Breaking News

సకల సదుపాయాల కల్పవల్లి.. మెగా ఫుడ్ పార్క్ @ మల్లవల్లి


-పారిశ్రామిక కల్పతరువు.. పెట్టుబడిదారుల కామధేనువు
-రూ.86కోట్లతో 7.48 ఎకరాలలో భారీ ‘కోర్ ప్రాసెసింగ్‌ సెంటర్‌’ : ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి
-ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ఏప్రిల్ లో రోడ్ షో : ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాది
-ఫుడ్ పార్కుల ద్వారా రూ. 260కోట్ల పెట్టుబడులు, 6 వేల మందికి ఉపాధి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రైతులకు అందుబాటులోకి కృష్ణాజిల్లా మల్లవల్లి మెగాఫుడ్‌ పార్కును రానున్న మామిడి పళ్ల సీజన్‌ నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు ఆంధ్రప్రదేశ్‌ మౌలిక వసతుల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) ప్రణాళిక సిద్ధంచేసింది. రైతులకు ఫుడ్ పార్కును అందుబాటులోకి తీసుకురావాలనే ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయాన్ని త్వరలో సాకారం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా.. ముడి పదార్థం నుంచి గుజ్జు, పండ్ల రసాలు తీసి ప్యాకింగ్‌ చేసి ఎగుమతి చేసుకునేలా భారీ కోర్ ప్రాసెసింగ్‌ సెంటర్‌ (సీపీసీ)ను ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి వెల్లడించారు 57.95 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ఈ మెగా ఫుడ్‌ పార్కును రూ.112.94 కోట్లతో అత్యాధునికంగా తీర్చిదిద్దినట్లు ఆయన పేర్కొన్నారు. సుమారు 7.48 ఎకరాలలో రూ. 86 కోట్లతో మెగా ఫుడ్ పార్కు పరిధిలో సీపీసీ(కోర్ ప్రాసెసింగ్ సెంటర్)ని కూడా ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. అన్ని రకాల పండ్ల రసాలు, పొడులు, నూకలకు కావాల్సిన పరిమాణంలో ప్యాకింగ్, ఆహార నాణ్యతను పరిశీలించే ల్యాబ్‌లను ఈ సీపీసీలో నెలకొల్పారన్నారు.

మల్లవల్లి ఫుడ్ పార్కులో ఏర్పాటైన కోర్ ప్రాసెసింగ్ సెంటర్ పనితీరుపై చేసిన ప్రయోగాలు విజయవంతంతో ఏప్రిల్ కల్లా ఈ యూనిట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా ఏపీఐఐసీ అడుగులు వేస్తోంది. ఈ ఫుడ్‌పార్క్‌ పనులు సహా సీపీసీని పరిశీలించేందుకు ఛైర్మన్ నేతృత్వంలోని ఏపీఐఐసీ బృందం గత వారం పరిశీలించింది. అలాగే, దీనిపక్కనే ఏపీఐఐసీ 42.55 ఎకరాల్లో మరో ‘స్టేట్‌ ఫుడ్‌పార్క్‌’ను ఏర్పాటు చేసింది. ఇక్కడ ఏర్పాటుచేసే యూనిట్లు కూడా ఈ సీపీసీ సౌకర్యాలను వినియోగించుకునేలా తీర్చిదిద్దింది. ఈ రెండు పార్కుల ద్వారా సుమారు రూ. 260కోట్ల పెట్టుబడులు, 6 వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా.

ఏప్రిల్ లో ‘రోడ్‌ షో’ : ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాది
మల్లవల్లి మెగా ఫుడ్‌పార్క్‌లోని కోర్ ప్రోసెసింగ్‌ సెంటర్‌ సౌకర్యాలను రైతులకు, పెట్టుబడిదారులకు తెలియజేయడానికి త్వరలోనే రోడ్‌ షో నిర్వహించనున్నట్లు ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాది వెల్లడించారు. ముడి సరుకును తీసుకొచ్చి వారికి కావాల్సిన పరిమాణంలో శుద్ధిచేసిన ఉత్పత్తులను తీసుకువెళ్లేలా ఇందులో అన్ని సౌకర్యాలు కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. మామిడి, టమోటా, బొప్పాయి, జామ, అరటి పండ్లతో పాటు వివిధ ఆహార ధాన్యాలను ప్రాసెస్‌ చేసి ప్యాకింగ్‌ చేసి తీసుకెళ్లవచ్చని ఎండీ స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ పార్క్‌లో యూనిట్లు ఏర్పాటుచేయడానికి కొన్ని సంస్థలు ముందుకొచ్చాయని, మరికొన్ని సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారి అనుమతితో ఏప్రిల్ లో రోడ్ షో నిర్వహించే తేదీ వివరాలు ఖరారు చేస్తామని ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది తెలిపారు.

సీపీసీ వసతులివీ
గంటకు 6–10 టన్నుల గుజ్జు, కాన్‌సెంట్రేషన్‌ లైన్, 120 టన్నుల సామర్థ్యం ఉండే పండ్లను మగ్గబెట్టే (రైపెనింగ్‌) చాంబర్లు ఎనిమది, 3,000 టన్నుల శీతల గిడ్డంగి, 4,000 టన్నుల సరుకు నిల్వచేసే గిడ్డంగితో పాటు ల్యాబ్‌లు సీపీసీ పరిధిలోకి వస్తాయని ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుదర్శన్ బాబు పేర్కొన్నారు.

– గంటకు 6 టన్నుల టమోటా, 10 టన్నుల మామిడి, 5 టన్నుల బొప్పాయి, 6 టన్నుల జామ, 4 టన్నుల అరటి గుజ్జు లేదా రసం తీసే ఆస్పెటిక్‌ పల్ప్‌లైన్‌..
– 200 ఎంఎల్‌ సామర్థ్యం కలిగిన జ్యూస్‌ ప్యాకెట్లు స్ట్రాతో కలిపి గంటకు 7,500 ప్యాకింగ్‌ చేసే పూర్తిస్థాయి అటోమేటిక్‌ ఫిల్లింగ్, ప్యాకింగ్‌ లైన్‌..
– జొన్నలు, బియ్యం వంటి ఆహార ఉత్పత్తులను నిల్వచేసుకోవడానికి 4,000 టన్నుల సామర్థ్యంతో గిడ్డంగి..
– పండ్లు, కూరగాయల నిల్వకు 3,000 టన్నుల సామర్థ్యం ఉన్న శీతల గిడ్డంగి..
– మామిడి, అరటి, టమోటా వంటి పండ్లను మగ్గ పెట్టడానికి 960 టన్నుల సామర్థ్యం కలిగిన ఈసీఆర్‌సీ రైపెనింగ్‌ చాంబర్స్‌.. (ఒక్కో చాంబర్ 120 టన్నుల చొప్పున మొత్తం 8 చాంబర్ల ఏర్పాటు)
– సుగంధ ద్రవ్యాలు, పప్పులు, బియ్యం వంటి పొడులు, గ్రాన్యూల్స్‌ను 100 గ్రాముల నుంచి 2 కేజీలకు వరకు ప్యాకింగ్‌ చేసే యూనిట్లు..
– చిన్న ప్యాకెట్లు అయితే నిమిషానికి 50–70, పెద్దవి అయితే 25–30 ప్యాకెట్ల ప్యాకింగ్‌..
– ఈ ఆహార పదార్థాలను పరీక్షించడానికి ఎనలైటికల్‌ ల్యాబ్‌.
– సీపీసీ నిర్వహణలో కీలకమైన డీజీసెట్, కాంపౌండ్ వాల్, కార్యాలయ భవనం, పంపు, సెక్యూరిటీ గదులు, ఎలక్ట్రికల్ ప్యానెల్ రూమ్, యుటిలిటీ ఆర్ సీసీ స్ట్రక్చర్, ఔటర్ రోడ్డు, పార్కింగ్ స్థలం, కూలింగ్ టవర్, పైపింగ్ వర్క్, కంప్రెసర్ వంటి సదుపాయాలు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *