Breaking News

రాష్ట్రంలో రహదారులు విస్తరణ, అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది… : కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో రహదారులు విస్తరణ, అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. ఆధునిక జాతీయ రహదారుల అనుసంధానంతో మరింత వేగవంతమైన రాష్ట్రాభివృద్ధిలో భాగంగా 21,559 కోట్ల వ్యయంతో 1380 కి.మీ. పొడవు గల 51 జాతీయ రహదారి ప్రాజెక్టుల శంకుస్థాపన మరియు జాతికి అంకితం చేసే కార్యక్రమానికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నగరంలోని స్థానిక ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య ప్రాంతం అభివృద్ధి శాఖా మంత్రి జి. కిషన్ రెడ్డితో కలిసి బెంజ్‌ సర్కిల్‌ ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రి సమక్షంలో నేషనల్ హైవే లాజిస్టిక్ మేనేజ్ మెంట్ లిమిటెడ్ సీఈవో ప్రకాష్ గౌడ్, రాష్ట్రప్రభుత్వం తరపున స్పెషల్ ఛీఫ్ సెక్రటరి రజత భార్గవ, డైరెక్టర్ ఇండస్ట్రీస్ జి.సృజన ఎంవోయూ కుదుర్చుకున్నారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ… రహదారులు అభివృద్ధి చెందడం ద్వారా ఉద్యోగాల కల్పన, పెట్టుబడి, పర్యాటకం, ఆర్థికాభివృద్ది జరుగుతుందన్నారు. వ్యవసాయం, పారిశ్రామిక రంగం రెండూ కూడా అభివృద్ధికి ముఖ్యమన్నారు. వ్యవసాయ, పారిశ్రామిక అభివృద్ధిలో వాటర్, పవర్, కమ్యూనికేషన్, ట్రాన్స్ పోర్ట్ అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తాయన్నారు. పరిశ్రమలు లేకుండా ఉద్యోగాల కల్పన సాధ్యపడదన్నారు. తద్వారా పేదరికాన్ని నిర్మూలించవచ్చనన్నారు. తాను మహారాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్న సమయంలో ప్రధాని వాజ్ పేయి గ్రామాల్లో రహదారుల అభివృద్ధితోనే దేశాభివృద్ధి అని పిలుపునిచ్చారు. వాజ్‌పేయి హయాంలోనే స్వర్ణ చతుర్భుజి నిర్మాణం జరిగిందన్నారు. కేంద్రం నిర్వహిస్తున్న ప్రధానమంత్రి గ్రామ సడక్‌ యోజన అత్యంత కీలకంగా మారిందని.. ఆ కమిటీకి ఛైర్మన్ గా ఉన్నానన్నారు. ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల అభివృద్ధికి 2024 నాటికి 3లక్షల కోట్ల వరకూ కేంద్ర సాయం అందజేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి ఇచ్చిన ఈస్ట్రన్‌ రింగ్‌ రోడ్డుకు తక్షణమే ఆమోదం తెలుపుతున్నానని చెప్పారు.
రాష్ట్రంలో ఆరు గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేలను కేంద్రం నిర్మిస్తోందని వెల్లడించారు. భారత ఆర్థికాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ పాత్ర కీలకంగా ఉంటుందని భావిస్తున్నట్టు గడ్కరీ తెలిపారు. రహదారుల నిర్మాణానికి నిధుల కొరత లేదన్నారు. గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ ప్రెస్‌ హైవేల నిర్మాణం జరగాల్సి ఉందన్నారు. 2024 నాటికి 465 కి.మీ. పొడవు కలిగిన రూ.16,102 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రాయపూర్‌-విశాఖ గ్రీన్‌ఫీల్డ్‌ హైవేను పూర్తి చేస్తామని ఆయన హామీనిచ్చారు. ఈ రహదారి వల్ల ఏపీ, ఒడిశా, చత్తీస్ గడ్ రాష్ట్రాల కనెక్టివిటీ పెరుగుతుందన్నారు. 2025 నాటికి రూ. 15 వేల కోట్ల వ్యయంతో 405 కి.మీ. పొడవు గల నాగ్‌పూర్‌-విజయవాడ హైవే పూర్తి చేయనున్నట్టు చెప్పారు. తద్వారా కృష్ణా జిల్లాలోని ప్రతి గ్రామానికి కనెక్టివిటీ ఏర్పడుతుందన్నారు. అభివృద్ధిలో ఓడరేవులు, రహదారుల కనెక్టివిటీ ఎంతో కీలకమని అన్నారు. మూడేళ్లలో రూ. 5 వేల కోట్లతో 116 కి.మీ. పొడవు గల చిత్తూరు-తంజావూరు గ్రీన్‌ఫీల్డ్‌ హైవే, రూ. 6 వేల కోట్లతో 163 కి.మీ. పొడవు గల హైదరాబాద్‌-విశాఖ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే, రూ. 17 వేల కోట్లతో ఏపీ మీదుగా బెంగళూరు-చైన్నై హైవేల నిర్మాణాలను పూర్తి చేయనున్నట్టు గడ్కరీ తెలిపారు. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేల వల్ల కర్ణాటక, ఏపీ, తమిళనాడు రాష్ట్రాలకు ప్రయోజనం ఉంటుందని సూచించారు. కొత్త హైవేలు పూర్తి అయితే స్పీడ్‌ లిమిట్‌ను సవరించుకోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. రహదారులు బాగుంటే రవాణా వ్యయం భారీగా తగ్గుతుందన్నారు. చైనాతో పోలిస్తే భారత్‌లో రవాణా వ్యయం చాలా తక్కువగా ఉందన్నారు. ‘దేశ అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర కీలకమని.. అభివృద్ధిలో అందరినీ సమానంగా చూస్తున్నామన్నారు. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్.. నినాదంతో రాష్ట్రాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు.
వ్యవసాయ రంగంలో ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర మంత్రి గడ్కరీ అన్నారు. రోడ్లు బాగుంటే రవాణా వ్యయం భారీగా తగ్గుతుందని తెలిపారు. చైనాతో పోల్చితే భారత్‌లో రవాణా వ్యయం చాలా ఎక్కువ అని తెలిపారు. త్వరలో డీజిల్‌ లారీలకు బదులు ఎలక్ట్రిక్‌ లారీలు, డీజిల్‌ స్థానంలో సీఎన్‌జీ, ఎల్‌పీజీ రవాణా వాహనాలు రానున్నట్లు తెలిపారు. పోలవరం పూర్తయిన తర్వాత వ్యక్తిగతంగా వస్తానని మంత్రి హామీ ఇచ్చారు.. ‘నేను జలవనరుల మంత్రి కాదు.. అయినా పోలవరం చూస్తా’నని తెలిపారు. విశాఖతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం నుంచి సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. నైపుణం కలిగిన యువత రాష్ట్రంలో ఎంతోమంది ఉన్నారని… ఇథనాల్‌ ఉత్పత్తికి ఏపీ కేంద్రం కావాలని, పెట్రోల్‌, డీజిల్‌ వినియోగం బాగా తగ్గించాలని ఆయన కోరారు. గ్రీన్‌ హైడ్రోజన్‌ వాడకం పెరిగితే పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు ఇది పరిష్కారంగా ఉంటుందన్నారు.
సభకు అధ్యక్షత వహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 51 జాతీయ రహదారి ప్రాజెక్టుల శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవంతో రాష్ట్రం మరో ముందడుగు వేసిందని, ఈ రోజు రాష్ట్ర చరిత్రలో మర్చిపోలేని రోజు అని అన్నారు. 10,400 కోట్ల వ్యయంతో 741 కి.మీ. నిర్మించనున్న 31 జాతీయ రహదారులకు శంకుస్థాపన, రూ.11,157 కోట్లతో పూర్తయిన 20 రహదారులు, ఇతర ప్రాజెక్టులను ప్రారంభించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్రప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కేంద్రమంత్రులు నితిన్ గర్కరీ, కిషన్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. కేంద్రం సహకారంతో రాష్ట్రంలో జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. బెంజ్‌ సర్కిల్‌ ఫ్లై ఓవర్‌, కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్ నిర్మాణాలను గడ్కరీ సహకారంతో వేగంగా పూర్తి చేశామని అన్నారు. అంతకు ముందు పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి పనులు వేగవంతానికి భూసేకరణతో పాటు ఏ సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించుకుంటూ రహదారుల నిర్మాణం వేగవంతానికి అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. జాతీయ రహదారులే కాకుండా రాష్ట్రంలో మిగిలిన రహదారుల పనులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రాలను కలిపే రెండులైన్ల రహదారుల నిర్మాణాలు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మరమ్మతుల కోసం 2,300 కోట్లు ఖర్చు చేస్తున్నాం.. పెండింగ్ లో ఉన్న రహదారులను పనుల పూర్తి మరో 1700 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఎటువంటి రాజకీయాలు, సంకోచాలు లేకుండా కేంద్రం చేస్తున్న సాయానికి కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ పట్నం పోర్టు నుంచి రుషికొండ, భోగాపురం ఎయిర్ పోర్టుకు కనెక్టివిటీ చేస్తూ పర్యాటక రంగాన్ని అభివృద్ది చెందేలా 6 లైన్ల రహదారి అవసరమని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ విజ్ఞప్తి చేశారు. నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు 40 కి.మీ. దూరం గల కృష్ణా నదిపై వంతెనతో కలిపి ఈస్ట్రన్ బైపాస్ అవసరమని కోరారు. కడప జిల్లా భాక్రాపేట నుంచి బద్వేలు, పోరుమామిళ్ల మీదుగా ప్రకాశం బెస్తవారిపేట రహదారి, పుంగనూరు నుంచి పులిచర్ల మీదుగా చిన్నగొట్టికల్లు రహదారి, సబ్బవరం నుంచి చోడవరం నర్సీపట్నం మీదుగా తుని రహదారి, విశాఖపట్నం నుంచి నర్సీపట్నం, చింతపల్లి, చింతూరు మీదుగా భద్రాచలం వరకూ ఉన్న రహదారి.. వీటి అన్నింటినీ కూడా జాతీయ రహదారులుగా గుర్తించి అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కోరారు.
కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఏ దేశంలో కనెక్టివిటీ బాగా ఉంటుందో ఆ దేశం బాగా అభివృద్ధి చెందుతుందని.. దేశంలో, రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని రహదారులను 21 వేల కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. దేశంలో ప్రతి రాష్ట్రంలో, ప్రతి గ్రామంలో అభివృద్ధి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత అన్నారు. అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తున్నామని, ఏ రాష్ట్రంపై వివక్షత చూపడం లేదన్నారు. రాష్ట్రంలో 14 కేంద్ర విద్యా సంస్థలను అభివృద్ధి చేశామన్నారు. శ్రీశైలం, సింహచలం,అన్నవరం వంటి ఆధ్యాత్మిక ప్రదేశాల్లో పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా మౌలిక వసతులు కల్పించామన్నారు. విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలలో నడయాడిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జ్ఞాపకాల స్మరణ కోసం విశాఖలో అల్లూరి సీతారామరాజు మ్యూజియంను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అల్లూరి 125వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్, ఢిల్లీలో ఘనంగా నిర్వహించాలని ప్రధానమంత్రి నిర్ణయించారన్నారు.
కేంద్ర రోడ్డు, రవాణా, జాతీయ రహదారులు మరియు పౌర విమానయాన సహాయ మంత్రి జనరల్ డా. వి.కె. సింగ్ వర్చువల్ విధానంలో కార్యక్రమంలో ఢిల్లీ నుంచి హాజరయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రాజెక్టుల అభివృద్ధికి పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు. బహిరంగసభకు ముందు రాష్ట్రంలోని నిర్మాణం పూర్తిచేసుకున్న ప్రాజెక్టులపై జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, జి. కిషన్‌రెడ్డి, ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి తిలకించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు నారాయణ స్వామి, ధర్మాన కృష్ణ దాస్, రాష్ట్ర మంత్రులు మాలగుండ్ల శంకర నారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాసర రావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కొడాలి నాని, సీదిరి అప్పల రాజు, పార్లమెంట్ సభ్యులు వై.ఎస్. చౌదరి, సీఎం రమేష్, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణరావు, వి. బాలశౌరి, చింతా అనురాధ, వంగా గీతా విశ్వనాథ్, మార్గాని భరత్ రాం, సంజీవ రావు, కోటగిరి శ్రీధర్, నందిగం సురేష్, జీవీఎల్ నరసింహారావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, వాకాటి నారాయణ రెడ్డి, నరసింహ రాజు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, జిల్లా కలెక్టర్ జె. నివాస్, మున్సిపల్ కమిషనర్ రంజిత్ భాషా, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *