రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రబీ సాగుకు సంబంధించిన ధాన్యం కొనుగోలు చేసేందుకు అర్భికే లలో కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో సన్నద్ధం చెయ్యాలని జిల్లా కలెక్టర్ డా.కె. మాధవీలత స్పష్టం చేశారు. స్థానిక సబ్ కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించే వాలంటీర్లు అవార్డ్ జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ తో కలసి గురువారం ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, రైతుల నుంచి ధాన్యం సేకరణ చేపట్టే ముందు ఈ-క్రాప్ లో తప్పనిసరిగా రైతులచే నమోదు చేయాలన్నారు. రైతులు రైతు భరోసా కేంద్రా లు ద్వారా ఈ క్రాప్ లో వారి వివరాలు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందని తెలిపారు. తప్పనిసరిగా ఈ క్రాప్ చేసుకున్న వారి నుంచే రబీలో ధాన్యం కొనుగోలు కి అవకాశం ఉన్నందున రైతు లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో రైతులు ఏరకంగా ధాన్యం సాగుచేస్తున్నారో ముందుగా సమన్వయ శాఖల అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది డేటా సేకరించాలని ఆదేశించారు. గత ఏడాది చేసిన సేకరణ కి అనుగుణంగానే ఈసీజన్ లో కూడా ప్రణాళికలు తయారు చేసుకోవాల్సి ఉందన్నారు. గన్ని బ్యాగులు కి సంబంధించిన జిల్లా యంత్రాంగం ఎమ్ ఏస్ ఎల్ పాయింట్, సివిల్ సప్లయిస్ సంస్థ ద్వారా సరఫరా చేసిన ప్రతి ఒక్క గన్ని బ్యాగ్ వొచ్చేలా చూడాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో 311 అర్భికే లు ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ద్వారా సేకరణ కి సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు. మిల్లర్లు ధాన్యం సేకరణ కి సంబంధించి వారే గన్ని బ్యాగులు సరఫరా చేసేందుకు సంసిద్ధులు గా ఉండాలన్నారు. ఈ విషయమై వారితో సమావేశం నిర్వహించాలన్నారు. అగ్రికల్చర్, పౌర సరఫరాల, మార్కెటింగ్ శాఖలు సమన్వయం తో పనిచేయాలన్నారు. సేకరణ కోసం వినియోగించే వాహనాల వివరాలు నమోదు చేయాలన్నారు. తేమ శాతం, కొలతలు, సాఫ్ట్వేర్ , డేటా నమోదు పై సిబ్బంది కి శిక్షణ తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ క్రాప్ సంబంధించిన ఆధార్, బ్యాంక్ ఖాతా నెంబర్ సరిగ్గా నమోదు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు.
జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ మాట్లాడుతూ, జిల్లాలో ఏర్పాటు చేసే పిపిసి ల ద్వారా ధాన్యం సేకరణ అధికారులు కార్యాచరణ ప్రణాళిక తో సిద్ధంగా ఉండాలన్నారు. ధాన్యం సేకరణలో తూకం, తేమశాతం, గన్ని బ్యాగులు వంటి విషయాల్లో రైతులను ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉందని, ఆ విషయంలో రైతుల కోసం పనిచేసి అండగా నిలపడం ముఖ్యం అన్నారు. ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం, భరోసా కల్పించే దిశగా అర్భికెలు ఏర్పాటు చేసిన విషయాన్ని జేసి గుర్తు చేసారు. జిల్లాలో ఇప్పటికే నాలుగు మండలాల్లో ధాన్యం కొనుగోలు మొదలైందని అధికారులు తెలిపారు. ప్రతి అర్భికే స్థాయిలో సేకరించే ధాన్యం స్టోరేజ్ విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. సీఎస్డీటి, విఆర్వో లకు మిల్లులు, అర్భికే లు అనుసంధానం చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.మాధవరావు, డిఎం (సి ఎస్) కె. తులసి, డిఎస్వో పి. ప్రసాదరావు, డిసిఓ ఎమ్.నాగభూషణం, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.