-విద్య, అభివృద్ధికి అందించే ప్రోత్సాహం మార్పునకు అత్యంత కీలకం
-ప్రపంచంలో ఉన్నతశ్రేణి దేశాల్లో ఒకటిగా అవతరించగల సామర్ధ్యం భారత్ సొంతం
-నూతన జాతీయ విద్యావిధానం – 2020 విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది
-ప్రపంచ దేశాల సరసన భారతదేశం విశ్వగురువు హోదాను తిరిగి నిలబెట్టుకునేలా యువత కృషి చేయాలని సూచన
-తమిళనాడు నీలగిరిలో ఉన్న లారెన్స్ పాఠశాలను సందర్శించిన ఉపరాష్ట్రపతి
లవ్‌డేల్, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజంలో అణగారిన వర్గాలకు, నిరుపేదలకు విద్యను చేరువ చేసేందుకు, మెరుగైన విద్యను అందించేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో విద్యార్ధులు సైతం భాగస్వాములు కావాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయడు ఉద్బోధించారు. దేశంలో విద్యారంగంలో సానుకూల మార్పులను తీసుకురావడానికి, అందరికీ సమానమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. విద్య, సామాజిక – ఆర్థిక అభివృద్ధి విషయంలో సమాజంలో ఏ ఒక్కరూ వెనుకబడి ఉండడానికి వీలు లేదనే వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని ఆయన సూచించారు.
తమిళనాడు నీలగిరి దగ్గర ఉన్న లవ్‌డేల్ లోని లారెన్స్ పాఠశాలను బుధవారం ఉపరాష్ట్రపతి సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులను, ఉపాధ్యాయులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, మార్పునకు అత్యంత కీలకమైన అంశంగా విద్యను అభివర్ణించారు. అది గుణాత్మకమైన ఒత్తిడిని అందిస్తూనే, దేశ అభివృద్ధి వేగానికి ఊతం ఇస్తుందని తెలిపారు. ఇవాళ భారతదేశం ప్రపంచంలోని అగ్రగామి దేశాల్లో ఒకటిగా ఎదిగేందుకు సిద్ధంగా ఉందన్న ఆయన, భారతదేశ యువజన శక్తి గురించి ప్రస్తావించారు. 65 శాతం కంటే ఎక్కువ మంది 35 ఏళ్ళ లోపు యువత ఉన్నారన్న ఆయన, యువజన సామర్ధ్యాన్ని దేశాభివృద్ధి కోసం వినియోగించుకోవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఇది భారతదేశాన్ని ప్రపంచ వేదికపై బలమైన దేశాల్లో ఒకటిగా నిలబెట్టగలదని పేర్కొన్నారు.
భారతదేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో జాతీయ నూతన విద్యావిధానం -2020 విప్లవాత్మక మార్పులకు నాంది పలకగలదన్న ఉపరాష్ట్రపతి, ఇది మన దేశంలో విద్యారంగ ముఖచిత్రాన్ని సానుకూల మార్గంలో ప్రభావితం చేయగలదని పేర్కొన్నారు. జాతీయ అభివృద్ధిలో విద్యా సంస్థలను నేరుగా భాగస్వామ్యం చేయడానికి ఈ విధానం బాటలు వేసిందన్న ఆయన, పాఠశాలలు ఇందులో కీలక పాత్ర పోషిస్తాయని ఆకాంక్షించారు. ప్రాచీన కాలంలో నలంద, తక్షశిల వంటి గొప్ప విశ్వవిద్యాలయాలకు కేంద్రంగా, విశ్వగురువుగా భాసిల్లిన భారతదేశం, మళ్ళీ ఆ వారసత్వాన్ని తిరిగి అందుకునే ప్రయత్నాల్లో భాగస్వాములు కావాలని, ప్రపంచ దేశాల సరససన భారత్ మళ్ళీ విశ్వగురు పీఠాన్ని అందుకునేందుకు సమష్టిగా కృషి చేయాలని ఆయన సూచించారు.
లారెన్స్ పాఠశాల విద్యార్థులు చేపడుతున్న గిరిజన గ్రామాల్లోని నివాసాల పునర్నిర్మాణం, వరద ప్రభావిత ప్రాంతాల్లో గ్రామస్థులకు చేయూత లాంటి అంశాలను అభినందించిన ఉపరాష్ట్రపతి, ఇది భవిష్యత్ లో వారిని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతుందని పేర్కొన్నారు. పాఠశాలలు విద్యార్థుల వ్యక్తిత్వ సర్వతోముఖాభివృద్ధిని పెంపొందించటం మీద దృష్టి కేంద్రీకరించాలని, క్రీడలకు అవసరమైన వాతావరణంతో పాటు సౌకర్యాలను తప్పనిసరిగా అందించాలని సూచించారు. విద్యార్థులు సైతం ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవాలన్న ఉపరాష్ట్రపతి, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను కలిగి ఉండాలని సూచించారు. విద్యార్థులు తమ జ్ఞానంతో ప్రపంచాన్నే మార్చగలరన్న ఆయన, శక్తివంతమైన నవభారత నిర్మాణంలో విద్యార్థులు భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో తమిళనాడు అటవీ శాఖ మంత్రి కె. రామచంద్రన్, నీలగిరి జిల్లా కలెక్టర్ ఎస్పీ అమృత్, లారెన్స్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకరన్ సహా అధ్యాపకులు, విద్యార్థులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.