Breaking News

విజయవాడలో ” ఆంధ్రా గోపుష్టి ” బ్రాండ్ పేరుతో పాలు, పాల ఉత్పత్తుల విక్రయ కేంద్రం ప్రారంభం…

-వినియోగదారులకు అందుబాటులో 27 రకాలైన పాల ఉత్పత్తులు..
-రైతు శ్రేయస్సే రాష్ట్ర శ్రేయస్సుగా నమ్మిన ముఖ్యమంత్రి డా. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి..
-రూ. 17 కోట్ల 40 లక్షలతో 58 డా. వై.ఎస్.ఆర్. దేశీయ గోజాతుల పెంపక కేంద్రాలు ఏర్పాటు..
-రెండవ దశలో 50 డా. వై.ఎస్.ఆర్. దేశీయ గోజాతుల పెంపక కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు..
-రాష్ట్ర పశుసంవర్ధక శాఖా మంత్రి డా. సీదిరి అప్పల రాజు..
-రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా స్వచ్ఛమైన ఆవు పాలు మరియు పాల ఉత్పత్తులను ” ఆంధ్ర గోపుష్టి ” బ్రాండ్ తో పట్టణ ప్రాంత ప్రజలకు అందుబాటులోనికి తీసుకువచ్చామని రాష్ట్ర పశుసంవర్ధక శాఖా మంత్రి డా. సీదిరి అప్పల రాజు అన్నారు. విజయవాడ పశుసంవర్ధక శాఖ కార్యాలయ ఆవరణలో ఆంధ్ర గో పుష్టి రిటైల్ అవుట్ లెట్ ను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మంగళవారం ప్రారంభించారు.
దేశవాళీ జాతులు అంతరించిపోకుండా గోజాతులను పెంపొందించేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో 58 డా. వై.ఎస్.ఆర్. దేశీయ గోజాతుల పెంపక కేంద్రాలను ప్రారంభించారని మంత్రి అన్నారు. జాయింట్ లయబిలిటీ గ్రూప్ ల ద్వారా ఏర్పాటు చేసిన దేశీయ గోజాతుల పెంపక కేంద్రాల సభ్యులు డైరెక్టర్ లుగా ఉంటూ పాలు, పాల ఉత్పత్తులను ” ఆంధ్ర గోపుష్టి ” బ్రాండ్ పేరుతో వినియోగదారులకు అందుబాటు ధరలో అందించడం జరుగుతుందని మంత్రి అప్పల రాజు అన్నారు. రెండవ దశగా 50 డా. వై.ఎస్.ఆర్. దేశీయ గోజాతుల పెంపక కేంద్రాలను ప్రారంభించాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు.
విజయవాడ నడిబొడ్డున ఆంధ్ర గోపుష్ట్రి బ్రాండ్ తో ఆవుపాలు మరియు పాలఉత్పత్తుల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించడం ఎంతో శుభ పరిణామమని అన్నారు. ప్రతి వై.ఎస్.ఆర్. దేశీయ గోజాతుల పెంపక కేంద్రంలో అడిషనల్ డైరెక్టర్ స్థాయి అధికారిని ఇంచార్జి గా నియమించామన్నారు. రైతులకు, వినియోగదారులకు మేలైన పరిస్థితులు కల్పించే విధంగా ఈ ఉత్పత్తులను అందుబాటులోనికి తీసుకువచ్చామన్నారు. ఈ కేంద్రంలో 27 రకాలైన గో ఉత్పత్తులైన పాలు, నెయ్యి, పన్నీరు, పెరుగు, మజ్జిగ మొదలగు ఉత్పత్తులతో పాటు A2 ఆవు పాలతో తయారు చేసిన టీ, కాఫీ, బాదం పాలు మొదలగు పానీయాలు ఈకేంద్రంలో వినియోగదారులకు అందుబాటులో ఉంచామన్నారు.
దేశంలోనే ప్రప్రధమంగా సేంద్రీయ పద్దతులతో A2 పాలు మరియు పాలఉత్పత్తులు ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా దేశీయ గో జాతులను పరిరక్షించడమే కాకుండా వాటికీ మార్కెటింగ్ సదుపాయాలను కల్పించడం సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం మొదటి దశగా రూ. 17 కోట్ల 40 లక్షలతో 58 వై.ఎస్.ఆర్ దేశీయ గోజాతుల పెంపక కేంద్రాలను ఏర్పాటు చేసి పాడిరైతులకు తగిన శిక్షణ అందిస్తున్నామన్నారు. ఎటువంటి రసాయనిక ఎరువులు, యాంటీ బయాటిక్స్ వాడకుండా సేంద్రీయ పద్దతుల ద్వారా ఉత్పత్తి చేసిన ఈపాలు మరియు పాలఉత్పత్తులకు మంచి గిరాకీ ఉంటుందని మంత్రి సీదిరి అప్పల రాజు అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ పూర్వీకులు గోవులను సంరక్షించుకుని పాలఉత్పత్తులను వాడడం వలన ఎంతో ఆరోగ్యంగా ఉండేవారని ప్రస్తుత కాలంలో దేశవాళీ జాతులు అంతరించిపోతున్న తరుణంలో ప్రభుత్వం దేశీయ గోజాతులను సంరక్షించేందుకు వై.ఎస్.ఆర్. దేశీయ గోజాతుల పెంపక కేంద్రాలను ప్రారంభించి రైతులను ప్రోత్సహిస్తున్నదన్నారు. ఆవు నెయ్యిని ఆయుర్వేద శాస్త్రంలో అమృతం అని పిలుస్తారన్నారు.
మూడున్నరేళ్ల ప్రభుత్వ పాలనలో రైతు శ్రేయస్సును రాష్ట్ర శ్రేయస్సుగా నమ్మి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారన్నారు. రైతులు తమ కాళ్ళ మీద నిలబడి వ్యవసాయంలో మెరుగైన ఫలితాలను సాధించే విధంగా మెరుగైన ఆదాయం పొందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పధకాలను అమలు చేస్తున్నదన్నారు. రైతుకు స్థిరమైన ఆదాయం కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రాష్ట్రం పచ్చగా సుఖ సంతోషాలతో ఉండాలని, రైతులు వ్యవసాయంతో పాటు పశుసంపదను కూడా వృద్ధి చేసుకోవాలన్నారు. పూర్వీకులు గోవులను సంరక్షించడంతో పాటు గో ఉత్పత్తులను వినియోగించేవారని అందువల్లనే వారు ఆరోగ్యంగా ఉన్నారన్నారు. విజయవాడ నడిబొడ్డులో ఆంధ్ర గోపుష్టి బ్రాండ్ తో రైతులే యజమానులుగా పాలు, పాల ఉత్పత్తుల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉన్నదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా. పూనం మాలకొండయ్య, పశుసంవర్ధక శాఖ సంచాలకులు డా. ఆర్. అమరేంద్రకుమార్, పశుసంవర్ధక శాఖ అధికారులు మరియు జాయింట్ లయబిలిటీ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *