-జగన్ పాలనలో రాష్ట్రం మద్యాంధ్ర ప్రదేశ్ గా మారింది
-ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ నర్రెడ్డి తులసి రెడ్డి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగన్ పాలనలో రాష్ట్రం మద్యాంద్ర ప్రదేశ్ గా, సారా ఆంధ్ర ప్రదేశ్ గా, త్రాగుబోతుల రాష్ట్రంగా తయారయ్యిందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ నర్రెడ్డి తులసి రెడ్డి విమర్శించారు. మేనిఫెస్టో లో చెప్పిందేమో దశల వారి మద్య నిషేధం అని, కానీ ఆచరణ లో జరుగుతున్నదేమో దశల వారి మద్య నిషా అని ఆరోపించారు. జగనన్న తాలిబొట్లు తాకట్టు పెట్టే పథకంగా, జగనన్న పుస్తెలు తెంపే పథకంగా తయారయిందని ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వం మద్యాన్ని ప్రభుత్వ ఆదాయ వనరుగా చూస్తోందని, 3 ఏళ్ళలో 3 రెట్లు రాష్ట్ర ఎక్సయిజ్ ఆదాయం పెరిగిందని, ఇందు కోసం మద్యం ధరలు విపరీతంగా పెంచిందని అన్నారు. గురువారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
మద్యం వైకాపా అగ్రనాయకుల వ్యక్తిగత ఆదాయ వనరుగా మారిందని, దీని కోసం చీప్ లిక్కర్ బ్రాండ్ లు సరఫరా చేస్తున్నారని తులసిరెడ్డి ధ్వజమెత్తారు. ధరలు పెరిగినందు వల్ల, చీప్ లిక్కర్ బ్రాండ్ ల వల్ల త్రాగుబోతులు నాటుసారా మరిగారని, అందువల్ల నాటుసారా ఏరులై పారుతోందన్నారు. ఎస్ఈబి నివేదిక ప్రకారం 2021 లో పోలీసులు 6,84,484 లీటర్ ల నాటుసారా ను స్వాధీనం చేసుకున్నారని, 2,39,45,498 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారని, ఇది నాటుసారా ఉత్పత్తిలో ఒక శాతం మాత్రమేనని వివరించారు. దీని పర్యవసానమే జంగారెడ్డి గూడెం మరణాలు అని పేర్కొన్నారు. మేనిఫెస్టో లో చెప్పిన విధంగా మద్య నిషేధాన్ని అమలు చేయాలని, నాటుసారా ను అరికట్టాలని, చేతకాక పోతే ముఖ్యమంత్రి పదవి నుండి జగన్ తప్పుకోవాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు.