-సిబ్బందికి ఆదేశాలు కార్యాలయంలో అన్ని విభాగాలను క్షేత్ర స్థాయిలో పరిశీలన
-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్,
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతినిత్యం వివిధ పనుల నిమిత్తం కార్యాలయాలకు వచ్చు ప్రజలకు ఆహ్లాదకరంగా కనిపించే విధంగా తమ యొక్క కార్యాలయాలను శుభ్రంగా ఉంచుకోవాలనే లక్ష్యంగా ప్రతి శనివారం ఒక గంట పాటు కార్యాలయాలను శుభ్రం చేసుకోవాలనే నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, వారి ఆదేశాలకు అనుగుణంగా ప్రధాన కార్యాలయంలోని వివిధ విభాగాలలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది శుభ్రత కార్యక్రమములను నిర్వహించారు. కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులతో కలసి కార్యాలయ ఆవరణలో గల అన్ని విభాగములలో సిబ్బంది నిర్వహిస్తున్న శుభ్రత పనులను పరిశీలిస్తూ, అందరు విధిగా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమములను ప్రతి శనివారం నిర్వహించాలని, సెక్షన్ లు మరియు పరిసరాలు అన్నియు శుభ్రంగా తీర్చిదిద్దుకోవాలని అన్నారు. కార్యాలయ ఆవరణలో ఎక్కడ ఏవిధమైన నిరుపయోగంగా ఉన్న అర్మరాలను తొలగించాలని మరియు మినిస్ట్రీయల్ సిబ్బంది అందరు విధిగా ఫైల్స్ డిస్పోజ్ చేస్తూ, రికార్డు లను సక్రమముగా నిర్వహించాలని ఆదేశించారు. అదే విధంగా పుర సేవా కేంద్రము, నూతన భవన సముదాయం, కౌన్సిల్ హాల్ ప్రాంగణం, క్యాంటిన్ పరిసరాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసారు. కార్యాలయ ఆవరణలో వాహనముల పార్కింగ్ ఇష్టానుసారంగా ఉండుట గమనించి సిబ్బంది యొక్క వాహనములు అన్నియు నూతన భవనం సెల్లార్ నందు పార్కింగ్ చేసుకోనే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యాలయాలలో ఏమైనా చిన్న చిన్న మరమ్మత్తులు చేపట్టవలసిన యెడల వాటిని గుర్తించి వాటికీ అగు అంచనాలు తాయారు చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. కార్యక్రమములో అదనపు కమిషనర్(జనరల్) యం.శామల, అదనపు కమిషనర్(ప్రాజెక్ట్స్) కె.సత్యవతి, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) వెంకట లక్ష్మి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ.ఎస్.ఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.