-రూ.65 కోట్లతో సోలార్ ప్యానళ్లు
-రూ.7 కోట్లతో సీసీ కెమెరాలు
-పెదవేగి,కొలసానిపల్లిలలో స్పోర్ట్స్ అకాడమీలు
-బీవోజీ సమావేశంలో నిర్ణయాలు
-మంత్రి మేరుగు నాగార్జున వెల్లడి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సాంఘిక సంక్షేమ గురుకులాలలో అన్ని సమస్యలు పరిష్కరించడానికి, అలాగే మరిన్ని హంగులను సమకూర్చడానికి చర్యలు తీసుకోవాలని బీవోజీ సమావేశంలో నిర్ణయించడం జరిగిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు.
ఎస్సీ గురుకులానికి చెందిన బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ (బీవోజీ) 70 వ సమావేశం మంగళవారం తాడేపల్లిలోని గురుకులం ప్రధాన కార్యాలయంలో మంత్రి మేరుగు నాగార్జున అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగానే నాగార్జున మాట్లాడుతూ, ఈ సమావేశంలో గురుకులాల్లోని సమస్యలను పరిష్కరించడానికి, విద్యార్థులకు మరింత మెరుగైన సౌకర్యాలను, నాణ్యమైన విద్యను అందించడానికి తీసుకోవాల్సిన చర్యలను గురించి చర్చించడం జరిగిందని తెలిపారు. దీనిలో భాగంగానే ఎస్సీ విద్యార్థులకు వృత్తి విద్యలలో కూడా శిక్షణలు ఇవ్వాలని నిర్ణయించామని, శ్రీకాకుళం, విజయవాడ, తిరుపతి, అనంతపురంలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఏఎన్ఎం కోర్సులలో శిక్షణలు ఇవ్వడానికి చర్యలు తీసుకోనున్నామని చెప్పారు. క్రీడల్లో కూడా విద్యార్థులను నిష్ణాతులుగా తీర్చిదిద్దడానికి ఏలూరు జిల్లాకు చెందిన కొలసానిపల్లి, పెదవేగి లలో స్పోర్ట్స్ అకాడమీలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న మూడు ఐఐటీ, నీట్ శిక్షణా కేంద్రాలు కాకుండా అదనంగా ఉమ్మడి జిల్లాలో జిల్లాకు ఒకటి చొప్పున 11 శిక్షణా కేంద్రాలను కొత్తగా ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించడం జరిగిందని నాగార్జున వివరించారు. అలాగే ఖాళీగా ఉన్న 90 స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేయడానికి, అవసరమైన చోట కొత్తగా నర్సింగ్ పోస్టులను మంజూరు చేయడానికి కూడా చర్యలు తీసుకోనున్నామని తెలిపారు. తుప్పు పట్టిన ఐరన్ పైపుల స్థానంలో పీవీసీ పైపులను ఏర్పాటు చేసి విద్యార్థులకు రక్షిత మంచినీటిని అందించాలని, తాగునీటి కొరత ఉన్న గురుకులాల్లో సమస్య తీర్చడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. 179 ఎస్సీ గురుకులాల్లో ఈ ఏడాది సీబీఎస్ఇ విద్యావిధానాన్ని అమలు చేయనున్నామని తెలిపారు. దీనిలో భాగంగానే గురుకులాలకు చెందిన టీజీటీ టీచర్లకు సీబీఎస్ఇ కి చెందిన ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ లలో శిక్షణలు కూడా ఇవ్వనున్నామని చెప్పారు. పెద్దగా డిమాండ్ లేని కోర్సుల స్థానంలో డిమాండ్ కలిగిన కోర్సులను ప్రవేశపెట్టడానికి కూడా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. కాగా ఎస్సీ గురుకులాలలో విద్యుత్ పొదుపును ప్రోత్సహించడానికి వినూత్నంగా రూ.65.06 కోట్ల వ్యయంతో సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగిందన్నారు. వీటి ద్వారా 1233 కే.వి.ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అంచనా వేయడం జరిగిందని నాగార్జున వెల్లడించారు. గురుకులాలలో విద్యార్థుల రక్షణ, పటిష్టమైన పర్యవేక్షణ కోసం రూ.7 కోట్లతో సీసీ కెమెరాలను ఐటీ విభాగం ద్వారా ఏర్పాటు చేయాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి ఎం.ఎం. నాయక్, డైరెక్టర్ కే.హర్షవర్ధన్, గురుకులం కార్యదర్శి పావనమూర్తితో పాటు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.