Breaking News

పట్టణాలు, నగరాల్లో ఇక మరింత పచ్చదనం.. జగనన్న హరిత నగరాలతో సాకారం…

-పల్నాడు జిల్లా కొండవీడు గ్రామంలో ‘జగనన్న హరిత నగరాలు’ కార్యక్రమానికి మంగళవారం నాడు శ్రీకారం చుట్టనున్న ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి..
-మొదటి విడతగా 45 పట్టణ స్థానిక సంస్థల్లో పచ్చదనం, సుందరీకరణ అమలుకు ప్రణాళికలు.. అంచనా వ్యయం రూ. 78.84 కోట్లు.
-గ్రీన్ సిటీ ఛాలెంజ్ లో మొదటి 10 ర్యాంకులు సాధించిన వారికి ఒక్కొక్క సంస్థకు కోటి రూపాయల చొప్పున 10 కోట్లు బహుమానం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పట్టణాలు, నగరాల్లోని రహదారులు పచ్చటి చెట్లతో, సుందరీకరణతో కొత్త శోభను సంతరించుకోనున్నాయి. ఇందుకోసం ‘జగనన్న హరిత నగరాలు’ కార్యక్రమానికి మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడు గ్రామంలో ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పట్టణాలు మరియు నగరాల్లో పచ్చదనం, సుందరీకరణ పెంపొందించడానికి 126 పట్టణ స్థానిక సంస్థ(అర్బన్ లోకల్ బాడీస్)ల్లో మొదటి విడతగా 45 పురపాలక సంఘాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ఈ పథకం క్రింద గ్రీన్ సిటీ ఛాలెంజ్ లో మొదటి పది ర్యాంకులు సాధించిన పట్టణ స్థానిక సంస్థలకు రూ. 10 కోట్ల బహుమతి ప్రధానం చేయనున్నారు. మొత్తం 45 పట్టణ స్థానిక సంస్థల్లో మొదటి 10 స్థానాల్లో నిలిచిన ఒక్కొక్క పట్టణ స్థానిక సంస్థకు ఒక్కొక్క కోటి చొప్పున మొత్తం 10 కోట్లు ఇవ్వనున్నారు.

ఇందుకోసం రహదారికి మధ్యలో, ఇరువైపులా చెట్లు, మొక్కలు నాటేందుకు కొన్ని ప్రమాణాలు తీసుకోవడం జరిగింది. అందులో మట్టి రకాలు, వాతావరణం, నీటి వనరుల లభ్యత, మొక్కలు, చెట్ల లభ్యత, సోషల్ స్ట్రక్చర్ ను బట్టి 5 రకాలు గా రోడ్లను విభజించారు. అందులో 0.75 మీటర్, 0.9 మీటర్, 1.2 మీటర్, 1.5 మీటర్, 2 మీటర్ల రహదారి మధ్యస్థ వెడల్పు కలిగిన రోడ్లకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. పచ్చదనం, సుందరీకరణ పనుల మొదటి విడత కార్యక్రమానికి అంచనా వ్యయం రూ. 78.84 కోట్లుగా లెక్కగట్టారు. 224 కి.మీ పొడవులో రహదారి మధ్యస్థ భాగాన్ని 44,804 చెట్లతో, 2,24,020 చ.మీ. విస్తీర్ణంలో గుబురు మొక్కలతో అభివృద్ధి చేపట్టనున్నారు. అలాగే 1,276.46 కి.మీ.ల పొడవునా రహదారికి ఇరువైపులా 2,54,678 చెట్లను నాటే విధంగా కార్యాచరణను చేపట్టారు. రహదారి మధ్యలో, రోడ్డుకు ఇరువైపులా చెట్లను నాటడం వల్ల తలసరి పచ్చదనం 0.87 చ.మీ.గా కానుంది. .

తొలకరి వానలు ప్రారంభం నుండి ఆగస్టు 12 ముగిసే సమయానికి లక్ష్యానికి చేరువయ్యే విధంగా చెట్లు నాటే కార్యాచరణను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. రహదారి మధ్యస్థ భాగానికి 19 రకాల చెట్లు, 21 రకాల గుబురు మొక్కలు, రహదారి ఇరువైపులా 14 రకాల చెట్లను ఎంపిక చేసి మొత్తంగా 54 రకాల మొక్కలను, చెట్లను ఆంధ్రప్రదేశ్ పచ్చదనం మరియు సుందరీకరణ కార్పోరేషన్ (APG & BC) ప్రతిపాదించడం జరిగింది. మొక్కలు, చెట్లు నాటిన తరువాత పూర్తి పర్యవేక్షణ బాధ్యత సంబంధిత పట్టణ స్థానిక సంస్థ తీసుకుంటుంది. జగనన్న హరిత నగరాల కార్యాచరణ ప్రణాళిక అమలు మరియు పర్యవేక్షణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పట్టణ స్థానిక సంస్థకు ర్యాంకులను ఇవ్వనున్నారు. APG & BC కు చెందిన క్వాలిటీ కంట్రోల్ బృందం ఈ కార్యచరణలో భాగంగా 3 నెలలకు/6 నెలలకు/12 నెలలుకు పర్యవేక్షిస్తూ తగిన సలహా, సూచనలు ఇస్తుంది. మొక్కలకు నీరు అందించడం, కలుపు తీయుట, బేసిన్ తయారీ, ట్రిమ్మింగ్/ఎడ్జ్ కట్టింగ్, చనిపోయిన మొక్కల స్థానంలో కొత్తవాటిని నాటడం వంటి అంశాలను వార్షిక నిర్వహణలో భాగంగా పర్యవేక్షిస్తారు.

రోడ్లకు ఇరువైపులా, మధ్యస్థంగా మొక్కలు నాటి సంరక్షించేలా ప్రణాళికలను ప్రభుత్వం సిద్ధం చేయడం ద్వారా సామాజిక వనాల అభివృద్ధితో పచ్చదనాన్ని పెంపొందించి, తద్వారా పర్యావరణ సమతుల్యాన్ని సాధించడానికి జగనన్న ప్రభుత్వం నడుం బిగించింది. రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో పచ్చదనం పెంపొందించడంతో పాటు సుందరీకరించి.. ప్రజలకు ఆహ్లాదకర, ఆనందకర, ఆరోగ్యకరమైన వాతావరణం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్లడం సర్వత్రా హర్షణీయం.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *