-క్రీడలతో మానసిక ఉత్తేజం
-క్రీడా స్ఫూర్తి ముఖ్యం
-కలెక్టర్ వి .ప్రసన్న వెంకటేష్
ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఎంప్లాయిస్ యూనిటీ క్రికెట్ లీగ్ టి 20 టోర్నమెంట్ ఏలూరు ఆశ్రం మెడికల్ కాలేజ్ క్రికెట్ మైదానంలో గురువారం ఉత్సాహంగా ఉల్లాసంగా ప్రారంభమైంది. ఈనెల 17 నుంచి 20వ తేదీ వరకు నాలుగు రోజులపాటు నిర్వహించే టి 20 క్రికెట్ టోర్నమెంట్ ను జ్యోతి ప్రజ్వలన చేసి జిల్లా కలెక్టర్ వి. ప్రసన్న వెంకటేష్ ప్రారంభించారు. క్రికెట్ లీగ్ టి 20 టోర్నమెంట్ ప్రారంభ సూచికగా కలెక్టర్ వి. ప్రసన్న వెంకటేష్, అడిషనల్ ఎస్పీ ఓ. దిలీప్ కిరణ్, మొబైల్ కోర్టు సీనియర్ సివిల్ జడ్జి పరేష్ కుమార్ ఆకాశంలోకి శాంతి కపోతలను, బెలూన్లను వదిలారు. అనంతరం క్రికెట్ క్రీడా పోటీల్లో పాల్గొంటున్న రెవెన్యూ,ఇరిగేషన్,న్యాయ,పోలీస్, విద్యుత్,పంచాయతీ రాజ్,మెడికల్, గ్రామ,వార్డు సచివాలయ సిబ్బంది తో కూడిన ఎనిమిది జట్ల లోని ఉద్యోగులను పరిచయం చేసుకొని వారికి ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వి. ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ ఉద్యోగుల మధ్య పరస్పర స్నేహ పూర్వక వాతావరణం కల్పించేందుకు కలిసి, మెలిసి పనిచేసేందుకు ఇటువంటి క్రీడా పోటీలు ఎంతో దోహదపడతాయని అన్నారు. గత రెండు సంవత్సరాలుగా కోవిడ్ క్లిష్ట పరిస్థితుల్లో సామాన్య ప్రజలు ఆరోగ్య పరిస్థితి లతో ఒక వైపు, మరోపక్క సిబ్బంది పని భారం తోను సతమతం అయ్యారన్నారు. కోవిడ్ ప్రభావం తగ్గుముఖం పట్టిన ఈ నేపథ్యంలో తిరిగి ఇటువంటి క్రీడా పోటీలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ఉద్యోగులు కలసి మెలసి పనిచేసేందుకు ఇటువంటి టీమ్ స్పిరిట్ ప్రకృతి వైపరీత్యాలు, ఇతర సమస్యలు ఎదురైనప్పుడు బృంద సమిష్టితో వెళ్లి పరిష్కరించేందుకు దోహదపడుతుందన్నారు. అన్ని శాఖల అధిపతులు ఆయా శాఖల్లోని ఉద్యోగుల్లో క్రీడాస్ఫూర్తిని ప్రోత్సహించడంతో పాటు టీం స్పిరిట్ పెంపొందించాలని ఆయన సూచించారు. క్రీడలతో మానసిక ఉత్తేజం కలుగుతుందన్నారు. అదేవిధంగా ఇటువంటి క్రీడా పోటీలు ఉద్యోగుల మధ్య సత్సంబంధాలు నెలకొల్పితయన్నారు. పని భారంతో సతమతమవుతున్న ఉద్యోగులకు క్రీడలు ఆటవిడుపు లాంటిదన్నారు. ప్రతి ఒక్కరు క్రీడాస్ఫూర్తిని అలవర్చుకోవాలన్నారు. అయితే గత రెండు రోజులుగా పెరిగిన వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకొని అందుకు తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.క్రీడా పోటీలు జరుగుతున్న నాలుగు రోజులు ఈ ప్రాంగణంలో వైద్య శిబిరాన్ని కూడా నిర్వహించాలని సూచించారు. అడిషనల్ ఎస్పీ ఓ.దిలీప్ కిరణ్ మాట్లాడుతూ క్రీడా పోటీలు ఉద్యోగుల మధ్య సమన్వయం ,సత్సంబంధాలు నెలకొల్పుతాయన్నారు. మొబైల్ కోర్టు సీనియర్ సివిల్ జడ్జి పరేష్ కుమార్ మాట్లాడుతూ అందరిలో క్రీడా స్ఫూర్తి ఐక్యతా భావన పెంపొందిస్తుందన్నారు. ఏఎంసీ చైర్మన్ మంచెం మైబాబు మాట్లాడుతూ నిత్యజీవితంలో బిజీగా ఉండే ఉద్యోగులకు ఇటువంటి క్రీడా పోటీలు ఎంతో ఊరట కలిగిస్తాయ అన్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ రాయల్స్ ,మెడికల్ వారియర్స్ మధ్య తొలిపోటీకి కలెక్టర్ వి .ప్రసన్న వెంకటేష్ టాస్ వేయగా రెవెన్యూ రాయల్స్ టాస్ గెలిచి మొదటిగా బ్యాటింగ్ చేపట్టారు.
బ్యాట్ పట్టిన కలెక్టర్…
క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభ సందర్భంలో కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ బ్యాటింగ్ చేసి అందరిలో క్రీడా స్ఫూర్తిని ఉత్సాహాన్ని నింపారు. ఎంతో ఉత్సహంతో అద్భుతంగా బ్యాటింగ్ చేసి అందర్నీ అలరించారు.క్రికెట్ పై అభిరుచి ఉన్న తాను కూడా ఈ మూడు రోజులపాటు టి20 టోర్నమెంట్ తిలకించేందుకు వస్తానన్నారు .ఈ టోర్నమెంట్కు హైదరాబాదుకు చెందిన బాబా షరీఫ్ వ్యాఖ్యానం అందించారు.
ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ ఎస్ ఈ ఆర్ .శ్రీ రామకృష్ణ ,ట్రాన్స్కో ఎస్. ఈ జనార్దన్ రావు, తహసిల్దార్ సోమశేఖర్, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ సిఐ సుభాకర్ , విద్యుత్ శాఖవిజిలెన్స్ సీ ఐ పరమేశ్వరావు,ఎస్ ఐ డి.వి.రమణ, పశ్చిమ గోదావరి జిల్లా ఉద్యోగ సంఘాల జెఎసి అధ్యక్షులు ఆర్.ఎస్. హరనాథ్, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు చోడగిరి శ్రీనివాస్ ,కంచర్ల పల్లి రమేష్ కుమార్ ,ఆకుమర్తి ప్రమోద్ కుమార్ ,జి.శ్రీధర్ రాజు ,డాక్టర్ జోషి పంజా కిషోర్ ,పూడి శ్రీనివాస్, జీవన్ ,నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.