Breaking News

స్వాతంత్రోద్యమంలో తెలుగువారి పాత్ర చిరస్మరణీయం: జి. కిషన్ రెడ్డి

-బ్రిటీషర్లకు ముప్పుతిప్పలు పెట్టిన తెలుగు వారందరినీ గుర్తుచేసుకోవాల్సిన తరుణమిది
-కొందరు నేరుగా ఆంగ్లేయులను ఎదుర్కొంటే మరికొందరు వారి సాహిత్యంతో ప్రజలను చైతన్య పరిచారు
-తెలుగువాళ్లు ఎక్కడున్నా మన భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు, దేశ సమగ్రతను కాపాడేందుకు పాటుపడుతుండటం అభినందనీయం
-ఆంధ్ర అసోసియేషన్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని, ప్రసంగించిన కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో భాగంగా దేశవ్యాప్తంగా ఎందరోమంది వీరులు, వీర వనితలు ఆత్మత్యాగాలు చేశారని, ఈ పోరాటంలో తెలుగువారి పాత్రను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖామాత్యులు జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో జరుపుకుంటున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలలో భాగంగా చేపడుతున్న కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా జాతీయవాద చైతన్యం పెరుగుతోందని, ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలోనూ ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలతోపాటు స్వచ్ఛంద సంస్థలు చాలా ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశాయని కిషన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. చిన్న-పెద్ద, పేద-ధనిక,గ్రామాలు-పట్టణాలు అనే తేడాలేవీ లేకుండా గల్లీ నుంచి ఢిల్లీ వరకు, పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు ప్రతి చోటా మువ్వన్నెల రెపరెపలు చూస్తుంటే చాలా ఆనందంగా ఉందన్నారు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సోమవారం ఢిల్లీలోని ఆంధ్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశ స్వాతంత్ర్య సిద్ధికి ఘనమైన చరిత్ర ఉన్నట్లుగానే, ఆంధ్ర అసోసియేషన్ కు కూడా గొప్ప చరిత్రే ఉందన్నారు.
ప్రొఫెసర్ ఎన్జీ రంగా, డాక్టర్ అనంతశయనం అయ్యంగార్, మాజీ రాష్ట్రపతి డాక్టర్ వరాహగిరి వెంకట గిరి, భోగరాజు పట్టాభిరామయ్య,  కాశీనాథుని నాగేశ్వరరావు వంటి ప్రముఖ దేశభక్తుల ఆలోచనల నుంచి 1935లో ఆంధ్ర అసోసియేషన్ పుట్టడం తెలుగువారిగా మనందరికీ గర్వకారణమన్నారు.
దేశరాజధానిలో తెలుగువారికంటూ ప్రత్యేకమైన సంఘాన్ని ఏర్పాటుచేసి తెలుగు భాషను, మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రోత్సహించడంతోపాటు విస్తృతంగా సేవాకార్యక్రమాలు చేపట్టిన ఆంధ్ర అసోసియేషన్ బాధ్యులను కిషన్ రెడ్డి అభినందించారు.

ఢిల్లీతోపాటుగా తెలుగువారు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా మన భాష, మన పండగలు, మన ఆచార, వ్యవహారాలను ప్రోత్సహించే దిశగా కృషిచేస్తుండటం అభినందనీయమన్నారు.
దేశ స్వాతంత్రోద్యమంలో తెలుగువారి పాత్ర కూడా చాలా ప్రత్యేకమైందన్న కిషన్ రెడ్డి, అల్లూరి సీతారామరాజు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఎన్జీ రంగా, గాడిచర్ల హరిసర్వోత్తమరావు టంగుటూరి ప్రకాశం పంతులు, తుర్రేబాజ్ ఖాన్, దుగ్గిరాల గోపాల కృష్ణయ్య, దుర్గాబాయి దేశ్ ముఖ్, బూర్గుల రామకృష్ణా రావు, వావిలాల గోపాల కృష్ణయ్య, అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్ సర్దార్ గౌతు లచ్చన్నతోపాటుగా ఎంతోమంది తమ ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడారన్నారు.
నాటి వీరుంలదరి త్యాగాలను నేటి తరం గుర్తుచేసుకుని ఆ స్ఫూర్తితో ముందుకెళ్లాల్సిన సమయమిదని తెలియజేశారు.
కొందరు ప్రత్యక్ష పోరాట బావుటాను ఎగరేసి ఆంగ్లేయులకు కంటిమీద కునుకులేకుండా చేస్తే.. మరికొందరు తమ సాహిత్య అస్త్రాలతో ప్రజలను నిరంతరం చైతన్య పరుస్తూ బ్రిటిషర్ల గుండెల్లో నిద్రపోయారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

త్రిపురనేరి రామస్వామి చౌదరి రాసిన ‘వీరగంధము తెచ్చినారము, వీరుడెవ్వడో తెల్పుడీ’ వంటి గీతాలు స్వరాజ్య సాధన కసిని మరింత పెంచిందన్నారు. గరిమెళ్ల వారు రాసిన ‘మాకొద్దీ తెల్లదొర తనము’, రాయప్రోలు రాసిన ‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా’, నిజాం వ్యతిరేక పోరాటంలో సుద్దాల హనుమంతు గారు రాసిన ‘బండెనక బండికట్టి పదహారు బండ్లు కట్టి’ అనే పాట ప్రజల్లో చైతన్యాన్ని రగిలించాయన్నారు.

వచ్చే 25 ఏళ్లలో దేశం ఏయే రంగాల్లో ముందుకెళ్లాలో నిర్ణయించుకుని తదనుగుణంగా కృషిచేయాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం పరిస్థితులున్నప్పటికీ.. భారతదేశంపై ఆ ప్రభావం లేకుండా ప్రజలపై ఆర్థిక మాంద్యం భారం పడకుండా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

భారతదేశంలో శక్తి సామర్థ్యాలకు కొదవలేదని, ప్రపంచమంతా కరోనాతో ఇబ్బందులు పడుతుంటే మన శాస్త్రజ్ఞులు ఎంతో శ్రమించి వ్యాక్సిన్ సిద్ధం చేయడాన్ని కిషన్ రెడ్డి గుర్తు చేస్తూ.. వివిధ దేశాలకు కూడా టీకా పంపిణీ చేసిన విషయాన్ని మనమంతా గుర్తుంచుకోవాలన్నారు.

తెలుగు తేజం విప్లవవీరుడైన అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో జరిగిన పోరాట స్ఫూర్తిని యావద్దేశానికి తెలియజేసే ఉద్దేశంతోనే ప్రధానమంత్రి ద్వారా అల్లూరి 125వ జయంతి కార్యక్రమాలను భీమవరంలో ఘనంగా నిర్వహించి, వారి విగ్రహాన్ని అవిష్కరింపజేశామని అన్నారు. ఈనెల 22వ తేదీన అల్లూరి నడయాడిన ప్రాంతాల్లో పర్యటించి రూ.50 కోట్లతో ఒక సర్క్యూట్ ఏర్పాటుచేయనున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు.

పింగళి వెంకయ్యను స్మరించుకున్న ఉపరాష్ట్రపతి వారిపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వారి జయంతి సందర్భంగా పింగళి కుటుంబ సభ్యులను కలిసి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

ప్రముఖ తెలుగు గాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడైన ఘంటసాల వెంకటేశ్వరరావు శతజయంతిని కూడా కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు.
తెలుగువారెక్కడున్నా ఐకమత్యంతో దేశ సమగ్రత కోసం పాటుపడాలని ఆయన సూచించారు. ఈ దిశగా ఆంధ్ర అసోసియేషన్ చేస్తున్న కృషిని ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి  కోటగిరి సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు  నజీర్ ఖాన్, మేనేజింగ్ ట్రస్టీ మట్టా పశుపతి, సెక్రటరీ సిలార్ ఖాన్ తోపాటు అసోసియేషన్ ప్రతినిధులు, ఢిల్లీలోని తెలుగు ప్రజలు పాల్గొన్నారు.

Check Also

ఇచ్చిన హామీలను ప్రాధాన్యత క్రమంలో  లబ్ధిదారులకు వాటి ప్రయోజనాలను అందజేశాం.

-ధైర్యంగా నేడు వారి ఇంటి ముందుకే వెళుతున్నాం. -ప్రభుత్వ ఏర్పడిన మొదటి 100 రోజుల్లోనే లబ్ధిదారులకు హామీలను అమలు చేసింది …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *