Breaking News

రాష్ట్రానికి సంబంధించిన కీలక ప్రాజెక్టులపై కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ చర్చ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పూర్తయిన పలు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనల తర్వాత కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ నేరుగా ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ నివాసానికి చేరుకున్నారు. కేంద్ర మంత్రి గౌరవార్ధం ఆయనకు సీఎం విందు ఇచ్చారు. భోజనం తర్వాత రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, ప్రతిపాదనలపై నితిన్‌ గడ్కరీతో సీఎం చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయరహాదారుల శాఖకు చెందిన అధికారులు, రాష్ట్రానికి చెందిన కీలక అధికారులు హాజరయ్యారు.

రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని గొప్పస్థాయికి తీసుకెళ్లగలిగే విశాఖపట్నం – భీమిలి – భోగాపురం (బీచ్‌ కారిడార్‌) రోడ్డుపై విస్తృత చర్చజరిగింది. రాష్ట్రాభివృద్ధిలో ఈ రోడ్డు కీలక పాత్ర పోషిస్తుందని, టూరిజం రంగం బాగుపడ్డమే కాకుండా చాలామందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ముఖ్యమంత్రి, కేంద్రమంత్రికి వివరించారు. విశాఖ నగరం నుంచి త్వరలో నిర్మాణం కానున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి త్వరగా చేరుకోవాలన్నా ఈ రహదారి అత్యంత కీలకమని సీఎం వివరించారు. ఈ ప్రాజెక్టుపై సానుకూలత వ్యక్తంచేసిన కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ప్రఖ్యాత అంతర్జాతీయ కన్సల్టెన్సీతో ప్రతిపాదనలు తయారుచేయించాలని సూచించారు. దీనిపై వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని సీఎం వైయస్‌.జగన్, గడ్కరీతో అన్నారు. విజయవాడలో ట్రాఫిక్‌ కష్టాలను తగ్గించడానికి ఇప్పుడు నిర్మాణం అవుతున్న పశ్చిమ బైపాస్‌తోపాటు తూర్పున మరో బైపాస్‌ నిర్మాణం కూడా చేయాలని ముఖ్యమంత్రి చేసిన విజ్ఞప్తిపై కేంద్రమంత్రి అంగీకారం తెలిపారు. ఈ ప్రాజెక్టును మంజూరుచేస్తున్నట్టుగా వెల్లడించారు. కృష్ణానదిపై బ్రిడ్జితోపాటు 40కి.మీ మేర బైపాస్‌ రానుంది. అలాగే రాష్ట్ర రహదారులపై 33 ఆర్వోబీల నిర్మాణంపై కూడా సీఎం కేంద్రమంత్రితో చర్చించారు. వీటన్నింటికీ ఆమోదం తెలుపుతున్నట్టు కేంద్రమంత్రి వివరించారు. తమ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినందుకు సీఎం శ్రీవైయస్‌.జగన్‌ కేంద్రమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సమావేశంలో ఆర్‌ అండ్‌ బీ మంత్రి ఎం శంకరనారాయణ, ముఖ్యమంత్రి కార్యదర్శులతోపాటు రాష్ట్ర, రవాణా, ఆర్‌ అండ్‌ బీ ముఖ్యకార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, ఎం.ఒ.ఆర్‌.టి.హెచ్‌. ఆర్వో ఎస్‌.కె.సింగ్, ఎన్‌ఏఐ అధికారులు మహబిర్‌ సింగ్, ఆర్‌.కె.సింగ్‌ హాజరయ్యారు.

Check Also

థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్

-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *