-16న గుంటూరులో ప్రాంతీయ సదస్సు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఉద్యోగులు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, హింసకు సంబంధించిన చట్టాలు, అంతర్గత ఫిర్యాదుల కమిటీల ఏర్పాటుపై మహిళా కమిషన్ అవగాహన సదస్సులు నిర్వహించనుంది. మార్చి నుంచి మార్చి వరకు మహిళా కమిషన్ చేపట్టే ‘సబల’ కార్యచరణలో భాగంగా ప్రాంతీయ సదస్సుల షెడ్యూల్ ను శుక్రవారం కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మీడియాకు వెల్లడించారు. ఈనెల 16న గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ఉద్యోగులతో గుంటూరు జిల్లాపరిషత్ సమావేశ మందిరం వేదికగా సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా 23న కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఉద్యోగులతో ఏలూరు కేంద్రంగా.. 30న కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల ఉద్యోగులతో కడప కేంద్రంగా, ఏప్రిల్ నెల ఆరో తేదీన వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం ఉద్యోగులతో వైజాగ్ కేంద్రంగా సదస్సులు జరగనున్నట్లు వాసిరెడ్డి పద్మ వివరించారు. ఆయాచోట్ల జరిగే సదస్సుల విజయవంతానికి సంబంధించి పలు ఉద్యోగ సంఘాల భాగస్వామ్యం కోరినట్లు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులతో పాటు ప్రయివేటు, ఇతరచోట్ల మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారం, సౌకర్యాలకల్పన తదితర అంశాలపై వారందరికీ మహిళా కమిషన్ అండగా ఉంటుందని ‘సబల’ సదస్సులు సందేశమిస్తాయన్నారు. వీటితోపాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలు, కళాశాలల్లో ‘మహిళల భద్రత, దిశ యాప్, సమానత్వం తదితర అంశాలపై విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మహిళా భద్రతకు సంబంధించిన సమాచారాన్ని కిందిస్థాయి దాకా తీసుకెళ్లాలని మహిళా కమిషన్ గట్టి సంకల్పంతో ముందుకెళ్తున్నట్లు వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు.