రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజా వార్త :
జిల్లాలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పనే ధ్యేయంగా కంపెనీ ప్రతినిధులతో సంప్రదించి నిర్దుష్టమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డా. కె . మాధవీలత పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డిగ్రీ మరియు ఇంజనీరింగ్ రంగంలో మార్పిడి కార్యక్రమం, కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ ద్వారా చేపట్టే ఇంటర్న్ షిప్ కార్యక్రమం పై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా కె. మాధవీలత మాట్లాడుతూ, విద్యతో పాటు గా యువత కోసం జీవన భృతి కి భరోసా ఇచ్చే కార్యక్రమాలను రూపొందించాలన్నారు. ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధన్యతను ఇస్తున్న విషయం తెలిసిందే అన్నారు. యువతకు విద్య పూర్తి చేసిన తదుపరి ఉద్యోగ కల్పన కల్పించాలన్నదే ముఖ్యమంత్రి ఉద్దేశ్యం అన్నారు. ఇందుకు నైపుణ్యం అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఇందుకు స్థానికంగా ఉండే పరిశ్రమలకు సంబందించిన వృత్తి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు సమాంతరంగా చేపట్టవలసి ఉందన్నారు. ఈ ఏడాది వార్షిక విద్యా సంవత్సరంలో అరులైన 7,985 మంది విద్యార్థులను గుర్తించగా వారిలో 7,979 మందికి ఉపాధి ఉద్యోగ కల్పన కోసం ఎంపిక కావడం జరిగిందన్నారు. కంప్యూటర్ సైన్స్ రంగంలో 3,465 మంది, బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ లలో 2070 మంది, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్, సామాజిక రంగంలో 1,045 మంది, బ్యాంకింగ్ రంగంలో 1,179 మంది, ఇతర రంగాల్లో 220 మందికి వారికి ఆసక్తి ఉన్నా రంగాల్లో అవకాశాలు కల్పించేందుకు ఎంపిక జరిగిందన్నారు. జిల్లాలో డిగ్రీ, ఇతర ఉన్నత చదువులు వచ్చే విద్యా సంవత్సరం నాటికి పూర్తి చేసే వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నిర్దుష్టమైన చర్యలు తీసుకోవడం లో భాగంగా ఈ ఎంపికలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. రానున్న కాలంలో జిల్లా పరిధిలో ఉన్న వివిధ కంపెనీ లకు అవసరమైన నైపుణ్యం పెంచే విధంగా ఆయా కంపెనీ లతో చర్చించి శిక్షణా కార్యక్రమాలపై సమగ్ర నివేదికను సిద్దం చెయ్యాలని కలెక్టర్ మాధవీలత ఆదేశించారు. ఇందుకోసం ఆయా కంపెనీ లకి ఉపయుక్తమైన అంశాల పై వారి ద్వారా నే ఇంటర్న్ షిప్, అప్రంటేస్, ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయ్యాల్సి ఉందన్నారు. జిల్లాలో ఉద్యానవన, వ్యవసాయ, ఇతర శాఖల పరిధిలో కూడా అందుబాటులో ఉండే ఉపాధి అవకాశాల ను పరిగణన లోకి తీసుకుని ఆయా రంగాల్లో నైపుణ్యం అవసరం అయిన వాటికి అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చెయ్యమని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి బి. వెంకటేశ్వర రావు, జిల్లా హార్టికల్చర్ అధికారి వి. రాధాకృష్ణ, కార్మిక శాఖ సహాయ కమిషనర్ బి ఎస్.ఎం. వలి, జిల్లా వ్యవసాయాధికారి ఎస్. మాధవరావు, డి ఎమ్ హెచ్ ఓ డా ఎన్. వసుంధర, వికాస్ డైరెక్టర్ లచ్చా రావు, పరిశ్రమలు, కంపెనీల శాఖ, పలువురు ప్రవేటు పరిశ్రమల, సంస్థల ప్రతినిధులు
పాల్గొన్నారు.