Breaking News

ఇంధన సామర్థ్యం తో భక్తులకు మెరుగైన సౌకర్యాలు…

-పర్యావరణ పరిరక్షణ దిశగా టీటీడీ కీలక ముందడుగు
-టీటీడీ దేవస్థానం పరిధిలో పెద్ద ఎత్తున ఇంధన పరిరక్షణ, ఇంధన సామర్ధ్య కార్యక్రమాల అమలు
-జాతీయ స్థాయిలో నెట్ జీరో ఫీజిబిలిటీ స్టడీ కి ఎంపికైన టీటీడీ
-5,000 బీ ఎల్ డీ సి ఫ్యాన్లు అమర్చేందుకు టీటీడీ , ఏపీసీడ్కో ల మధ్య త్వరలో ఒప్పందం
-బీ ఎల్ డీ సి ఫ్యాన్లు అమర్చితే ఏటా రూ 62 లక్షలు విలువైన 0. 88 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా
-2070 నాటికి దేశంలో కాలుష్యాన్ని సున్నా స్థాయికి తీసుకురావాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా టీటీడీ కీలక చర్యలు- ఈ ఓ టీటీడీ, కే ఎస్ జవహర్ రెడ్డి
-ఇందుకోసం పెద్ద ఎత్తున ఇంధన సామర్ధ్యం . పునరుత్పాదక ఇంధన చర్యలు అమలు.
-ఇంధన సామర్ధ్య కార్యక్రమాలు అమలుతో ఇతరులకు ఆదర్శంగా నిలవనున్న టీటీడీ
-టీటీడీ విద్యాసంస్థల పరిధిలో 2.2 మెగా వాట్ల రూఫ్ టాప్ సోలార్ సిస్టం
-రాష్ట్ర ఇంధన రంగ సుస్థిరతలో ఎనర్జీ ఎఫిసిఎన్సీదే కీలక పాత్ర
-టీటీడీ లో ఇంధన సామర్ధ్య పంపుసెట్లు … ఏటా రూ 3. 17 కోట్లు విలువైన 4.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ అదా కు అవకాశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కొలువైన ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం పర్యావరణ పరిరక్షణలో తన వంతు పాత్ర పోషించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం దేవస్థానంలో ఇంధన సామర్ధ్య, పునరుత్పాదక ఇంధన వనరులను పెద్ద ఎత్తున వినియోగించేందుకు చర్యలు తీసుకుంటుంది .
తద్వారా టీటీడీ దేవస్థానం విద్యుత్ పై చేసే ఖర్చు ఆదా చేయడం, భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలను కల్పించడంతో పాటు 2070 నాటికి దేశంలో కాలుష్యాన్ని సున్నా స్థాయికి తీసుకురావాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంలో టీటీడీ కూడా భాగం కానుంది.
ప్రపంచ వ్యాప్తంగా మానవాళి మనుగడకు సవాల్ గా మారిన పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం చేస్తన్న కృషిలో తాను కూడా భాగస్వామి కావాలని టీటీడీ నిర్ణయించింది. ఇంధన వనరులను పొదుపు గా సమర్థవంతంగా వినియోగించడం ద్వారా దాదాపు 50 శాతం వరకు కాలుష్యాన్ని తగ్గించవచ్చని భావిస్తున్న నేపథ్యంలో టీటీడీ ఈ దిశగా చర్యలు చేపడుతుంది. దేవస్థానం పరిధి లో పెద్ద ఎత్తున ఇంధన సామర్ధ్య కార్యక్రమాలు అమలు చేసేందుకు అనేక చర్యలు చేపడుతుంది.
ఇందులో భాగంగా టీటీడీ భవనాల్లో మొదటి దశలో 5,000 బీ ఎల్ డీ సి(బ్రష్ లెస్ డైరెక్ట్ కరెంటు ) ఫ్యాన్లను అమర్చేందుకు ఏపీసీడ్కో తో ఒప్పదనం త్వరలో కుదుర్చుకోనుంది . ఇంధన సామర్థ్యం తో కూడిన ఈ బీఎల్డీసి ఫ్యాన్ల వల్ల ఏటా సుమారు రూ 62 లక్షల విలువైన 0.88 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను అదా చేయవచ్చునని అంచనా వేస్తున్నారు. తద్వారా ఈ ఫ్యాన్లను అమర్చటం పై చేసే వ్యయాన్ని కేవలం 2 సంవత్సరాల 2 నెలల్లో రాబట్టవచ్చని అధికారులు తెలిపారు.
టీటీడీ అధికారులు , రాష్ట్ర ఇంధన శాఖ తో జరిగిన వెబినార్లో , టీటీడీ ఈఓ కే ఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ ఇంధన సామర్ధ్య కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు టీటీడీ ఎంతో ఆసక్తితో ఉందని తెలిపారు. ఇందులో భాగంగా ఇంధన సామర్థ్యం తో కూడిన ఎలక్ట్రానిక్ ఉపకరణాలను టీటీడీ భవనాల్లో అమర్చాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీని వల్ల పర్యావరణానికి మేలు జరగడమే కాకుండా భక్తులకు మరింత నాణ్యమైన , మెరుగైన సేవలు అందించగలుగుతామని వివరించారు .
ఈ దృష్ట్యా ఇంధన సామర్థ్యంతో పాటు పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం పై కూడా దృష్టి పెట్టినట్లు తెలిపారు . తద్వారా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన టీటీడీ పుణ్యక్షేత్రాన్ని పర్యావరణ పరిరక్షణ విషయంలోను ఆదర్శవంతంగా తీర్చిదిద్దెందుకు దేవస్థానం కృషి చేస్తున్నట్లు తెలిపారు.
భక్తుల సేవలు మెరుగుపరచడంలో టీటీడీ ఎప్పుడు ముందు వరస లో నిలుస్తుందని తెలిపారు. ఇందుకోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకునేందుకు టీటీడీ సిద్ధంగా ఉందని జవహర్ రెడ్డి వివరించారు . మరోవైపు సాధారణ పంపుసెట్ల స్థానంలో ఇంధన సామర్ధ్య పంపుసెట్లు , ఎల్ఈడీ లైట్లు , సౌర ఇంధన వనరులను వినియోగించాలని కూడా టీటీడీ నిర్ణయించింది . టీటీడీ లో ఎల్ఈడీ లైట్లు, ఇంధన సామర్ధ్య ఫ్యాన్లు , పుంపుసెట్లు తదితర ప్రాజెక్టులను రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసిఎం ) చేపట్టనుంది.
దీనికి బీఈ ఈ ఆర్థిక సహకారం అందిస్తుంది. టీటీడీ పరిధిలోని విద్యాసంస్థల్లో , టీటీడీ భవనాల్లో 2.2 మెగావాట్ల సౌర సామర్థ్యం గల సోలార్ రూఫ్ టాప్ సిస్టం ను నెడ్క్యాప్ సహకారం తో టీటీడీ అమర్చనుంది . అలాగే తిరుమల తిరుపతి లో భక్తుల సౌకర్యార్థం ఎలక్ట్రిక్ వాహనాలు కూడా టీటీడీలో ప్రవేశ పెట్టనుంది. దీని వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని అధికారులు తెలిపారు.
రాష్ట్ర ఇంధన రంగంలో సుస్థిరత సాధించడంలో ఇంధన సామర్ధ్య కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఇంధన సామర్ధ్య, సాంకేతికత , పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడంలో ఆంధ్ర ప్రదేశ్ ఎప్పుడు ముందు వరుసలో నిలుస్తుందని ఇంధన శాఖ కార్యదర్శి బీ శ్రీధర్ తెలిపారు. ఇంధన సామర్ధ్య కార్యక్రమాల అమలులో టీటీడీ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ఏపీ ఎస్ ఈ సి ఎం , నెడ్క్యాప్ లు టీటీడీ కి పూర్తి స్థాయి లో సహకరించాలని ఆదేశించారు. తద్వారా ప్రపంచం లో టీటీడీ ఒక అత్యుతమ ఇంధన సామర్యం తో కూడిన పుణ్యక్షేత్రం గా నిలుస్తుందనడం లో సందేహం లేదని తెలిపారు.
టీటీడీలో నిర్వహించిన ఎనర్జీ ఆడిట్ ప్రకారం టీటీడీ లో ఉన్న 3277 హెచ్ పీ సామర్థ్యం గల పాత పంపు సెట్లను 2659 హెచ్ పీ సామర్థ్యం తో కూడిన ఇంధన సామర్ధ్య పంపుసెట్లు అమర్చనున్నారు . దీని ద్వారా ఏడాదికి రూ 3.17 కోట్లు విలువైన 4.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుంది. అనగా ఈ పంపుసెట్ల పై టీటీడీ చేసిన వ్యయం సుమారు ఒక ఏడాదిలో ఇంధన ఆదా రూపంలో టీటీడీ కి లభించనుంది.
జాతీయ స్థాయిలో నిర్వహించిన నెట్ జీరో ఎనర్జీ ఫీజిబిలిటీ అధ్యయనంలో భాగంగా టీటీడీతో పాటు మహారాష్ట్రలోని షిర్డీ సాయి దేవాలయం, కేరళలోని కొచ్చి, గుజరాత్‌లోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ మరియు జమ్మూలోని లే ప్యాలెస్ వాటినికూడా ఎంపిక చేసినట్లు బీఈఈ సెక్రటరీ ఆర్కే రాయి వెల్లడించారని నెడ్క్యాప్ ఎండీ ఎస్ రమణ రెడ్డి తెలిపారు. ఈ దేవస్థానాలు వాటి పరిధిలో ఇంధన సామర్ధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు జాతీయ లక్ష్యమైన నెట్ జీరో ఎనర్జీ లక్ష్యాల్ని సాధించడానికి ఇది దోహదపడుతుందని తెలిపారు.
ఈ వెబ్‌నార్‌లో టీటీడీ చీఫ్ ఇంజనీర్ డి నాగేశ్వరరావు, సూపరింటెండింగ్ ఇంజనీర్ పి జగదీశ్వరరెడ్డి, డివిజనల్ ఇంజనీర్ రవిశంకర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు..

Check Also

విద్యుత్‌ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *