-జైలు నుండి బయటకు వచ్చాక నేరాల జోలికి పోనిరీతిలో ఖైదీలను తీర్చిదిద్దాలి
-శిక్షా కాలంలోనే ఖైదీలకు తగిన స్వయం ఉపాధి శిక్షణ ఇవ్వాలి
-ఖైదీలలో సత్ప్రవర్తన కలిగించేందుకు జైలు అధికారులు పూర్తిగా కృషి చేయాలి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని వివిధ జైళ్ళలోని పరిస్థితులపై అమరావతి సచివాలయం రెండవ బ్లాకులో మంగళవారం రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత జైళ్ళశాఖ అధికారులతో సమీక్షించారు.ఈసందర్భంగా రాష్ట్రంలోని వివిధ సెంట్రల్ జైళ్ళు,సబ్ జైళ్ళు సహా ఇతర జైళ్ళలోని స్థితిగతులను జైళ్ళ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.ముఖ్యంగా జైళ్ళలో ఉండే ఖైదీలకు కల్పిస్తున్న సౌకర్యాలు,ఖైదీల సత్ప్రవర్తనకు జైళ్ళ అధికారులు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు.అదే విధంగా వివిధ జైళ్ళలో సిసి కెమెరాలు అందుబాటులో ఉన్నాయా అని జైళ్ళ సూపరింటెండెంట్లను అడగ్గా చాలా వరకు అందుబాటులో ఉన్నట్టు అధికారులు మంత్రికి వివరించారు.అదే విధంగా జైళ్ళలో సిబ్బంది పరిస్థితులు ఇతర అంశాలపై హోంమంత్రి తానేటి వనిత సమీక్షించారు.ఖైదీలకు సంబంధించి ఆరోగ్య పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను ఆమె అడిగి తెల్సుకున్నారు.ఖైదీలకు నైపుణ్య శిక్షణ ఏవిధంగా ఇస్తున్నది తదితర అంశాలను జైళ్ళ శాఖ అధికారులతో హోం మంత్రి తానేటి వనిత సమీక్షించారు.శిక్షా కాలం పూర్తయ్యాక జైలు నుండి బయటకి వచ్చిన వారు మరలా నేరాలకు పాల్పడకుండా సత్ప్రవర్తనతో మెలిగే విధంగా వారి నడవడికలో పూర్తి మార్పులు తీసుకువచ్చేందుకు జైలు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని హోంమత్రి తానేటి వనిత స్పష్టం చేశారు.అంతేగాక జైలు నుండి బయటకు వచ్చిన వెంటనే ఏదొక ఉపాధి అవకాశం పొందే రీతిలో జైలులోనే ఖదీలకు తగిన ఉపాధి శిక్షణ అందించాలని హోంమంత్రి తానేటి వనిత జైళ్ళ అధికారులను ఆదేశించారు.
ఈసమావేశంలో హోంశాఖ ముఖ్యకార్యదర్శి హరీశ్ కుమార్ గుప్తా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్ర కారాగారాలు,జిల్లా జైళ్ళు,సబ్ జైళ్ళలో గల ఖాళీల భర్తీ తోపాటు తగిన వాహనాలు సమకూర్చాల్సిన అవసరం ఉందని హోంమంత్రి దృష్టికి తెచ్చారు.
జైళ్ళ శాఖ డిజిపి హసన్ రాజా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జైళ్ళలో గల పరిస్థితులను హోంమంత్రికి వివరించారు.ముఖ్యంగా వివిధ జైళ్ళలోని ఖైదీలకు నిబంధనల ప్రకారం అందిస్తున్న ఆహారం,కల్పిస్తున్న వసతుల గురించి వివరించారు.అలాగే ఖైదీలకు కల్పిస్తున్న వివిధ ఉపాధి శిక్షణా కార్యక్రమాలు,ప్రాధమిక విద్య,వయోజన విద్యా కార్యక్రమాలు గురించి తెలియజేశారు.రాష్ట్రంలోని నాలుగు కేంద్ర కారాగారాల్లో 8 నైపుణ్య శిక్షణా కేంద్రాలు ఉన్నాయని వాటి ద్వారా ఖైదీలకు వివిధ అంశాల్లో నైపుణ్య శిక్షణను అందిస్తున్నట్టు తెలిపారు.బిఆర్ ఆంబేద్కర ఓపెన్ విశ్వవిద్యాలయం నుండి ఇద్దరు ఖైదీలు బంగారు పతకాలు సాధించారని వివరించారు.
ఈ సమీక్షా సమావేశంలో హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి విజయకుమార్,జైళ్ళ శాఖ డిఐజిలు డా.వరప్రసాద్,కిరణ్ లతో పాటు వివిధ కేంద్ర కారాగారాల సూపరింటెండెంట్లు తదితరుల పాల్గొన్నారు.