-అవగాహన సదస్సులో లబ్ధిదారులకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు పిలుపు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడు అద్దెలతో ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో “నవరత్నాలు- పేదలందరికి ఇళ్ళు” కార్యక్రమానికి జగనన్న ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగిందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సత్యనారాయణపురంలోని AKTPM ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో లబ్ధిదారులకు బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సులో స్థానిక వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ శర్వాణి మూర్తితో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులలో నెలకొన్న అపోహలు తొలగించేలా ఆయన ప్రసంగం కొనసాగింది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని విధంగా 31 లక్షల మంది పేద కుటుంబాలకు సొంతింటి స్థలం మంజూరు చేసిన ఏకైక ప్రభుత్వం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అని మల్లాది విష్ణు చెప్పుకొచ్చారు. సెంట్రల్ నియోజకవర్గంలో 30వేల మంది నిరుపేదలకు రూ. 320 కోట్లతో భూమి కొని ఇవ్వడం ద్వారా ఒక్కొక్కరికి దాదాపు రూ. 6 లక్షలు విలువ ఆస్తి.. పట్టా రూపంలో సమకూరిందన్నారు. ఉచితంగా స్థలం ఇవ్వడమే కాకుండా.. రూ. 1 లక్షా 80 వేల ఆర్థిక సాయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అందిస్తున్నట్లు వివరించారు. లబ్ధిదారుని అవసరాన్ని బట్టి బ్యాంకుల ద్వారా మరో రూ. 35 వేలు రుణంగా మంజూరు చేస్తామని తెలియజేశారు. దీంతో పాటు ఉచితంగా ఇసుక, రూ. 267 ధరకే 100 సిమెంట్ బస్తాలు, మార్కెట్ కన్నా తక్కువ ధరకు ఇనుమును అందజేయనున్నట్లు చెప్పారు. కనుక సొంతంగా ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారులు ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకు వస్తే.. రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి తోడ్పాటును అందించడం జరుగుతుందన్నారు. దీని ద్వారా ప్రతినెలా రూ. 6 వేల నుంచి రూ. 10 వేలు అద్దెలు కట్టుకోకుండా బయటపడవచ్చన్నారు. అందులో సగం బ్యాంకుకు నెలనెలా చెల్లించినా ఏడాది కాలంలో రుణవిముక్తులు కావచ్చన్నారు.
దశలవారీగా నిర్మితమవుతున్న జగనన్న కాలనీలకు సంబంధించి తొలి విడతలో సెంట్రల్ నియోజకవర్గంలో 14,986 ఇళ్లను నిర్మిస్తున్నట్లు మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఒక్క సత్యనారాయణపురంలోనే 592 మందికి ఇళ్లు నిర్మించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో కొండపావులూరులో 40 మంది, సూరంపల్లిలో 80 మంది ఇప్పటికే ఇళ్లు నిర్మించుకున్నట్లు తెలిపారు. అలాగే నున్నలో 1,400 ఇళ్ల నిర్మాణం ప్రారంభమైనట్లు వివరించారు. లబ్ధిదారులందరూ హర్షించే విధంగా ఆహ్లాదకర వాతావరణంలో జగనన్న కాలనీలను గ్రీన్ సిటీలుగా తీర్చిదిద్దే బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని పేర్కొన్నారు. అధికారులు, సచివాలయ సిబ్బంది కూడా పేదలకు ఇళ్ల నిర్మాణాలపై లబ్ధిదారులను ఎప్పటికప్పుడు చైతన్యపరుస్తూ.. వారంతా త్వరగా ఇళ్ల నిర్మాణం పూర్తిచేసుకోవడంలో తోడ్పాటును అందించాలన్నారు.
పేదల సొంతింటి కలను ఆసరాగా తీసుకుని గత పాలకులు, జన్మభూమి కమిటీలు పేదలను నిలువునా మోసగించాయని మల్లాది విష్ణు అన్నారు. కనీసం స్థలాలు కూడా లేకుండా టిడ్కో ఇళ్ల పేరిట పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్నారు. కేవలం కాగితాలకే ఇళ్లను చూపి.. ఒక్కో లబ్ధిదారుని వద్ద రూ. 50 నుంచి రూ. లక్ష వరకు అప్లికేషన్ల రూపంలో దోచుకున్నారన్నారు. ఇందుకోసం ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో మేళా కూడా నిర్వహించారని గుర్తుచేశారు. ఆ సమయంలో డబ్బులు కట్టలేక ఇంట్లోని బంగారం తాకట్టు పెట్టేందుకు ప్రజలు ప్రైవేట్ బ్యాంకుల ముందు బారులు తీరడం కలిచివేసిందన్నారు. జూలై 03, 2018 నుంచి మార్చి 21, 2019 వరకు టిడ్కో లబ్ధిదారుల నుంచి వసూలు చేసిన డబ్బులకు నేటికీ వారంతా వడ్డీలు చెల్లిస్తున్నారని మల్లాది విష్ణు అన్నారు. చివరకు ఎన్నికలు సమీపిస్తున్నాయన్న భయంతో జనవరి 17, 2019 న నామమాత్రంగా ఆర్డర్ కాపీలను అందచేసి మరోసారి మోసగించారన్నారు. ఇందులో 6,576 ఇళ్లు 50 శాతం కూడా పూర్తికాలేదని.. 5,341 మందికి కనీసం స్థలం కూడా చూపలేదన్నారు. అయినా కూడా నగరంలో 11,917 మందికి ఆర్డర్ కాపీలను ఇచ్చారని దుయ్యబట్టారు. ఫలితంగా డబ్బులు చెల్లించిన కుటుంబాలు రోడ్డునపడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత చంద్రబాబు ప్రభుత్వం మోసగించిన టిడ్కో లబ్ధిదారులకు.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పూర్తి న్యాయం జరిగిందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి 897 మంది లబ్ధిదారుల ఖాతాలలో రూ. 3 కోట్ల 6 లక్షల 12 వేల 5 వందల నిధులు జమ చేసినట్లు వెల్లడించారు. నగర వ్యాప్తంగా 3,315 మంది ఖాతాలలో రూ. 10 కోట్ల 3 లక్షల 4 వేలు జమ అయినట్లు వివరించారు. తెలుగుదేశం ప్రభుత్వం కట్టకుండా వదిలేసిన టిడ్కో ఇళ్లను రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు, వీధి దీపాలు వంటి అన్ని హంగులతో పూర్తి చేసి డిసెంబర్ 21 ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజున పేదలకు అందించడం జరుగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రాజు, హౌసింగ్ ఏఈ ఇర్ఫాన్, సి.డి.ఓ. జగదీశ్వరి, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, నాయకులు తల్లాప్రగఢ గోపాలకృష్ణ, సనత్, చోడవరపు శివ, ఎస్.మధు, కోలవెన్ను రమణ, చల్లా సుధాకర్, సచివాలయ సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు.