-జాతీయ రహదారులపై టూ వీలర్ వాహనదారులు తప్పనిసరి హెల్మెట్ ధరించాలి: జిల్లా కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని రోడ్డు భద్రతా ప్రమాణాలు తప్పక అమలు జరిగేలా సంబంధిత శాఖలు చూడాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా రోడ్డు భద్రతా కమిటీ చైర్మన్ కె.వెంకటరమణా రెడ్డి ఆదేశించారు. మంగళవారం మద్యాహ్నం స్థానిక కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ అద్యక్షతన రోడ్డు భద్రతా కమిటీ సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరం ప్రమాదాలతో పోల్చుకుంటే 3 శాతం అధికంగా జరిగాయని జీరో ప్రమాదాలు లక్ష్యంగా సంబందిత శాఖలు పని చేయాలని అన్నారు. ప్రమాదాలు జరిగిన వెంటనే వైద్య సహాయం అందించేలా జిల్లా వైద్య శాఖ, పోలీసు, ట్రాన్స్పోర్ట్, శాఖల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రమాదం జరిగిన వివరాలను ఐ.ఆర్.ఎ.డి. వెబ్ సైట్ నందు పోలీసు, వైద్య శాఖలు నమోదు చేయాల్సి ఉంటుందని, ఈ వివరాలను కేంద్రంలో దేశంలోని ప్రమాదాలు ఒకే చోట చూసి, అధ్యయనం చేసి మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు విడుదల చేయడానికి అవకాశం ఉంటుందని అన్నారు. ప్రధానంగా ప్రమాదం జరిగిన వెంటనే కాపాడిన వారికి గుడ్ సమరటిన్ కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందిస్తుందని ఇందుకు సంబందించిన పోస్టర్లను సచివాలయాలలో, ఆసుపత్రులలో, పోలీసు స్టేషన్ లలో ప్రదర్శించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. బారీ వాహనాల డ్రైవర్ లకు విశ్రాంతి కొరకు వడమాలపేట వద్ద మల్టి కాంప్లెక్స్ నిర్మించనున్నామని అలాగే చిత్తూరు – నాయుడుపేట మద్యలో మరొకటి ఏర్పాటుకు సంబందిత ఆర్.డి.ఓ లు స్థల పరిశీలన చేయాలని సూచించారు. బాకరాపేట ఘాట్ నందు చేపట్టవలసిన భద్రతా పనులను పూర్తి చేసినందుకు సంతోషమని అన్నారు. సి.మల్లవరం – గాజులమండ్యం రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి కూడళ్ళలో సిగ్నల్స్ ఏర్పాటు, బ్లిన్కర్స్ ఏర్పాటు కావాలని ప్రస్తుతం మరమ్మత్తులు ప్రారంభించారని డిసెంబర్ నాటికి పూర్తి కావాలని సూచించారు. ప్రధానంగా ప్రస్తుతం గాజులమండ్యం – నాయుడుపేట జాతీయ రహదారి నిర్మాణం సాగుతున్నదని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని పోలీసు, ట్రాన్స్పోర్ట్, రెవిన్యూ సంయుక్త పరిశీలనతో అవసరమైన వేగనిరోదకాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్.ఐ.సి. రోడ్డు భద్రతపై రహదారి దగ్గరలో ఉన్న సచివాలయాల వాలింటర్లకు శిక్షణ ఇచ్చి ప్రమాదాల బారిన పడిన వారి ప్రాణాలు కాపాడేలా చూడాలని డివిజనల్ డెవలప్ మెంట్ అధికారి వెంటనే దృష్టి పెట్టాలని అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహణ, హై వే లపై టూ వీలర్ ప్రయాణికులు హెల్మెట్ తప్పనిసరి చేయాలని సూచించారు. తిరుపతి నగరానికి సంబంధించి ఉప్పరపల్లి, వైకుంటపురం, బాలాజీ కాలనీ, టౌన్ కల్బ్, టి.ఎం.ఆర్. జంక్షన్, శ్రీనివాస కళ్యాణ మండపాల జంక్షన్ లలో ఫ్రీ లెఫ్ట్ రహదారుల నిర్మాణాలు నగరపాలక కమీషనర్ చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ సమీక్షలో రోడ్డు భద్రతా కమిటీ కన్వీనర్ డి.టి.ఓ సీతారామి రెడ్డి, ఎ.పి.ఎస్.ఆర్.టి.సి ఆర్.ఎం.- టి.చంగల్ రెడ్డి, వే ఫౌండేషన్- డా.పైడి. అంకయ్య, 108 అంబులెన్స్ సర్వీసెస్ – బి.మోహన్ బాబు, స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ – డా,రామ్, డా.కోటి రెడ్డి, ఎన్.హెచ్.ఎ..ఐ అధికారులు టి.దుర్గా ప్రసాద్ రెడ్డి, ఓ.నాగరాజ, డి.ఈ.ఈ., జి.వెంకటేశ్వరులు, మేనేజర్, ఆర్ అండ్ బి అధికారి సి.సుధాకర్ రెడ్డి, మెడికల్ ఆఫీసర్ డా.ఎన్.ఆర్.రిచా శర్మ, పశుసంవర్థక శాఖ ఎ.డి. డా.అప్సర్ సైయద్, మొహమ్మద్ అలీ ఖాన్, తిరుపతి ఎన్.హెచ్. 71 అధికారులు కే.దాశరధ రామయ్య, ప్రాజెక్ట్ మేనేజర్ ఎం.మల్లికార్జున రావు, మేనేజర్ సేఫ్టీ సెక్షన్ విజయ్ రాథోడ్, సీనియర్ మేనేజర్ సర్వే ఎం.రామ కృష్ణ, కే.హనుమంత నాయక్, ట్రాన్స్పోర్ట్ అధికారులు శ్రీనివాస రావు, కుసుమ, స్వర్ణలత, సుబ్రహ్మణ్యం, మోహన్ కుమార్, శ్వేత బిందు, ఎ.ఓ. శ్రీనివాస రావు, కిషోర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.