Breaking News

రౌండుటేబుల్‌ సమావేశంలో వామపక్ష, దళిత, ప్రజా సంఘాలు…

-కాకినాడ వెళ్ళనున్న రాష్ట్ర అఖిలపక్షం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దళితులు, మహిళలపై నిరవధికంగా జరుగుతున్న హత్యలు, అఘాయిత్యాలను నిరసిస్తూ, విజయవాడ దాసరిభవన్‌లో సోమవారం, సిపిఐ రాష్ట్ర సమితి రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించింది. దీనికి వివిధ రాజకీయ పార్టీలు, దళిత, మహిళా, ప్రజా సంఘాలు, మేధావులు తదితరులు హాజరయ్యారు. సమావేశానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అధ్యక్షత వహించారు. దళిత, మహిళలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ, కాకినాడ వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌భాస్కర్‌ను బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ, జూన్‌ 2న చలో రాజ్‌ భవన్‌కు సమావేశం పిలుపునిచ్చింది. సిపిఐ నేత రామకృష్ణ మాట్లాడుతూ, రాష్ట్రంలో పోలీసులు ఆటవిక రాజ్యమేలుతోందన్నారు. నాడు మాస్క్‌ అడిగిన పాపానికి విశాఖలో డాక్టర్‌ సుధాకర్‌ని పిచ్చివాడిని చేసి కొట్టి చంపేశారనీ, అది ప్రభుత్వ హత్యేనని అన్నారు. సుధాకర్‌ తో మొదలైన అఘాయిత్యాలు ఇప్పటివరకూ కొనసాగుతూనే ఉన్నాయని వివరించారు. అధికారం ఉందనే అహంకారంతో వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌భాస్కర్‌ తన డ్రైవర్‌ను హతమార్చి, స్వయంగా ఆయన కారులోనే కుటుంబీలకు మృతదేహం ఇచ్చిన సంఘటనను ఇంతవరకూ నేనెప్పుడూ చూడలేదన్నారు. అటు పోలీస్‌ వ్యవహార శైలి పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసు ఉన్నతాధికారులు హుందాతనంగా వ్యవహరించడం లేదని, వారి ప్రకటనలు రాజకీయ నేతలను తలపించేలా ఉన్నాయని విమర్శించారు.పోలీస్‌లకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసేదాకా చర్యలు తీసుకోరా? అని ప్రశ్నించారు. అధికారులు తలా తోక లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హత్యకు పాల్పడ్డ ఎమ్మెల్సీపై వైసీపీ ఆధిష్టానం ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ నిలదీశారు. ఏళ్ల తరబడి గిరిజనుల హక్కులను కాలరాస్తూ, ఒక మాఫియా తరహాగా వ్యవహరిస్తున్న అనంత ఉదయ్‌భాస్కర్‌ అవినీతి అక్రమాలపై నిగ్గు తేల్చేందుకుగాను సీబీఐతో విచారించాలని డిమాండు చేశారు. పోలీస్‌లది సింగల్‌ అజెండా, అధికార పార్టీ నాయకులకు కొమ్ముకాయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో జగన్‌ కొత్త రూల్‌ పెట్టారనీ, చలో అసెంబ్లీ, నిరసనలకు అనుమతులు లేవంటున్నారన్నారు. విపక్షాలు, ప్రజా సంఘాల నేతలను అక్రమ కేస్‌లు, గృహ నిర్బంధాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కొరవడిరదని, లెక్కలేనితనంతో అధికార పార్టీ నాయకులు ప్రవర్తిస్తున్నారనీ, అధికార అహంకారాన్ని దించాలల్సిన అవసరముందన్నారు. త్వరలో గవర్నర్‌, శాసన మండలి చైర్మన్‌ను కలిసి ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని కోరతామన్నారు. డీహెచ్‌పీఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు ప్రారంభోపన్యాసం చేస్తూ, ఓట్లేసి గెలిపించిన సామాజిక వర్గాలనే జగన్‌ అణచివేతకు గురిచేస్తున్నారన్నారు. అనంత ఉదయ్‌భాస్కర్‌ ఆగడాలకు అధికార నేతలు కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. ఆయనపై హత్యానేరం కేసు నమోదులో వామపక్ష, దళిత, గిరిజన ప్రజా సంఘాల ఉద్యమ ఎంతో ఉందన్నారు.
జై భీమ్‌ భారత్‌ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రావణ్‌ కుమార్‌ మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాలను నెత్తిన పెట్టుకొని చూసుకుంటా అని నమ్మించి ,అధికారంలోకి వచ్చిన వైకాపా దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వెనుబడిన వర్గాలపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాము తన పిల్లల్ని తనే చంపినట్టు, ఓట్లు వేసిన వాళ్లపైనే దాడులు చేయడం దురదృష్టకరమన్నారు. ప్రశ్నిస్తే దాడులు,ఇప్పటివరకు జరిగిన దాడులు ఒక ఎత్తు, నిన్న కాకినాడలో జరిగిన ఘటన మరో ఎత్తు అని ఉదహరించారు. తన దగ్గర పని మానేశాడనే అహంకారంతో ఇంటి నుంచి తీసుకెళ్లి చంపి, శవాన్ని తీసుకోమని తల్లి దండ్రులను బెదిరించడం చూస్తే ఎంత బరితెగించారో అర్ధమవుతుందన్నారు. ఇలాంటి ఘటన చూస్తే ఎవరికైనా ప్రశ్నించే ధైర్యం ఉంటుందా?, ప్రతి ఒక్కరూ సంఘటితంగా ఇలాంటి ఘటనలపై తిరగబడాలని పిలుపునిచ్చారు. కాకినాడ ఉదంతంపై అందరం కలిసి పోరాడినందునే, బాధితులకు న్యాయం జరుగుతుందని నమ్మకం కలిగిందన్నారు. అన్ని ప్రజా సంఘాలు,రాజకీయ పార్టీలు కలిసి వచ్చాయి కాబట్టి బాధితులకు న్యాయం జరిగిందని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీని అరెస్ట్‌ చేస్తే, జగన్‌ను అరెస్టు చేసినట్లేనని, అంత బలమైన మూలాలు ఉన్న వ్యక్తి అనంత
ఉదయ్‌భాస్కర్‌ అని పేర్కొన్నారు. మాజీ మంత్రి, టీడీపీ నేత నక్కా ఆనంద్‌బాబు మాట్లాడుతూ, ఏజెన్సీలో అత్యంత దుర్మార్గమైన వ్యక్తి అనంత ఉదయభాస్కర్‌ అంటూ ఆయన నేర చరిత్రపై ఆరోపించారు. నకిలీ ధ్రువీకరణ పత్రంతో ఎంపీపీగా పోటీ చేసి అక్కడి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారన్నారు. ఏజెన్సీ మొత్తం సినిమాల్లో చూపినట్టు స్మగ్లింగ్‌ చేసే వ్యక్తి ఉదయ భాస్కర్‌ అని పేర్కొన్నారు. హత్య జరిగి 48 గంటల తర్వాత పోలీసులు స్పందించడం దురదృష్టకరమన్నారు. గిరిజనులను దోచుకున్నారని, వ్యవసాయ భూములకు నీరివ్వకుండా, తన పొలాలకు మళ్లించారని తెలిపారు.అతనిపై కచ్చితంగా సీబీఐ విచారణ చేపట్టాలి,అతని అకృత్యాలు బయటకు రావాలంటే సీబీఐతో విచారించాలని డిమాండు చేశారు. విజయవాడ నగర కాంగ్రెస్‌ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు మాట్లాడుతూ, ఇలాంటి అరాచక పాలన కొనసాగిస్తున్న ప్రభుత్వానికి తగిన బుద్దిచెప్పేలా ప్రజలు చైతన్యవంతులు కావాలన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, అనంత ఉదయభాస్కర్‌ను అరెస్టు చేయడం, భర్తరప్‌తోనే సరిపెట్టకుండా అతని అవినీతి కార్యకలాపాలపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలన్నారు. ఏపీ మహిలా సమాఖ్య రాష్ట్ర ప్రధాన పి.దుర్గాభవాని మాట్లాడుతూ ఇటీవల నుంచి మహిళలు, చిన్నారులు, అణగారిన వర్గాలపై హత్యలు, దారుణాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నేర చరిత్రగల వ్యక్తులు చట్టసభల్లోకి రావడంతోనే కాకినాడ లాంటి సంఘటనలు వెలుగు చూస్తున్నాయని చెప్పారు. సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ రాష్ట్ర నాయకులు డి.హరినాథ్‌ మాట్లాడుతూ, ప్రజా ఉద్యమం ద్వారా ప్రభుత్వాల మెడలు వంచుతామనడానికి కాకినాడలో తలపెట్టిన ఉద్యమం స్ఫూర్తిదాయకమని చెప్పారు. ఎంసీపీఐ(యు) రాష్ట్ర నాయకులు ఖాదర్‌బాషా మాట్లాడుతూ, జగన్‌ అధికారంలోకి వచ్చాక అణగారిన వర్గాలపై దాడులు ఎరిగిపోతున్నాయన్నారు. ఏపీ ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు చలసాని శ్రీనివాస్‌ మాట్లాడుతూ, సాటి మనిషికి అన్యాయం జరిగినప్పుడు సమాజం స్పందించాల్సిన అవసరముందన్నారు. కాకినాడ ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌భాస్కర్‌ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోరాడాలని కోరారు. టీడీపీ విజయవాడ పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి, ఆమ్‌ ఆద్మీ పార్టీ సోషల్‌ మీడియా కన్వీనర్‌ బి.శ్రీను మాట్లాడుతూ, మహిళలపై హత్యలు, మానభంగాలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. డీహెచ్‌పీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవది సుబ్బారావు మాట్లాడుతూ, అనంత ఉదయ్‌భాస్కర్‌కు అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు మద్దతిచ్చేలా వ్యాఖ్యలు దారుణమన్నారు. ఆర్‌పీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టా వరప్రసాద్‌, అమరావతి బహుజన జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ పోతల బాలకోటయ్య మాట్లాడుతూ అనంత ఉదయ్‌భాస్కర్‌ను ఎన్‌కౌంటర్‌ చేయాలని డిమాండు చేశారు. కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ, గత కాంగ్రెస్‌, టీడీపీ ప్రభుత్వాల నుంచి నేటి వైసీపీ ప్రభుత్వం వరకు ఎస్సీ,ఎస్టీ మోనటరింగ్‌ సెల్‌ సమావేశాలను సక్రమంగా నిర్వహించకపోవడంతోనే, ఇలాంటి సంఘటనలు వెలుగు చూస్తున్నాయన్నారు. పీడీఎస్‌యూ జాతీయ కార్యదర్శి పి.రామకృష్ణ, మాలమహానాడు జాతీయ కార్యదర్శి దానం లాజర్‌బాబు తదితరులు మాట్లాడుతూ, అనంత్‌ ఉదయ్‌భాస్కర్‌కు పెద్దఎత్తున ఉద్యమ కార్యాచరణ కొనసాగించాలని డిమాండు చేశారు. తొలుత సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.చంద్రానాయక్‌, రాష్ట్ర నాయకులు ఆర్‌.పిచ్చయ్య అభ్యుదయ గీతాలను ఆలపించారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, అఖిల భారత కిసాన్‌సభ జాతీయ అధ్యక్షులు రావుల వెంకయ్య, సిపిఐ ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శి సిహెచ్‌.కోటేశ్వరరావు, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పరుచూరి రాజేంద్రబాబు, నక్కి లెనిన్‌బాబు ఏఐఎస్‌ఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జాన్సన్‌బాబు, శివారెడ్డి, ఇన్షాఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌ సయ్యద్‌ అఫ్సర్‌, సామాజిక ఉద్యమకారులు టి.లక్ష్మీనారాయణ, డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న వివిధ ప్రజా సంఘాల నేతలు, ప్రతినిధులు పాల్గొన్నారు.

నేడు కాకినాడ వెళ్ళనున్న రాష్ట్ర అఖిలపక్షం
వై.సి.పి. యం.యల్‌.సి. అనంతబాబుచేతిలో హత్యగావించిన డ్రైవర్‌ వీది సుబ్రమణ్యం కుటుంబాన్ని పరామర్శించడానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, సిపిఐ (యం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి. వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ మంత్రివర్యులు పీటాని సత్యనారాయణ, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కొరివి వినయ్‌కుమార్‌, లిబరేషన్‌ పార్టీ కార్యదర్శి బుగత బంగారరాజు, అమ్‌ ఆద్మీ పార్టీ నాయకులు శ్యామ్‌, రైతుసంఘ జాతీయ అధ్యక్షులు రావుల వెంకయ్యతోపాటు దళిత, వివిధ ప్రజాసంఘాల నాయకులు హాజరౌతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు నేడొక ప్రకటనలో తెలియచేశారు. మ॥ 12:30 గంటలకు బాధిత కుటుంబం వద్దకు చేరుకొని అక్కడ వారితో మాట్లాడిన తర్వాత జిల్లా కలెక్టర్‌ను కలుస్తారని అన్నారు.

Check Also

2024లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు చారిత్రక విజయం ఇచ్చారు

-సూపర్-6 హామీలు కచ్చితంగా అమలు చేస్తాం -ఐదేళ్ల పాటు గత పాలకులు అన్ని వ్యవస్థలను విధ్వంసం చేశారు -గత ప్రభుత్వ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *