హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
సర్వోదయ సంకల్ప పాదయాత్రలో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ పాల్గొన్నారు. ప్రస్తుతం పాదయాత్ర మెదక్ జిల్లా లోని కాళ్లకల్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా శైలజనాథ్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ నాయకత్వం లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. మత తత్వ పార్టీలకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.
భూదాన్ ఉద్యమానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ మధ్యప్రదేశ్ నాయకురాలు మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ చేపట్టిన సర్వోదయ సంకల్ప పాదయాత్ర మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ కు చేరుకుంది. దేశంలోని దళితులు, గిరిజనులతో పాటు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి మీనాక్షి నటరాజన్ ఈ పాదయాత్ర చేస్తున్నారు. ఆమెకు పలు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు మద్దతు తెలుపుతున్నారు.
ఈ పాదయాత్రలో పాల్గొన్న సందర్భంగా శైలజనాథ్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో రైతులు, దళితులు, గిరిజనులతో పాటు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌తో రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. మరోవైపు, టీఆర్ఎస్ ప్రభుత్వం మల్లన్న సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టుల పేర్లతో రైతుల నుంచి భూములు లాక్కుందని ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తన బంధువు కోసమే కొండ పోచమ్మను రీడిజైన్ చేశారని అన్నారు. ఆ ప్రాజెక్టు నుంచి నీరు కేసీఆర్ ఫాంహౌస్‌కు మాత్రమే వెళ్తున్నాయని తెలిపారు.
ఆర్ఆర్ఆర్ (రీజనల్ రింగ్ రోడ్డు) పేరుతో ఇప్పుడు మళ్లీ భూములు లాక్కొనే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రైతుల నుంచి రూ.3 కోట్ల విలువైన భూములను లాక్కుని రూ.10 లక్షలు ఇస్తామని చెబుతున్నారని మండిపడ్డారు. రైతులను వరి పండించకూడదని చెప్పిన కేసీఆర్ తన ఫాంహౌస్‌లో మాత్రం వరి పండించారని చెప్పారు. కేసీఆర్ పాలనలో రైతుల భూమికి విలువలేకుండా పోయిందని చెప్పారు.
తెలంగాణలో ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయట్లేదని చెప్పారు. ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూమితో పాటు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేశారని, ఆయనను ప్రజలు తిరస్కరించే రోజులు దగ్గరపడ్డాయని శైలజనాథ్ మండిపడ్డారు.