-రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-30 వ డివిజన్ 250 వ వార్డు సచివాలయ పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్ర ప్రజలకు సుపరిపాలనను అందించడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్న సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. 30 వ డివిజన్ 250 వ వార్డు సచివాలయ పరిధిలో చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి శుక్రవారం ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మధ్యకట్టలోని కమ్యూనిటీ హాల్ వద్ద నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులు పాదయాత్ర ప్రారంభించి.. 310 గడపలను సందర్శించారు. ఏఏ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎంత సాయం అందిందో బుక్ లెట్ల ద్వారా వివరించారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ పాలన సాగిస్తున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. గతంలో పాలన అంతా ఒకేచోట కేంద్రీకృతమై ఉండేదని.. కానీ వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక పాలన వికేంద్రీకరణ ద్వారా గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలు అందుతున్నాయన్నారు. ఏదైనా సమస్యపై సచివాలయాలను ఆశ్రయిస్తే.. 72 గంటల్లోనే పరిష్కారం లభిస్తుందని తెలియజేశారు. అనంతరం స్థానిక సమస్యలపై ఆరా తీశారు. వర్షపు నీరు రహదారులపై నిలిచిపోకుండా.. స్ట్రామ్ డ్రెయిన్ల నిర్మాణం ద్వారా మళ్లించాలని ఇంజనీరింగ్ సిబ్బందికి సూచించారు.
ప్రజల సహకారంతోనే పర్యావరణ పరిరక్షణ
పరిసరాల పరిశుభ్రత, మెరుగైన పారిశుద్ధ్యం ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని మల్లాది విష్ణు అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా మధ్యకట్టలోని ఖాళీ స్థలంలో పిచ్చి మొక్కలు, గడ్డిని తొలగించి ఆకర్షణీయమైన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పరిసరాల పరిశుభ్రత ప్రాముఖ్యతను స్థానికులకు వివరించారు. మన నివాస ప్రదేశాలు, వాటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడాన్ని ప్రతిఒక్కరూ అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. రేపటి తరాలకు ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రధానంగా కాలుష్యాన్ని అరికట్టవలసిన అవసరం ఉందన్నారు. అప్పుడే ఆరోగ్యకర సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని తెలియజేశారు. స్వచ్ఛ సర్వేక్షణ్ లో దేశంలోనే విజయవాడ నగరం మూడవ స్థానంలో ఉందని.. ప్రథమ స్థానం సాధించేందుకు ప్రతిఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
పేదవాడి గుండె చప్పుడు తెలిసిన డాక్టర్.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్భుత పాలన సాగుతోందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు అన్నారు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. కరోనా సమయంలో ప్రతిపక్ష నేతల్లా హైదరాబాద్ కు వెళ్లి దాక్కోకుండా.. రాష్ట్ర ప్రజలకు సీఎం వైఎస్ జగన్ అండగా నిలిచారని పేర్కొన్నారు. కనుకనే కేటీఆర్ సహా దేశంలోనే పలువురు ప్రముఖులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనను, అనుసరిస్తున్న విధానాలను సమర్థిస్తున్నారని చెప్పుకొచ్చారు. దీంతో చంద్రబాబుకి, తెలుగుదేశం నాయకులకి ఏడుపే ఏడుపు దినచర్యగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. ఆనాడు పదవీకాంక్షతో ఎన్టీఆర్ గారి నుంచి పార్టీని లాక్కుని, ఆయన మరణానికి కారణమైన చంద్రబాబు.. నేడు ఎన్టీఆర్ పై లేని ప్రేమ నటిస్తున్నారని మల్లాది విష్ణు విమర్శించారు. కానీ ఇచ్చిన మాట ప్రకారం జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి.. ఆయనపై సీఎం వైఎస్ జగన్ తన గౌరవాన్ని చాటారన్నారు. ఒక డాక్టర్ గా పేదవాడి గుండె చప్పుడు తెలిసిన వ్యక్తి మహానేత వైఎస్సార్ అని మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో లక్షలాది మంది నిరుపేదల గుండెలు ఆగిపోకుండా ఉన్నాయంటే.. వైద్య రంగంలో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలే ప్రధాన కారణమన్నారు. ఆ మహనీయుని చలువతో వేలాది మంది నిరుపేద విద్యార్థులు వైద్య విద్య పూర్తిచేసుకుంటున్నారని తెలిపారు. కనుక ఆ మహానేత సువర్ణ పాలనకు గుర్తుగా, ప్రజలు ఆయన సేవలను స్మరించుకునే విధంగా హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టడం సమంజసమేనని పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ జానారెడ్డి, జోనల్ కమిషనర్(ఇంఛార్జి) అంబేద్కర్, డీఈలు గురునాథం, రామకృష్ణ, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, నాయకులు గోపిశెట్టి శ్రీను, డి.దుర్గారావు, సాసుపల్లి రామకృష్ణ, మార్తి చంద్రమౌళి, ప్రసాద్, మనోహర్, సాంబ, ఈశ్వర్, దుర్గరాజు, ముద్రబోయిన దుర్గారావు, పవన్ రెడ్డి, పెద్దిరాజు, భోగాది మురళి, ఇతర నాయకులు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.