-ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో సమాయత్తం కావాలి
-ఫ్రైడే – డ్రై డే” పై ప్రజలందరికి అవగాహన కల్పించాలి
-వైద్యాధికారులు, ఐ సి డి ఎస్ అధికారులు సమన్వయం చేసుకోవాలి
-జిల్లా కలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నీటి ద్వారా సంక్రమించే డయేరియా వంటి వ్యాధులు సంక్రమించకుండా అంగన్వాడీ టీచర్లు , ఆషా వర్కర్లు విస్తృత ప్రచారాన్ని కల్పించాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం ఉదృత అతిసార పక్షోత్సవాలు నేపథ్యంలో సమన్వయ శాఖలతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా కె. మాధవీలత మాట్లాడుతూ, జూన్ 13 నుంచి 27 వరకు 15 రోజుల పాటు జిల్లాలో ఉదృత అతిసార పక్షోత్సవాలను ఘనంగా నిర్వహించా లన్నారు. జిల్లాలో డయేరియా వలన ఏ ఒక్క మరణం సంభవించకుండా ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో వైద్యాధికారులు సమాయత్తం కావాలని జిల్లా కలెక్టర్ మాధవిలత వైద్య అధికారులకు సూచించారు. రానున్న వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ప్రతి గ్రామంలోని డయేరియా ఇతర వ్యాధులపై వైద్యులు వైద్య అధికారులు వైద్య సిబ్బంది ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా జిల్లాలో డయేరియా వలన ఏ ఒక్క మరణం సంభవించకూడదన్నారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారుల పై దృష్టి సారించి ఐదు సంవత్సరాలలో పిల్లలందరి సంరక్షణ పై మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు ఆధ్వర్యంలో పర్యవేక్షించి అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో పట్టణాల్లో ఆయా పంచాయితీ పురపాలక నగరపాలక సంస్థ అధికారులు మెరుగైన శానిటేషన్ కార్యక్రమాన్ని చేపట్టి ప్రతిరోజు ఒక డ్రైవ్ చేపట్టి పరిసరాలను పరిశుభ్రం చెయ్యాలన్నారు. అదేవిధంగా జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా మెరుగైన శానిటేషన్ పరిసరాల పరిశుభ్రత పై “ఫ్రైడే డ్రై డే” గా ప్రజలందరికి అవగాహన కల్పించే విధంగా విస్తృత ప్రచారం చేయాలన్నారు. డయేరియా ప్రబలకుండా చిన్నారులకు, పెద్దలకు తరచూ చేతులు కడుక్కోవడం శుభ్రత పాటించడం, ప్రతి ఒక్కరూ కాచి చల్లార్చిన నీటినే త్రాగే విధముగా అవగాహన కల్పించాలన్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో వైద్యాధికారులు ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు, జింకు టాబ్లెట్లను ముందస్తుగానే అందుబాటులో పంపిణీకి సిద్దంగా ఉంచాలన్నారు. పంచాయతీ అధికారులు శానిటేషన్ పై దృష్టి సారించి కాలుష్య రహిత గ్రామాలు తీర్చిదిద్దాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్, డి ఆర్ ఓ బి సుబ్బారావు, డిఎంహెచ్ఓ (ఇన్చార్జి) డా. ఎన్. వసుంధర, డిఐఓ డా. జ్యోతి కుమారి సిడిపిఓ విజయ్ కుమారి సత్యనారాయణ, డిఇఓ అబ్రహం తదితర అధికారులు పాల్గొన్నారు.