– బాధితురాలి వైరల్ వీడియోపై స్పందించిన ‘ఏపీ మహిళా కమిషన్’
– దేశానికి రప్పించేందుకు పూనుకున్న కమిషన్ సభ్యులు గజ్జల లక్ష్మి
తిరుపతి, నేటి పత్రిక ప్రజా వార్త :
తిరుపతి జిల్లా నుంచి ఉపాధికి గల్ఫ్ దేశానికి వెళ్లిన మహిళను అక్కడి ఏజెంట్లు వేధిస్తున్న వైనంపై ‘ఏపీ మహిళా కమిషన్’ తీవ్రంగా స్పందించింది. తక్షణమే బాధితురాలిని రక్షించి దేశం తీసుకొచ్చేందుకు కమిషన్ కసరత్తు ప్రారంభించింది. మహిళా కమిషన్ సభ్యులు గజ్జల లక్ష్మి స్వయంగా రంగంలోకి దిగి బాధితురాలిని కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వివరాల్లోకొస్తే…
తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలం బోడెవడ్లపల్లి పంచాయతీలోని చెట్టి హరిజనవాడకు చెందిన కె.సులోచన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తన బాధలను అదే మండలానికి చెందిన ఏజెంట్ రత్నమ్మ చెప్పుకోగా ఆమె తన పరిచయ సంబంధాలతో గల్ఫ్ ఏజెంట్ లను కుదిర్చింది. సులోచన మస్కట్ దేశానికి వెళ్లాక, అక్కడ ఎదురైన పరిస్థితుల నేపథ్యంలో ఆమె మరలా ఇక్కడికొచ్చేందుకు ప్రయత్నం చేసింది. అయితే, మస్కట్ విడిచి పోవాలంటే తమకు రూ. 20 లక్షలు ఇవ్వాలంటూ బెదరిరిస్తూ…తీవ్రంగా శారీరక, మానసిక వేధింపులకు గురిచేశారని, ఈ క్రమంలో కాలు గాయపడటంతో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నట్లు వైరల్ వీడియోలో బాధితురాలు కె.సులోచన చెప్పింది. దీనిపై సులోచన బంధువులు స్థానిక పోలీసులకు ఫిర్యాదిచ్చారు. ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలు, రాయలసీమ జిల్లాల పర్యవేక్షకులు గజ్జల లక్ష్మి తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటో కేసుగా స్వీకరిస్తుందని… తక్షణమే బాధితురాలిని రక్షించే ఏర్పాట్లకు పూనుకోవాలని గురువారం ఏపీ ఎన్.ఆర్.టీ కార్యాలయానికి వెళ్లి లేఖను అందించి సీఈవో మాట్లాడారు. అదేవిధంగా విదేశీ పర్యటనలో ఉన్న ఏపీ ప్రభుత్వ సలహాదారు, ఏపీ ఎన్.ఆర్.టీ అధ్యక్షులు మేడపాటి ఎస్. వెంకట్ తో కూడా ఆమె ఫోన్ లో మాట్లాడి మస్కట్ బాధితురాలు కె. సులోచన విషయం వివరించారు. ఆమెను
స్వగ్రామం రప్పించేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ, ఇంటర్ పోల్ తో పాటు భారత రాయబార కార్యాలయంతో మాట్లాడించేందుకు గజ్జల లక్ష్మి ప్రయత్నించారు. బాధితురాలి వీడియో వైరల్ అనంతరం ఆమె సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్ అవ్వడానికి తీవ్రంగా పరిగణలోకి తీసుకుని సత్వరమే భారత రాయబార కార్యాలయం టీమ్ రంగంలో దిగాలని ఆమె కోరారు. ఏపీ ఎన్.ఆర్.టి అధికారుల హామీమేరకు గజ్జల లక్ష్మి బాధితురాలి బంధువులకు ఫోన్ చేసి మాట్లాడారు. బాధితురాలు సులోచనను దేశానికి రప్పించే కసరత్తును వివరించారు. భవిష్యత్తులోనూ గల్ఫ్ దేశాలలో ఉపాధికి వెళ్లిన మహిళల భద్రత, రక్షణ పర్యవేక్షణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ తగిన ప్రణాళికను అమలు చేస్తుందని మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జల లక్ష్మి స్పష్టం చేశారు.