-అలిపిరి పాదాలమండపం వద్ద ఘనంగా మెట్లపూజ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్వంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం శనివారం తెల్లవారుజామున తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద వైభవంగా జరిగింది. దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి పి.ఆర్.ఆనందతీర్థాచార్యులు ముందుగా మెట్లపూజ నిర్వహించి మెట్లోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పి.ఆర్.ఆనందతీర్థాచార్యులు మాట్లాడుతూ బ్రహ్మముహూర్తంలో కాలినడకన మెట్లను అధిరోహించి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో పుణ్యఫలమన్నారు. పూర్వం శ్రీ పురందరదాసులు, శ్రీ వ్యాసరాజయతీశ్వరులు, శ్రీమాన్ అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తిప్రపత్తులతో తిరుమల కొండలను అధిరోహించి స్వామివారి వైభవాన్ని దశదిశలా వ్యాప్తి చేశారని వివరించారు. అలాంటివారి అడుగుజాడలలో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో టీటీడీ మెట్లోత్సవాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులతో పాటు భజన మండళ్ల సభ్యులు, సంఘాలు పాల్గొన్నారు.