-లబ్ధిదారులకు అన్ని రకాలుగా సహకారిగా స్థానిక నాయకులు ఉంటారు
-ఇంటి నిర్మాణం పూర్తి చేసిన లబ్దిదారుని కుటుంబానికి 10 వేలు అందించిన మంత్రి శ్రీరంగనాధ్
పెనుమంట్ర, నేటి పత్రిక ప్రజావార్త :
స్వంత ఇల్లు లేని పేద, మధ్యతరగతి కుటుంబాల స్వంత ఇంటికల సాకారం దిశగా అడుగులు వేస్తుంటే , ఆ ప్రక్రియ కి విఘాతం కలిగించేలా కొందరు కుయుక్తులు పన్నుతున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పేర్కొన్నారు.
బుధవారం పెనుమంట్ర మండలంలోని పలు గ్రామాల్లోని లే అవుట్ల ను సందర్శించి, గృహ నిర్మాణం పూర్తి చేసిన లబ్దిదారులతో మంత్రి సంభాషించి, రూ.10 వేల నగదు పారితోషకం అందచేశారు. ఈసందర్భంగా మంత్రి శ్రీరంగనాధ్ రాజు మాట్లాడుతూ, గత 15 రోజుల క్రితం ఈ ప్రాంతంలో పర్యటించానని, అప్పటికి ఇప్పటికి ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి మెరుగ్గా ఉందన్నారు. నియోజకవర్గ పరిధిలోని ప్రతి లబ్దిదారుడు ఇళ్ళు నిర్మించుకోవాలన్నారు. మిగిలిన వారికి అండగా ఉంటూ స్థానిక ఎంపిటిసి లు, జెపిటిసిలు, సర్పంచ్ లు, కూడా సహాయ సహకారాలు అందిస్తారని పేర్కొన్నారు. మార్చి 21 నాటికి ప్రతి లబ్దిదారుడు ఇంటి నిర్మాణం ప్రారంభించాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ఉన్నతమైన ఆశయంతో దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద ఎత్తున అర్హులైన లక్షలాది కుటుంబాలకు స్వంత ఇంటి నిర్మాణం కోసం ఉచితంగా స్థలాలను అందించడం జరిగిందన్నారు. పేదల స్వంత ఇంటిని నిర్మాణం చేసుకోవడం ఇష్టం లేని ప్రతిపక్షాలు అపోహలు సృష్టిస్తూ రాద్ధాంతం చేస్తున్నారని పేర్కొన్నారు. అటువంటి వారి మాటలకు లోనుకాకుండా ఉండాలని మంత్రి కోరారు. బ్యాంకు ల ద్వారా రుణ సౌకర్యం కల్పించడం, డ్వాక్రా మహిళలకు రుణాలు ఇప్పించడంతో పాటు, గ్రూపుల్లో లేని మహిళలచే కొత్తగా స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి, తక్కువ వడ్డీతో రుణాలు అందించే కార్యక్రమం చేపడుతున్నా మని మంత్రి శ్రీరంగనాధ్ రాజు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇప్పటికే ఇళ్ళు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు చెందిన బిల్లులు చెల్లింపులు జరుగుతున్నట్లు పేర్కొన్నారు.
ఈ లే అవుట్ల పరిశీలన లో భాగంగా పెనుమంట్ర మండలం కోమటి చెరువు లోని వెలగలేరు ఆలమూరు , మార్టేరు, ఓడూరు, నెలమూరు, భట్ల మగుటూరు, బ్రాహ్మణ చెరువు లేఅవుట్ లబ్ధిదారులలో ఇళ్ళు నిర్మాణం పూర్తి చేసిన ఇళ్ళ ను సందర్శించి వారితో సంభాషించారు. అనంతరం మంత్రి వారికి రూ.10 వేలు రూపాయలను నగదును అందచేసి ఇంటికి కావలసిన సామగ్రి కొనుగోలు చేసుకోవాలని సూచించారు.
మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.