విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ భద్రత రక్షణకు ప్రమాదం వాటిల్లే విధంగా కేంద్ర బిజెపి ప్రభుత్వం తెచ్చిన ప్రైవేట్ అగ్నిపథ్ పథకం రద్దు చేయాలని కోరుతూ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో సత్యాగ్రహ నిరసన కార్యక్రమాలు చేపట్టాలనే ఎపిసిసి పిలుపు మేరకు సోమవారం విజయవాడలో అలంకార్ సెంటర్ ధర్నా చౌక్ నందు ఎపిసిసి లీగల్ సెల్ ఛైర్మన్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలిబోయిన గురునాధం ఆధ్వర్యంలో సత్యాగ్రహ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎపిసిసి లీగల్ సెల్ ఛైర్మన్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలిబోయిన గురునాధం మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో నియంత నిరంకుశ పాలన సాగిస్తున్నారనీ, నాటి ప్రధాని ఉక్కు మహిళ, భారతరత్న స్వర్గీయ ఇందిరాగాంధీ 42వ రాజ్యాంగ సవరణ తరువాత ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడేందుకు ప్రధాన మంత్రి ప్రభుత్వ రంగ సంస్థలకు రక్షకుడుగా వుండాలే తప్ప ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకూడదనే అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకురావడం జరిగిందన్నారు. కానీ నేటి ప్రధాని నరేంద్ర మోడీ హయాంలోని కేంద్ర బిజెపి ప్రభుత్వం దేశ సంపద అయిన ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ, అంబానీ లాంటి బడా పారిశ్రామికవేత్తలకు దోచిపెడుతూ దేశాన్ని సర్వ నాశనం చేయడం జరుగుతుందన్నారు. చివరకు దేశ భద్రత రక్షణను కూడా ప్రైవేటీకరణ చేయాలని చూడటం వారి అసమర్ధ దద్దమ్మ పాలనకు నిదర్శనమని, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా దేశ భద్రత రక్షణ హాని కలిగించే అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేయడమైనదన్నారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు మాట్లాడుతూ దేశ సంపద కార్పొరేట్ సంస్థలకు దోచి పెడుతున్న బిజెపి కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దేశ ప్రజలు భవిష్యత్తులో తగినంత గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
ఎన్.ఎస్.యు.ఐ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలోని నిరుద్యోగం యువతకు కేంద్ర బిజెపి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుందనీ, ఇప్పటికే రెండుసార్లు పరీక్షలు వ్రాసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ఆర్మీ ఆశావాహులు ఏమైపోవాలి అనీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ… కేంద్ర బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక “జై జవాన్ – జై కిసాన్” స్ఫూర్తిని కాస్త “జై కార్పొరేట్ – జై ప్రైవేట్” అనే విధంగా మార్చేశారనీ వాపోయారు.
ఈ కార్యక్రమములో ఎపిసిసి ఆర్టీఐ, హ్యూమన్ రైట్స్ చైర్మన్లు నీవే కిరణ్ కుమార్, మన్నం రాజశేఖర్, నగర నాయకులకు అన్సారీ, మేళం చిన్న, జోసెఫ్, అప్పల నారాయణ, రమణ, ప్రకాష్, జగన్, మాబూ వలి, రాం దిలీప్, దమ్ము రాజు, జోసెఫ్, జానీ, ప్రమీలా గాంధీ, సునీత మరియు ఎన్.ఎస్.యు.ఐ. నాయకులు ఆకాష్, రాజు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News