంగా సేవలందిస్తున్న స్పందన కార్యక్రమం మరింత విజయవతంగా నడవాలని, దానికి గాను ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతమైన కృషి చేయాలని వివిధ విభాగాల కార్యదర్శులు, ప్రత్యేక కార్యదర్శులు, రాష్ట్ర స్థాయి అధికారులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనకు, లక్ష్య సాధనకు అనుగుణంగా ప్రతి అధికారీ నడుచుకోవాలని ప్రజల నుంచి వచ్చే వినతులపై మనసు పెట్టి స్పందించాలని సూచించారు. మంచి ప్రవర్తన.. నడవడికతో ప్రజలు సంతృప్తి చెందేలా సమస్యలకు అంతిమ పరిష్కారం చూపాలని పేర్కొన్నారు. స్పందన కార్యక్రమంపై ఒక్క రోజు జిల్లా స్థాయి వర్క్ షాప్ స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం జరిగింది.
ముఖ్యమంత్రి కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్య రాజ్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి హరికృష్ణ, గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శి అజయ్ జైన్, ప్రణాళికా శాఖ కార్యదర్శి జి.ఎస్.ఆర్.కె.ఆర్. విజయ కుమార్, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక కార్యదర్శి రాహుల్ పాండే, భూ, సర్వే శాఖ కమిషనర్ సిద్ధార్థ్ జైన్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కమిషనర్ శాంతిప్రియ పాండే, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రత్యేక కార్యదర్శి రామ్మోహన్ రావు, పౌర సరఫరాల శాఖ సంచాలకులు ఢిల్లీరావు, ఇతర అధికారులు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి పలు అంశాలపై మాట్లాడారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కలెక్టర్ ఎ. సూర్యకుమారి సభను ఉద్దేశించి ప్రారంభోపాన్యాసం చేశారు. జిల్లా స్థాయి వర్క్ షాప్ ఉద్దేశాన్ని ముందుగా వివరించారు. జిల్లాలో తలెత్తుతున్న వివిధ సమస్యలను ఈ సందర్భంగా ఆమె కార్యదర్శుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా నెట్ వర్క్ సమస్య వేధిస్తోందని, దాని కారణంగానే అధిక వినతులు పెండింగ్‌లో ఉంటున్నాయని పేర్కొన్నారు. ఈ వర్క్ షాప్ స్ఫూర్తిని జిల్లాలో విజయవంతంగా కొనసాగిస్తామని.. ఇక్కడ చర్చకు వచ్చిన ప్రతి అంశాన్నీ ఆచరణాత్మకంగా అమలు చేస్తామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి ఆశించిన మేరకు ఫలితాలను సాధిస్తామని చెప్పారు. సేవలను మరింత విస్తృతం చేస్తామని, సమష్టి కృషితో జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో ఉంచుతామని కలెక్టర్ పేర్కొన్నారు.
అర్జీ తీసుకోవడమే కాదు… పరిష్కారం ముఖ్యం
: ముఖ్యమంత్రి కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్
ప్రజల నుంచి అర్జీలను అందుకోవడంతో పాటు, వారి సమస్యను పరిష్కరించడం కూడా ముఖ్యమని ముఖ్యమంత్రి కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్ స్పష్టం చేశారు. చిరునవ్వుతో వినతులను స్వీకరించాలని, వారి సమస్యను పూర్తిగా అర్ధం చేసుకోవాలన్నారు. సమస్యల శాశ్వత పరిష్కారమే స్పందన కార్యక్రమం అసలు లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలు అందజేసిన వినతులను క్షుణ్ణంగా చదివి, వాటి పరిష్కారం కోసం సరైన అధికారికి అప్పగించాలని సూచించారు. సమస్య పరిష్కారం అయితే ఆ విషయాన్ని, అవ్వకపోతే దానికి గల కారణాన్ని అర్జీదారునికి తెలియజేయాలని చెప్పారు. ప్రస్తుతం సచివాలయ, వలంటీర్ల వ్యవస్థలు మనకు అందుబాటులో ఉన్నాయని, వీటిని సక్రమంగా నినియోగించుకోవాలని సూచించారు. స్పందన వినతులపై ప్రతీ వారమూ సమీక్షి నిర్వహించాలన్నారు. ప్రతీ ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని, స్పందన వినతుల పరిష్కారంలో గణనీయమైన మార్పును తీసుకురావాలని కోరారు. సుస్థిరాభివృద్ది లక్ష్యాల సాధనకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. ఈ లక్ష్యాల సాధనలో మన రాష్ట్రాన్ని దేశంలోనే నెం.1 గా నిలిపేందుకు కృషి చేయాలని కోరారు.
స్పందనకు అధిక ప్రాధాన్యత
: ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి హరికృష్ణ
ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, కార్యక్రమాల్లో స్పందనకు రాష్ట్ర ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, ఆయన ఆలోచనలకు అనుగుణంగా మనందరం కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి ఎం. హరికృష్ణ పేర్కొన్నారు. నాడు పాదయాత్ర అనుభవాలను మొదటి క్యాబినేట్‌లో ఆయన మా అందిరతో పంచుకున్నారని తెలిపారు. చిన్న చిన్న సమస్యల కోసం ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని.. వారి సమస్యల పరిష్కారం కోసం పటిష్టమైన వ్యవస్థను రూపొందించాలని ముఖ్యమంత్రి మా అందరికీ సూచించారని గుర్తు చేశారు. కావున ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తూ.. ప్రజా సమస్యలపై మనసు పెట్టి ఆలోచించాలని, వినతుల పట్ల హృదయంతో స్పందించాలని సూచించారు. మంచి వ్యవస్థ రూపకల్పనకు, జవాబుదారీ తనానికి స్పందన చిరునామాగా ఉండాలని, ఆ విధంగా అందరూ సమష్టి కృషి చేయాలన్నారు. అర్జీ పెట్టుకున్న వ్యక్తికి భరోసా ఇచ్చేలా ప్రతి ఒక్కరూ వ్యవహరించాలని సూచించారు. మంచి ప్రవర్తన, నడవడికతో మసులుకోవాలని, నిర్లక్ష్యం, నిర్లిప్తత సరికాదని పేర్కొన్నారు. అనుక్షణం బాధ్యతగా ఉంటూ.. చిత్తశుద్ధితో ప్రజా సమస్యలను పరిష్కరించాలని హితవు పలికారు. స్పందన కార్యక్రమం తాలూక స్ఫూర్తి దెబ్బతినేలా ఎవరూ వ్యవహరించకూడదని, వివక్ష చూపరాదని ఆయన హెచ్చరించారు. మానవత్వంతో స్పందించి ప్రజా సమస్యలకు చక్కనైన పరిష్కారం చూపాలని, బలోపేతమైన వ్యవస్థ రూపకల్పనలో భాగస్వామ్యం కావాలని సూచించారు.
దురుసుగా ప్రవర్తిస్తే సహించేది లేదు
: ప్రణాళికా శాఖ కార్యదర్శి జి.ఎస్.ఆర్.కె.ఆర్. విజయ కుమార్
అర్జీదారులపట్ల అధికారులు దురుసుగా ప్రవర్తిస్తే సహించేది లేదని, ప్రణాళికాశాఖ కార్యదర్శి విజయకుమార్ హెచ్చరించారు. స్పందన కార్యక్రమంలో జిల్లా ప్రగతిని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఆయన వివరించారు. ఇప్పటికీ కొంతమంది అధికారుల ప్రవర్తన పట్ల ఫిర్యాదులు వస్తున్నాయని, రెండున్నరేళ్ల తరువాత కూడా వారి వైఖరిలో మార్పు రాకపోవడం శోచనీయమని అన్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తే చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. వ్యక్తిగత సమస్యలతోపాటు సామాజిక అంశాల పట్ల ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రజలు పదేపదే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకూడదన్న ఉద్దేశంతోనే, సచివాలయ వ్యవస్థను ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారని అన్నారు. వీలైనంత త్వరగా ప్రజల వినతులను పరిష్కరించాలని, వారి సమస్యలకు నాణ్యమైన పరిష్కారాన్ని చూపించాలని సూచించారు. ప్రభుత్వ ఉద్దేశాలు, లక్ష్యాలకు అనుగుణంగా ప్రతీఒక్కరూ పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు.
నిర్ణీత కాలంలో పరిష్కారం చూపండి
: గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శి అజయ్ జైన్
ప్రజల నుంచి వచ్చే వినతులకు నిర్ణీత కాలంలో పరిష్కారం చూపాలని గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శి అజయ్ జైన్ పేర్కొన్నారు. ప్రధానంగా సంక్షేమ పథకాలకు, పాలనాపరమైన సమస్యలకు సంబంధించిన వినతులు అధికంగా ప్రజల నుంచి వస్తున్నాయని తెలిపారు. వీటిని క్షుణ్నంగా పరిశీలించి పరిష్కరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని పేర్కొన్నారు. ఒక వేళ వినతులను తరిస్కరించినట్లయితే సరైన కారణం తెలపాలని సూచించారు. మొక్కుబడిగా కాకుండా మనసు పెట్టి.. బాధ్యతగా సమస్యను పరిష్కరించాలని హితవు పలికారు. పథకాలకు సంబంధించి అర్హతలు, అనర్హతల గురించి అధికారులు, సిబ్బంది అవగాహన పెంచుకోవాలని సూచించారు. అప్పుడే ప్రజలకు మెరుగైన సేవలందించగలమని పేర్కొన్నారు. క్షేత్ర స్థాయి అధికారులపై ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చినప్పుడు సంబంధిత జిల్లా స్థాయి అధికారులు కఠినంగా వ్యవహరించాలని, క్రమ శిక్షణా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే వినతులపై ఉదారభావం ప్రదర్శించరాదని హెచ్చరించారు. గృహ నిర్మాణాలకు సంబంధించి పనితీరు ఇంకా మెరుగుపడాలని, లబ్ధిదారుల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అనంతరం సీసీఎల్ఏ జాయింట్ సెక్రటరీ ఎన్. తేజ్ భరత్, గ్రామీణాభివృద్ధి ప్రత్యేక కమిషనర్ శాంతి ప్రియ పాండే, పౌర సరఫరాల శాఖ సంచాలకులు ఢిల్లీరావు ఆయా శాఖలకు సంబంధించిన అంశాలపై మాట్లాడారు. ఈ క్రమంలో తహశీల్దార్లు, ఎంపీడీవోలు, సచివాలయ ఉద్యోగులు పలు అంశాలపై ప్రశ్నలు లేననెత్తగా రాష్ట్ర స్థాయి అధికారులు పరిష్కార మార్గాలను సూచిస్తూ బదులిచ్చారు. అనంతరం స్పందన కార్యక్రమంపై బృంద చర్చలు, ప్రజెంటేషన్లు నిర్వహించారు.
కార్యక్రమంలో కలెక్టర్ ఎ. సూర్యకుమారి, జాయింట్ కలెక్టర్లు కిశోర్ కుమార్, మహేశ్ కుమార్, మయూర్ అశోక్, వెంకటరావు, డీఆర్వో గణపతిరావు, ఐటీడీఏ పీవో కూర్మనాథ్, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.